కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ అధినేత విజయ్ మాల్యా వ్యవహారంలో ఈ.డి.అధికారులు ఇప్పుడు తాపీగా కేసులు నమోదు చేయడం చూస్తుంటే చేతులు కాలిన తరువాత ఆకులు పట్టుకొన్నట్లుంది. ఇంకా మోటుగా చెప్పాలంటే దొంగలు పడిన ఆరు నెలలకి కుక్కలు మొరిగినట్లుంది. అది కూడా ఈడి తను స్వయంగా కనిపెట్టిందేమీ లేదు. ఆయన వ్యవహారాలపై దర్యాప్తు చేస్తున్న సిబీఐ గత ఏడాది దాఖలు చేసిన ఒక ఎఫ్.ఐ.ఆర్. ఆధారంగా కింగ్ ఫిషర్ అధినేత విజయ్ మాల్యా, ఆ సంస్థ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ ఏ. రఘునందన్, మరి కొందరు ఉన్నతాధికారులు, వారి సంస్థకు చట్ట వ్యతిరేకంగా రూ.600 కోట్లు అప్పులిచ్చిన ఐ.డి.బి.ఐ.బ్యాంక్ అధికారులకు ఈ.డి.అధికారులు మనీ లాండరింగ్ చట్టంలో పలు సెక్షన్స్ క్రింద కేసులు నమోదు చేసి, నోటీసులు జారీ చేసారు. విజయ్ మాల్యాతో సహా అందరూ వారి వ్యక్తిగత, మరియు సంస్థల గత ఐదేళ్ళ ఆదాయ, ఐటి రిటర్న్స్ వివరాలతో రెండు వారాలలోగా తమ ముందు హాజరవ్వలని ఆదేశిస్తూ అందరికీ ఈడి అధికారులు నోటీసులు పంపారు.
ఈ కేసులో ప్రశ్నించేందుకు ఐ.డి.బి.ఐ.బ్యాంక్ మాజీ చైర్మన్ మరియు మేనేజింగ్ డైరక్టర్ యోగేష్ అగర్వాల్ టో సహా మరో ఆరుగురు సీనియర్ అధికారులకు కూడా ఈ.డి. అధికారులు నోటీసులు జారీ చేసారు. వారిలో ఏ. రఘునందన్, కింగ్ ఫిషర్ కి చెందిన మరి కొందరు ఉన్నతాధికారులు రెండు రోజుల క్రితం ముంబైలోని ఈ.డి. అధికారుల ముందు హాజరయ్యారు. “కింగ్ ఫిషర్ పతనానికి మూలకారకుడు ఆ సంస్థ అధినేత విజయ్ మాల్యాయేనని, తనతో సహా అధికారులు అందరూ ఆయన ఆదేశాల మేరకే పనిచేసేవారమని” రఘునందన్ ఈ.డి. అధికారులతో చెప్పారు.
విజయ్ మాల్యా అప్పుల వ్యవహారం ఈరోజు కొత్తగా మొదలయిందేమీ కాదు. ఆయన ఆదాయ, వ్యయాలు, లాభ నష్టాలు, ఆర్ధిక లావాదేవీల గురించి ఆదాయపన్ను శాఖకు ఎప్పటి నుండో తెలుసు. తీవ్ర ఆర్ధిక సమస్యలతో సతమతమవుతున్న కారణంగా ఆయన తన కింగ్ ఫిషర్ విమాన సంస్థ ఉద్యోగులకు జీతాలు కూడా చెల్లించలేని పరిస్థితి ఏర్పడి, చివరికి కింగ్ ఫిషర్ మూలపడింది. అటువంటి పరిస్థితులలో కూడా ఆయన చాలా విలాసవంతమయిన జీవితం గడిపేవారని, తరచూ విదేశీయానాలు కూడా చేసేవారని దేశంలో అందరికీ తెలుసు. కానీ ఈ విషయాలన్నీ ఈ.డి.అధికారులకి మాత్రమే తెలియదనుకోవాలేమో? లేదా తెలిసీ ఇంతకాలం ఉపేక్షించారంటే దానర్ధం ఏమిటో? ఆయన దేశం విడిచి పారిపోయేవరకు మౌనంగా చూస్తూ కూర్చొని ఇప్పుడు హడావుడిగా ఆయనపై కేసులు నమోదు చేయడాన్ని ఏమనుకోవాలి?