విశాఖ మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణతో పాటు ఆయనతో కలిసి భూదందాలు చేసిన ఆడిటల్ జీవీ, గద్దె బ్రహ్మాజీ వంటి వారిపై ఈడీ దాడులు నిర్వహించింది. వైసీపీ అధికారంలో ఉన్న ఐదేళ్ల కాలంలో వీరు చేసిన దందాలు, కబ్జాలు అన్నీ ఇన్నీ కావు. వీటి సెటిల్మెంట్లలో భాగంగానే ఆయన కుటుంబం కిడ్నాప్ డ్రామా నడిచిందన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో ఈడీ రంగంలోకి దిగడం సంచలనంగా మారింది. అరిలోవ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన ఓ కేసు నుంచి వివరాలు తీసుకుని ఈడీ ఈసీఐఆర్ నమోదు చేసింది.
విశాఖలో ఉన్న ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ హయగ్రీవ యజమాని జగదీశ్వరుడు ఫిర్యాదు మేరకు ఇటీవల ఎంవీవీ, జీవీ, బ్రహ్మాజీపై కేసు నమోదు అయింది. విశాఖలోని ఎండాడ కొండపై సర్వే నెంబరు 92/3లో గల 12 ఎకరాలను 2008లో హయగ్రీవ సంస్థ అధినేత చిలుకూరి జగదీశ్వరుడు ప్రభుత్వం నుంచి ఎకరా రూ.45 లక్షలకు కొన్నారు. వయోవృద్ధులకు హౌసింగ్ ప్రాజెక్టు కోసమని తక్కువకు కొనుగోలు చేసి మూడేళ్లలో ప్రాజెక్టు ప్రారంభించాల్సి ఉండగా నిర్మాణాలు చేపట్టలేదు.
వైసీపీ ప్రభుత్వం వచ్చాక అది ఆ పార్టీ నేతల చేతుల్లోకి వెళ్లిపోయింది. అక్కడ భారీ విల్లా ప్రాజెక్టులు కడుతున్నారు. కోర్టు కేసులు ఉన్నాయి. ఈ కంపెనీని అడ్డం పెట్టుకుని వైసీపీ నేతలు పెద్ద ఎత్తున మనీలాండరింగ్ కు పాల్పడ్డారన్న ఆరోపణలు ఉన్నాయి. తనను బెదిరించి ఖాళీ కాగితాలపై సంతకాలు పెట్టించుకుని ఆ భూమిని కబ్జా చేశారని జగదీశ్వరుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇప్పుడు వ్యవహారం అంతా ఎవరికి చుట్టుకుంటుదోనని వైసీపీ నేతలు కంగారు పడుతున్నారు.