అక్రమాస్తుల కేసుల్లో ఆరోపణలకు సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) వైసీపీ అధ్యక్షుడు జగన్‌కు వ్యతిరేకంగా మరో పెద్ద ఉత్తర్వునిచ్చింది. గుంటూరు ప్రకాశం జిల్లాలలో వ్యాన్‌పిక్‌కు సంబంధించిన 11వేల ఎకరాల భూమిని నిమ్మగడ్డ ప్రసాద్ నుంచి స్వాధీనం చేసుకోవాలని ఆదేశించింది. దీని విలువ సుమారు 150 కోట్లు. వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో ప్రసాద్ కంపెనీకి 18 వేల ఎకరాల భూమిని చాలా హడావుడిగా కేటాయించారని, ఆ ఉత్తర్వు వచ్చేలోగానే ఆయన రంగంలోకి దిగి సేకరణ ప్రారంభించారని సిబిఐ ఆరోపించింది. ఈ కేటాయింపునకు ప్రతిగా నిమ్మగడ్డ ప్రసాద్ జగన్ ఆధ్వర్యంలోని జగతి పబ్లికేషన్స్, కార్మయిల్ ఏషియా తదితర సంస్థలలో 780 కోట్ల వరకూ పెట్టుబడులు పెట్టారని, మరో 57 కోట్లు నగదు ఇచ్చారనీ, వైఎస్ ఫౌండేషన్‌కు ఏడు కోట్లు విరాళం ఇచ్చారని సిబిఐ చార్జిషీటులో ఆరోపణలున్నాయి. మనీ లాండరింగ్‌లో భాగంగానే ఇదంతా జరిగిందంటూ ఇడి ఇప్పుడు భూమిని స్వాధీనం చేసుకుంటున్నది. గతంలోనూ ఇలాగే కొంత భూమిని తీసుకున్నది. నిజానికి ఈ భూమిలో ఎలాటి అభివృద్ది పనులు చేసే బాధ్యత నిమ్మగడ్డ కంపెనీలకు లేదని కేవలం లోపాయికారి అవగాహన వల్లనే కేటాయింపు చేశారని ఛార్జిషీటు పేర్కొంటున్నది. ఏమైనా ఈ దశలో ఇడి ఆదేశం జగన్‌కు రాజకీయంగా ఎదురుదెబ్బగానే చెప్పాలి. బిజెపితో చెలిమి వల్ల కేసులు వెనక్కు పోతాయని ఆయన శిబిరం ఆశిస్తున్న తరుణంలో వరుసగాకొన్ని వ్యతిరేక ఉత్తర్వులు రావడం విశేషం.