తెలుగుదేశం పార్టీ ఎంపీ.. సుజనా చౌదరిని ఎన్ఫోర్స్మెంట్ డైరక్టరేట్ అధికారులు వదిలి పెట్టడం లేదు. నెలలో రెండో సారి..సుజనా చౌదరి వ్యాపార సంస్థలపై దాడులు చేశారు. ప్రస్తుతం సోదాలు కొనసాగుతున్నాయి. సుజనా చౌదరికి చెందిన వ్యాపార సంస్థలు బ్యాంకుల నుంచి రూ. 304 కోట్లు రుణాలు తీసుకుని.. వాటిని షెల్ కంపెనీల ద్వారా దారి మళ్లించారనేది ప్రధానమైన ఆరోపణ. బ్యాంకులు సుజనా చౌదరిపై ఫిర్యాదు చేశాయని.. సీబీఐ కేసులు నమోదయ్యాయని ఈడీ వర్గాలు చెబుతున్నాయి. సుజనా చౌదరికి చెందిన స్ల్పెండిడ్ మెటల్స్, సుజనా యూనివర్శల్ ఇండస్ట్రీస్, సుజనా చౌదరి కార్పొరేట్ ఆఫీసుల్లో ఈ సోదాలు జరిగాయి. కీలక పత్రాలను… స్వాధీనం చేసుకున్నట్లు ఈడీ వర్గాలు మీడియాకు తెలిపాయి. నెల వ్యవధిలోనే రెండో సారి సుజనా చౌదరిపై .. ఈడీ దాడులు చేయడం.. రాజకీయవర్గాల్లో కలకలం రేపుతోంది.
తెలుగుదేశం పార్టీ అధినేత… చంద్రబాబు తమ పార్టీ నేతలపై .. కేంద్ర కుట్ర పూరితంగానే… దాడులు చేయిస్తోందని ఆరోపిస్తున్నారు. సుజనా చౌదరి.. తెలుగుదేశం పార్టీ హైకమాండ్ కు అత్యంత సన్నిహితంగా ఉంటారు. కొద్ది రోజులుగా.. టీడీపీకి ఆర్థిక సహకారం అందిస్తారని పేరు ఉన్న … నేతలు, వ్యాపార సంస్థలపై.. ఐటీ, ఈడీ దాడులు వరుసగా జరుగుతున్నాయి. సీబీఐ కూడా… రంగంలోకి దిగబోతోందన్న సమాచారంతో… ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాజకీయాల్లో కసి తీర్చుకునేందుకు రాజ్యాంగ సంస్థలను ప్రయోగిస్తే ఊరుకోబోమంటూ.. సీబీఐకి ఇచ్చిన జనరల్ కన్సెంట్ ను రద్దు చేసింది. దీంతో.. సీబీఐకి ఏపీలో అడుగు పెట్టే అవకాశం లేకుండా పోయింది. ఏ కేసు అయినా ప్రభుత్వం అనుమతిస్తేనే.. సీబీఐ ఏపీ పరిధిలో చేపట్టాల్సి ఉంటుంది. చివరికి బ్యాంకులు, ఇతర కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులపై వచ్చే ఆరోపణలపైన కూడా.. ఏపీ ప్రభుత్వ అనుమతితోనే దర్యాప్తు చేయాల్సి ఉంటుంది. అదే సమయంలో.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల అవినీతిని అరికట్టడానికి దాడులు చేసే అధికారు ఏపీ ఏసీబీకి ఉంది.
నిజానికి కేంద్రమంత్రిగా ఉన్నప్పటి నుంచి సుజనా చౌదరిపై ఆరోపణలు ఉన్నాయి. అప్పట్లో మారిషస్ బ్యాంక్ ఒకటి.. సుజనా కంపెనీలపై దావా వేసింది. అప్పట్లో కేంద్రమంత్రిగా ఉండటంతో.. ఆయనకు ఎలాంటి ఇబ్బందులు కలగలేదు. ఆ తర్వాత.. ఆయన సైలెంటయ్యారు. దాంతో బీజేపీలో చేరుతారన్న ప్రచారం జరిగింది. కానీ.. ఇటీవల మళ్లీ .. తెలుగుదేశం పార్టీలో యాక్టివ్ అయ్యారు. దాంతో.. ఈడీ … పదిహేను రోజులకో సారి… ఆయన ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు జరుపుతోంది. ఇది ఏ మలుపు తిరుగుతుందో మరి..!