వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డికి ఈరోజు ఈడి చాలా పెద్ద షాక్ ఇచ్చింది. హైదరాబాద్ లో ఆయన లోటస్ పాండ్ నివాసం, బెంగళూరులో గల కామర్స్@మంత్రి భవన సముదాయం, హైదరాబాద్ లోని సాక్షి టవర్స్ లను తాత్కాలికంగా అటాచ్ చేసింది. అవి కాక వివిధ కంపెనీలలో జగన్మోహన్ రెడ్డి దంపతులకు గల షేర్స్ ని స్వాధీనం చేసుకొంది. ఈడి ఈరోజు అటాచ్ చేసిన ఆస్తుల విలువ మొత్తం రూ. 749 కోట్లని తెలిపింది. మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి హయంలో జగన్ కి చెందిన భారతి సిమెంట్స్ సంస్థకి రూ.152 కోట్లు విలువచేసే సున్నపురాయి గనులను అక్రమంగా కేటాయించబడినట్లు సిబిఐ దాఖలు చేసిన చార్జ్ షీట్ ఆధారంగా ఈడి జగన్ ఆస్తులను తాత్కాలికంగా జప్తు చేసినట్లు సమాచారం.
ఇంతవరకు ఈడి అనేకసార్లు జగన్మోహన్ రెడ్డికి చెందిన వందల కోట్లు విలువగల ఆస్తులను అటాచ్ చేసింది. వాటిఅపి ఈడి న్యాయస్థానంలో ఇంకా కేసులు నడుస్తున్నాయి. ఈరోజు ఏకంగా జగన్ నివాసం, పార్టీ ప్రధాన కార్యాలయాన్నే అటాచ్ చేయడం చాలా పెద్ద షాక్ అనే చెప్పవచ్చు. జగన్ డిల్లీ వెళ్లినప్పుడు ఆయనతో కేంద్రమంత్రులు చాలా సానుకూలంగా మాట్లాడుతున్నప్పటికీ, ఈ కేసుల వ్యవహారంలో మాత్రం కలుగజేసుకోవడం లేదని…ఎటువంటి రాజకీయ ఆలోచనలు చేయకుండా అక్రమాస్తుల కేసులని యధాప్రకారం కొనసాగించాలని కేంద్రప్రభుత్వం భావిస్తున్నట్లు స్పష్టం అవుతోంది. ఇటువంటి అక్రమాస్తుల కేసులని విచారించేందుకు ప్రత్యేక కోర్టులు ఏర్పాటుచేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అనుమతిస్తూ కేంద్రప్రభుత్వం ఒక ఆర్డినెన్స్ ఆమోదించింది కనుక రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏదో ఒకరోజు చర్యలకి సిద్దం కావచ్చు. ఒకవేళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ అక్రమాస్తుల కేసులపై చర్యలకి సిద్దమయితే మున్ముందు జగన్మోహన్ రెడ్డికి చాలా కష్టాలే ఎదుర్కోవలసి రావచ్చునేమో.