ఒంగోలు నుంచి చెన్నైకు తరలిస్తూండగా పట్టుబడిన రూ. ఐదు కోట్ల 27 లక్షల వ్యవహారంపై ఎన్ఫోర్స్మెంట్ డైరక్టరేట్ దృష్టి పెట్టినట్లుగా తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ దుమారం రేపిన ఈ నగదు పట్టివేత అంశంలో పోలీసులు ఎలాంటి కేసులు నమోదు చేయలేదు. నగదు తరలిస్తున్న వాహనంలో పట్టుబడిన సొమ్ము మంత్రి బాలినేనిదని.. వాహనంలో పోలీసులకు చిక్కినవారు.. తమిళనాడు పోలీసులకు వాంగ్మూలం ఇచ్చినట్లుగా అక్కడి మీడియా ప్రకటించింది. అదే సమయంలో కారుపై.. గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబు స్టిక్కర్ ఉంది. తన స్టిక్కర్‌ను కారుకు పెట్టుకున్నవారిపై ఎస్పీకి ఫిర్యాదు చేస్తానని… ఆ సొమ్ముతో తనకు సంబంధం లేదని అన్నా రాంబాబు ప్రకటించారు. అయితే.. ఆ సొమ్ము పైన కానీ.. ఆ స్టిక్కర్లపై కానీ.. ఎవరూ ఫిర్యాదు చేయలేదు.. పోలీసులు ఎలాంటి కేసులు నమోదు చేయలేదు. కానీ.. వాటిని సోషల్ మీడియాలో ప్రశ్నించిన వారిపై మాత్రం కేసులు నమోదయ్యాయి.. అది వేరే విషయం.
ఆ సొమ్ము.. జగన్మోహన్ రెడ్డి జే ట్యాక్స్ సొమ్ము అని.. ఆయన కుటుంబీకులు.. చెన్నైలో సూట్ కేసు కంపెనీలు పెట్టి… విదేశాలకు సొమ్మును తరలిస్తున్నారని.. టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. అయితే.. రాజకీయ ఆరోపణలతో మాత్రమే సరిపెట్టుకోకుండా.. ఎన్ఫోర్స్మెంట్ డైరక్టరేట్‌కు ఫిర్యాదు చేశారు. శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు… ఈ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ఈడీ అధికారులకు ఆధారాలు సమర్పించారు. ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కింద… విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరారు. ఎంపీ ఫిర్యాదును స్వీకరించిన ఈడీ.. దర్యాప్తు ప్రారంభించినట్లుగా తెలుస్తోంది.
ఆ సొమ్ము తనదేనని.. తన వ్యాపార లావాదేవీల్లో వచ్చిందంటూ… వైసీపీ నేత.. బాలినేని అనుచరుడు నల్లమిల్లి బాలు అనే వ్యక్తి తెరపైకి వచ్చారు. అయితే.. అలా కోట్లకు కోట్లు తరలించడం.. నిబంధనలకు విరుద్ధం. రూ. రెండు లక్షల కన్నా ఎక్కున నగదును ఉంచుకోవడం నేరం. అంత పెద్ద మొత్తం పట్టుబడితే ఖచ్చితంగా అది బ్లాక్ లావాదేవీలేనని.. ఎవరికైనా సులువుగా అనుమానం. మంత్రి బాలినేని మీద తీవ్ర ఆరోపణలు రావడంతో.. నల్లమిల్లి బాలును తెరపైకి తెచ్చారని.. టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఆ డబ్బులు ఎక్కడివో.. ఎక్కడి నుంచి వెళ్తున్నాయో.. ఈడీనే తేల్చాల్సి ఉంది.