ఫోన్ ట్యాపింగ్ కేసు మరో టర్న్ తీసుకోబోతుందా..? ఈ కేసును ఈడీ దర్యాప్తు చేసే అవకాశం ఉందా..? అంటే అవుననే అంటున్నాయి పోలీసు వర్గాలు.
ఫోన్ ట్యాపింగ్ కేసులో రోజుకో సంచలన విషయం బయటపడుతోంది. ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పోలీసు వెహికిల్ లో డబ్బును తరలించినట్లుగా రాధాకిషన్ రావు స్పష్టం చేయడంతో…ఈ అక్రమ డబ్బు తరలింపుపై ఈడీ ఎంటర్ అయ్యే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. పోలీసు వాహనాల్లో డబ్బు ఎక్కడి నుంచి తరలించారు..? ఆ డబ్బును ఎవరు సమకూర్చారు..? లెక్కలోకి రాని ఆ డబ్బు బీఆర్ఎస్ అభ్యర్థులకు ఇచ్చింది ఎవరు..? అనే అంశాలపై దర్యాప్తు చేసేందుకు ఈడీ రంగ ప్రవేశం చేసే ఛాన్స్ ఉందని పోలీసు వర్గాల్లో చర్చ జరుగుతోంది.
విచారణలో రాధాకిషన్ రావు బయటపెట్టిన విషయాలు ఈ కేసులో కీలకంగా మారాయి. ఇదే ఇప్పుడు ఈ కేసులో ఈడీ ప్రవేశానికి ద్వారాలు తెరిచేందుకు కారణం కానున్నాయి. ఈడీ ఎంటర్ అయితే బీఆర్ఎస్ కు ఆర్థిక వనరులను చక్కబెట్టిన వారెవరు..? ఎవరెంత ఇచ్చారు..? అనేది తేలనుంది.వారిని విచారణకు పిలిచే అవకాశం ఉంది. దీంతో బీఆర్ఎస్ కు ఫండింగ్ చేసిన వారిలో అప్పుడే గుబులు మొదలైంది. అటు , ఇటూ తిరిగి ఫోన్ ట్యాపింగ్ కేసు తమ మెడకు చుట్టుకుంటుందా..? అని వ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తలు టెన్షన్ పడుతున్నారని తెలుస్తోంది.