బీఆర్ఎస్ హయాంలో సీఎస్‌గా పని చేసిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి సోమేష్ కుమార్ పై ఈడీ కేసు కూడా నమోదు కానుంది. తెలంగాణలో ఇంటిగ్రేటెడ్ జీఎస్టీ కి సంబంధించి రూ.1400 కోట్ల మేర ఐటీసీని క్లెయిమ్ చేసినట్లు, దీని వల్ల ప్రభుత్వ ఖజానాకు నష్టం వాటిల్లినట్లు సీసీఎస్ పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. ఇది వందల కోట్ల వ్యవహారం కాదని, మొత్తం స్కామ్ రూ.వేల కోట్లలో ఉంటుందని ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చి సమగ్ర దర్యాప్తు కోసం సీఐడీకి అప్పగించింది. మొదట సీసీఎస్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసు ఆధారంగా ఈడీ అధికారులు కేసు నమోదు చేశారు.
కుంభకోణం మొత్తం సోమేశ్‌కుమార్ కనుసన్నల్లోనే నడిచినట్లు ప్రభుత్వం భావిస్తోంది. బోగస్ ఇన్వాయిస్లను సృష్టించి, పెద్ద ఎత్తున ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ను క్లెయిమ్ చేసినట్లు వాణిజ్య పన్నుల శాఖ గత ఏడాది చివర్లో నిర్వహించిన ఆడిట్లో గుర్తించింది. ఈ కేసులో వస్తువులు సరఫరా చేయకపోయినా బోగస్ ఇన్వాయిస్ లను సృష్టించారని అధికారులు గుర్తించారు. సోమేశ్ కుమార్ తో పాటు మరో ముగ్గురు అధికారులకు సీఐడీ అధికారులు నోటీసులు ఇచ్చారు.
ఈ కేసులో ఏ1గా వాణ్యిజ్య పన్నుల అదనపు కమిషనర్ కాశీ విశ్వేశ్వరరావు, ఏ2గా ఉప కమిషనర్ శివరామ్ ప్రసాద్, ఏ3గా హైదరాబాద్ ఐఐటీ ప్రొఫెసర్ శోభన్ బాబు, ఏ4గా ప్లియంటో టెక్నాలజీస్ ఉండగా… సోమేశ్ కుమార్ ను ఏ5గా సీఐడీ పోలీసులు చేర్చారు. ఇందులో అక్రమ నగదు చెలామణి ఉన్నట్లుగా తేలడంతో ఈడీ కూడా రంగంలోకి దిగింది.