ఏ-2 విజయసాయిరెడ్డి నిండా మునిగిపోయాడని ఆయనే సంకేతాలు ఇస్తున్నారు. హైదరాబాద్ ఈడీ ఆఫీసులో ఆయనను ఆరు గంటల పాటు ఈడీ అధికారులు ప్రశ్నించారు. దేనిపై ప్రశ్నించారో ఆయన పూర్తిగా బయటకు చెప్పడం లేదు కానీ బయటకు వచ్చి బెదిరింపులు, బ్లాక్ మెయిల్స్, ప్రమాణాల సవాళ్లు ప్రారంభించారు.
ఈడీ విచారణ తర్వాత విజయసాయిరెడ్డి కాకినాడ పోర్టు ఓనర్ కేవీరావును తిరుమల ఎదుట ప్రమాణానికి రావాలని సవాల్ చేశారు. తన తప్పు లేదని తేలితే పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరించారు. విజయసాయిరెడ్డి వ్యవహారం చూసి ఏదో నిండా మునిగిపోయిట్లుగా ఉందని వైసీపీ నేతలు కూడా కంగారు పడుతున్నారు. ఈడీ పాతిక పైనే ప్రశ్నలు వేసిందని అన్నింటికీ ..తనకు సంబంధం లేదని చెప్పానని ఆయన చెబుతున్నారు. కానీ లోపల ఆధారాలతో సహా మొత్తం ఈడీ గుట్టు బయట పెట్టినట్లుగా ప్రచారం చేస్తోంది.
కాకినాడ పోర్టులో కొట్టేసే ప్లాన్ వేసింది, ఎగ్జిక్యూట్ చేసింది మొత్తం విజయసాయిరెడ్డేనని ఈడీ అనుమానిస్తోంది. మొదట తన సన్నిహిత ఆడిటింగ్ కంపెనీలను రంగంలోకి దింపారు. తప్పుడు రిపోర్టులు ఇప్పించారు. తర్వాత విక్రాంత్ రెడ్డిని గన్ పాయింట్ బెదిరింపుల కోసం దింపారు. అధికార వ్యవస్థను పూర్తి స్థాయిలో దుర్వినియోగం చేసిన తర్వాత వాటాలు రాయించుకుని మళ్లీ ఆడిటింగ్ రిపోర్టును మార్చేశారు. ఇక్కడ అంతా విజయసాయిరెడ్డి కనుసన్నల్లోనే జరిగింది. దీనికి సంబంధించిన ఆధారాలన్నీ ఈడీ ఆయన ముందు పెట్టినట్లుగా తెలుస్తోంది.
పాత కేసుల్లోనూ ఈడీ అధికారులు పెట్టుబడులు సేకరించిన వైనాన్ని ఆరా తీసినట్లుగా తెలుస్తోంది. జగన్ రెడ్డి పెట్టుబడులు సంపాదించడానికి మూల కంపెనీ సండూర్ పవర్. ఆ సండూర్ లోకి వచ్చిన పెట్టుబడుల గురించీ ప్రశ్నించారు. అయితే విజయసాయిరెడ్డి తనకు ఏమీ తెలియదని.. అంతా మర్చిపోయానని చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేశారు. మొత్తంగా విజయసాయిరెడ్డిని ఈడీ మరోసారి విచారణకు పిలుస్తామని చెప్పింది.కానీ విచారణకు పిలుస్తుందో..అరెస్టు చేస్తుందో అంచనా వేయడం కష్టంగా ఉందని ఆయన క్యాంప్ కూడా ఆందోళన చెందుతోంది.