టీవీ 9 మాజీ సీఈవో రవిప్రకాష్ బెయిల్ రద్దు చేయాలని ఈడీ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఆయన బెయిల్ షరతులు ఉల్లంఘిచారని.. విచారణకు రావడం లేదని పిటిషన్లో పేర్కొంది. దీనిపై హైకోర్టు రవిప్రకాష్‌కు నోటీసులు జారీ చేసింది. రవిప్రకాష్ టీవీ9 సీఈవోగా ఉన్నప్పుడు బోనస్ పేరుతో అక్రమంగా నిధులు డ్రా చేశారని కేసు పెట్టారు. ఆయనను కొన్నాళ్లు అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. ఆ తర్వాత బెయిల్ పొందారు. ఈ కేసు విషయంలో గతంలో హైకోర్టు.. సామరస్యంగా పరిష్కరించుకోవాలని సూచించింది.
అయితే అనూహ్యంగా టీవీ9 కొత్త యాజమాన్యం ఈడీ ద్వారా కేసు పెట్టించి అరెస్ట్ చేసే ప్రయత్నం చేసింది. ప్రైవేటు సంస్థలో డబ్బుల అవకతవలకు.. ఈడీకి సంబంధం ఏమిటనే మౌలిక ప్రశ్న వస్తుంది. అయితే టీవీ9 కొత్త యాజమాన్యం బోనస్‌గా తీసుకున్న సొమ్మును రవిప్రకాష్ విదేశాలకు తరలించారనే అనుమానం వ్యక్తం చేస్తూ ఫిర్యాదు చేసింది. నిజానికి ఆ రూ. 18 కోట్లు ఉద్యోగులు అందరికీ ఇచ్చిన బోనస్ అని ..రవిప్రకాష్ ఒక్కడిది కాదని ఆధారాలు కూడా రవిప్రకాష్ సమర్పించారు.
అయినప్పటికీ అరెస్ట్ చేసే ప్రయత్నం జరగడంతో రవిప్రకాష్.. ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు. ఒక్క కేసులో ఎన్ని సార్లు వేధిస్తారని హైకోర్టు ఆయనకు మంజూరు చేసిన ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. అయితే రవిప్రకాష్ బెయిల్ రద్దు చేసేందుకు ఈడీ అధికారులు గత ఏడాది మార్చిలోనూ సుప్రీంకోర్టులోనూ పిటిషన్ వేశారు. అక్కడా ఈడీకి అనుకూల తీర్పు రాలేదు. మళ్లీ ఖచ్చితంగా ఏడాది తర్వతా రవిప్రకాష్ బెయిల్ రద్దు చేయాలని ఈడీ హైకోర్టును ఆశ్రయించింది.