దేశం విడిచిపారిపోకుండా బైజూస్ రవీంద్రన్ పై ఈడీ లుకౌట్ నోటీసులు జారీ చేసింది. విద్యార్థుల పేరుతో వందల కోట్లు కట్ట బెడుతున్న జగన్ రెడ్డి కంటే.. ముందే బైజూస్ మునిగిపోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఆ సంస్థ చీఫ్ ఈడీ గుప్పిట్లో చిక్కుకున్నారు కంపెనీ మూతపడే పరిస్థితికి వచ్చింది. ఆఫీసులన్నీ ఖాళీ చేస్తున్నారు. గత నెల జీతాలు ఇవ్వడానికి యుద్ధం చేయాల్సి వచ్చిందని కూడా బైజూస్ వ్యవస్థాపకుడు చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో ఆయన దేశం విడిచి వెళ్లకుండా ఈడీ జాగ్రత్తలు తీసుకుంది. ఈడీ గత ఏడాది బెంగళూరులో రెండు కార్యాలయాలతో పాటు ఆయన నివాసంలో సోదాలు జరిపింది. ఇప్పటికే రవీంద్రన్‌పై ‘ఆన్ ఇంటిమేషన్ లుకౌట్ సర్క్యూలర్’ అమల్లో ఉంది.
అంటే విదేశాలకు వెళ్లినప్పుడు ఇమ్మిగ్రేషన్ అధికారులు ఈడీకి ముందుగానే సమాచారం అందజేయాల్సి ఉంటుంది. తాజాగా పూర్తిస్థాయి లుకౌట్ సర్క్యూలర్ జారీ అవటంతో ఇకపై దేశం విడిచి వెళ్లడానికి ఆస్కారం ఉండదు. రవీంద్రన్‌ను సీఈఓ పదవి నుంచి తొలగించేందుకు కొంత మంది వాటాదారులు అసాధారణ బోర్డు సమావేశానికి పిలుపునిచ్చారు. కొత్త బోర్డును ఎన్నుకోవాలని నిర్ణయించారు. అందుకోసం ఫిబ్రవరి 23న సమావేశం ఏర్పాటు చేయాలని కంపెనీని కోరారు. వాటాదారుల నిర్ణయాన్ని సవాలు చేస్తూ బైజూస్ కర్ణాటక హైకోర్టును ఆశ్రయించింది. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం.. ఈజీఎం నిర్వహణకు అనుమతించింది. కానీ, అందులో తీసుకునే నిర్ణయాలను మాత్రం తదుపరి విచారణ వరకు అమలు చేయొద్దని ఆదేశించింది.
బైజూస్ ఆదాయాలు పడిపోవడంతో కంపెనీ విలువను 99 శాతం తగ్గించారు. ఆ మిగిలిన విలువను చూపించి నిధుల సమీకరణకు ప్రయత్నిస్తన్నారు. అయితే ప్రస్తుత పరిస్థితులు చూస్తూంటే.. బైజూ రవీంద్రన్ అప్పులు ఎగ్గొట్టి పారిపోయినా ఆశ్చర్యం లేదన్న వాదన వినిపిస్తోంది.