మనీ లాండరింగ్ కేసులో నిందితుడుగా పేర్కొనబడిన విజయ్ మాల్యాని ఆ కేసులో ప్రశ్నించేందుకు ముంబైలోని తమ విచారణాధికారి ముందు హాజరు కావాలని ఈడి అధికారులు మూడుసార్లు నోటీసులు పంపినప్పటికీ ఆయన ఇంకా సమయం కోరుతుండటంతో, ఈడి అధికారులు ఆయన పాస్ పోర్ట్ ని తక్షణం ఉపసంహరించుకోమని కోరుతూ డిల్లీలోని ప్రాంతీయ పాస్ పోర్ట్ కార్యాలయానికి ఇవ్వాళ్ళ ఒక లేఖ వ్రాసారు. కేంద్రప్రభుత్వం అనుమతి లేకుండా అటువంటి నిర్ణయాలు ఈడి తీసుకోగలదని అనుకోలేము కనుక ప్రాంతీయ పాస్ పోర్ట్ అధికారి ఈడి విజ్ఞప్తిని మన్నించి విజయ్ మాల్యా కి జారీ చేసిన పాస్ పోర్టును ఉపసంహరించుకొంటున్నట్లు త్వరలో ప్రకటించే అవకాశం ఉంది. అదే జరిగితే, విజయ్ మాల్యా లండన్ పారిపోయినప్పటికీ ఆయన వద్ద ఉన్న పాస్ పోర్ట్ నిరుపయోగంగా మారుతుంది. ఆయనకి బ్రిటిష్ లేదా వేరే దేశానికి చెందిన పాస్ పోర్ట్ ఉంటే పరువాలేదు లేకుంటే పాస్ పోర్ట్ లేకుండా లండన్ లో ఉంటున్నందుకు అక్కడి పోలీసులు ఆయనని అరెస్ట్ చేయవచ్చును. అప్పుడు అది మరో కధవుతుంది కనుక విజయ్ మాల్యా తనంతట తానే భారత్ తిరిగిరావచ్చును. ఆయనని భారత్ కి రప్పించేందుకు ఇంతకంటే మంచి మార్గం లేదు. ఆయనకి ఈ నెల 21లోగా సుప్రీం కోర్టు హాజరుకమ్మని నోటీసు జారీ చేసింది. కనుక ఆ లోగా ఆయన భారత్ తిరిగివస్తే సరేసరి లేకుంటే ఆయన పాస్ పోర్ట్ రద్దు చేయవచ్చును.