ఫార్ములా ఈ రేసు కేసులో ఈడీ కూడా కేసు నమోదు చేసింది. రూ. 55 కోట్లు అక్రమ నగదు తరలింపు కావడంతో ఏసీబీ కేసు నమోదు చేసిన వెంటనే ఈడీకి సమాచారం వెళ్లింది. ఏసీబీ ఎఫ్ఐఆర్ ప్రాతిపదికన ఈడీ ఈసీఐఆర్ నమోదు చేసినట్లుగా తెలుస్తోంది. నగదు విదేశాలకు తరలిపోవడంతో PMLAతో పాటు ఫెమా చట్టాల కింద కేసులు నమోదు చేసినట్లుగా తెలుస్తోంది. సాధారణంగా డబ్బుల అక్రమ చెలామణి అయినట్లుగా సమాచారం వస్తే ఈడీ కేసులు నమోదు చేస్తుంది. ప్రస్తుతం ఏసీబీ దాఖలు చేసిన కేసులో రూ. 55 కోట్ల తరలింపు కళ్ల ముందే ఉంది. అందుకే ఈడీ వదిలి పెట్టే అవకాశం లేదు.
రూ. 55 కోట్లను సదుద్దేశంతోనే చెల్లించామని కేటీఆర్ వాదిస్తున్నారు. అయితే అసలు కేసు అది కాదు. ప్రభుత్వ ఖజానా నుంచి చెల్లింపులు చేయాలంటే అనుమతులు ఉండాలి. అనుమతుల్లేకుండా తరలిస్తే అది అక్రమం అవుతుంది. అవి ఎవరికి చేరాయి.. కేసు నమోదు చేసిన వారికి వేరే రూపంలో చేరాయా అన్నది తర్వాత. అలా చేరితే మరింత తీవ్రమైన కేసు అవుతుంది. ఇక్కడ మనీలాండరింగ్ జరిగినట్లుగా స్పష్టమవుతోంది.
ఏసీబీ అధికారులు ఇప్పటికే కేసులు నమోదు చేసి.. ఫిర్యాదు దారు అయిన ఐఏఎస్ ఆఫీసర్ దానకిషోర్ నుంచి స్టేట్ మెంట్ తీసుకోబోతున్నారు. ఇవాళ ఆ ప్రక్రియ పూర్తి చేసి ఎఫ్ఐఆర్లో పేర్కొన్న ముగ్గురు నిందితులకు నోటీసులు జారీ చేసే అవకాశం ఉంది. మరింత లోతుగా దర్యాప్తు చేయాలనుకుంటే… రెండు, మూడు రోజులు డాక్యుమెంట్లు పరిశీలన చేసి ఆతర్వాత నోటీసులు జారీ చేయవచ్చు. ఈడీ అధికారులు మాత్రం.. దూకుడుగా ఉండే అవకాశం ఉంది.