డ్రగ్స్ కేసులో టాలీవుడ్ స్టార్స్‌ని తెలంగాణ సర్కార్ వదిలేసినా ఈడీ వదిలి పెట్టేలా లేదు. తాజాగా గతంలో విచారణకు హాజరైన వారందరికీ ఈడీ నోటీసులు జారీ చేసింది. గతంలో విచారణకు హాజరైన వారిలో పూరి జగన్నాథ్, తరుణ్ , చార్మీ, నందు, రానా, రవితేజ సహా 11 మంది ప్రముఖులు ఉన్నారు. అప్పట్లో గోళ్లు, వెంట్రుకలు తీసుకుని ల్యాబ్‌లకు పంపారు. తర్వాత వారి గురించి ఎలాంటి వివరాలు బయటకు రాలేదు. ఇటీవల క్లీన్ చిట్ ఇచ్చారు. డ్రగ్స్ కేసులో పోవీరు వేసిన చార్జిషీట్‌ను న్యాయస్థానం ఆమోదించింది. డ్రగ్స్ వాడుతున్నారన్న అనుమానంతో గతంలో విచారించి 11 మంది సినీ ప్రముఖులకు క్లీన్చిట్ ఇచ్చారు.
ప్రముఖ హీరో రవితేజ సోదరుడు శంషాబాద్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. ఆ సమయంలో ఆయనకు సంబంధించిన ఫోన్ పోలీసులకు లభించింది. ఆ ఫోన్‌ను విశ్లేషిస్తే.. టాలీవుడ్లో డ్రగ్స్ దందా మొత్తం బయటపడిందని ప్రచారం జరిగింది. 2017 జులై 2న 12 డ్రగ్స్ కేసులు నమోదు చేశారు. 30 మందిని అరెస్ట్ చేసి 27 మందిని ప్రశ్నించారు. తొలుత 8 కేసుల్లో మాత్రమే చార్జిషీట్ ఫైల్ చేశారు. పోలీసుల తీరుపై విమర్శలు రావడంతో మరో 4 చార్జిషీట్లు దాఖలు చేశారు. ఆ ఫోన్లో దొరికిన సమాచారమో… మరెక్కడి నుంచిఅయినా లభించిందో కానీ పెద్ద ఎత్తున తర్వాత రెయిడింగ్‌లు చేసి.. డ్రగ్ పెడలర్లను పట్టుకున్నారు. టాలీవుడ్ ప్రముఖుల్ని పిలిపించి ప్రశ్నించారు. వారి శాంపిళ్లను తీసుకున్నారు. కానీ చివరికి ఏమీ తేలలేదు.
ఈ కేసులో తెలంగాణ పోలీసులు సరిగ్గా విచారణ చేయడం లేదని.. కేసును.. ఈడీకి అప్పగించాలని… తెలంగాణ పీసీసీచీఫ్ కేంద్ర దర్యాప్తు సంస్థలకు ఇవ్వాలని హైకోర్టులో పిటిషన్ వేశారు. కేసులో అంతర్జాతీయ ముఠాల ప్రమేయముందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అప్పట్లో ఈ కేసు విచారణకు వేసిన ఎక్సైజ్ సిట్ పరిధి సరిపోదని సీబీఐ, ఈడీ, ఎన్సీబీ సంస్థలకు ఇవ్వాలని పిటిషన్లో కోరారు. దర్యాప్తుకు ఈడీ, ఎన్సీబీ సిద్ధంగా ఉన్నాయని.. రేవంత్ తరపు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అయితే ఆ కేసులో కోర్టు ఏమైనా ఆదేశాలిచ్చిందో లేదో తెలియదు కానీ.. ఇప్పుడు నటులకు ఈడీ నోటీసులు ఇచ్చింది. దీంతో టాలీవుడ్లో ప్రకంపనలు ప్రారంభమయ్యాయి.