తమిళ నాడు లో డీఎంకేను ఈడీతో ఎదుర్కోవాలని బీజేపీ డిసైడయినట్లుగా కనిపిస్తోంది. ఇప్పటికే ఓ మంత్రిపై ఈడీ దాడులు చేసి అరెస్ట్ చేసిన ఈడీ తాజాగా మరో మంత్రిపై గురి పెట్టింది. ఉన్నత విద్యాశాఖ మంత్రి కె పొన్ముడి కుటుంబానికి చెందిన ఆస్తులు, వ్యాపారాలపై దాడులు చేస్తున్నారు. మొత్తంగా తొమ్మిది చోట్ల సోదాలు జరుగుతున్నాయి. విలుప్పురం జిల్లాలోని మంత్రి ఇల్లు, సూర్య ఇంజినీరింగ్ కళాశాలలో కూడా తనిఖీలు జరుగుతున్నాయి. మంత్రి కుమారుడు ఎంపీగా ఉన్నారు.
సీఎం స్టాలిన్ … బీజేపీకి వ్యతిరేకంగా ఏర్పాటయిన విపక్ష కూటమి సమావేశం కోసం బెంగళూరు వెళ్లారు. ఇలా వెళ్లిన సమయంలోనే దాడులు జరగడంతో.. ఇదంతా రాజకీయ ప్రేరేపితమేనని డీఎంకే నేతలు మండి పడుతున్నారు. దక్షిణాదిలో బీజేపీ… తమిళనాడును గతంలో ఎప్పుడూ లేని విధంగా టార్గెట్ చేసుకున్నట్లుగా కనిపిస్తోంది. మోదీ వచ్చే ఎన్నికల్లో రామేశ్వరం నుంచి పోటీ చేస్తారన్న ప్రచారం జరుగుతోంది. అందుకే ముందుగా డీఎంకేను టార్గెట్ చేసుకుంటున్నారన్న అభిప్రాయం వినిపిస్తోంది.
మరో వైపు తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై ఓ లిస్ట్ తయారు చేసుకుని… ఆ లిస్ట్ ప్రకారం దాడులు జరుగుతాయనిప్రకటిచారు. అంతే నేతల్ని టార్గెట్ చేస్తున్నారు. దీంతో ఇదంతా అన్నామలై కనుసన్నల్లో జరుగుతోందని డీఎంకే నేతలు నమ్ముతున్నారు. తమిళనాడులో బీజేపీ వర్సెస్ డీఎంకే అన్న పరిస్థితి తేవడానికే ఇలా చేస్తున్నారని అంటున్నారు. ఈ రాజకీయాల్ని స్టాలిన్ ఎలా ఎదుర్కొంటారో కానీ.. దక్షిణాదిలో ఈ సారి బీజేపీ ఆయననే టార్గెట్ చేసుకున్నట్లుగా కనిపిస్తోందని రాజకీయవర్గాలు అంచనా వేస్తున్నాయి.