తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కొద్ది రోజులుగా హెచ్చరిస్తున్నట్లుగానే డ్రగ్స్ కేసు రీ ఓపెన్ అయింది. తెలంగాణ డ్రగ్స్ కేసు..బెంగళూరు డ్రగ్స్ కేసుల్లో పైలట్ రోహిత్ రెడ్డి ఉన్నారని.. వదిలి పెట్టబోమని ఆయన చెబుతున్నారు. ఇలా చెబుతున్నట్లుగానే… టాలీవుడ్ డ్రగ్స్ కేసును ఈడీ రీ ఓపెన్ చేసింది. రోహిత్ రెడ్డితో పాటు హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్కు నోటీసులు జారీ చేసింది. 19న తమ ఎదుట హాజరు కావాలని ఆదేశించింది.
టాలీవుడ్ డ్రగ్స్ కేసులో గతంలో ఈడీ విచారణ జరిపింది. కానీ తెలంగాణ పోలీసుల నుంచి సహకారం లభించలేదు. అసలు ఆధారాలు లేవని చెప్పడం.. కోర్టులో కూడా అదే చెబుతూ చార్జిషీటు దాఖలు చేయడంతో అందరికీ క్లీన్ చిట్ వచ్చింది. అయితే డిజిటల్ ఎవిడెన్స్ను తెలంగాణ ఎక్సైజ్ శాఖ తమకు ఇవ్వడం లేదని..గతంలో ఈడీ హైకోర్టుకు వెళ్లింది. అయినప్పటికీ ఆధారాలు ఇవ్వలేదు. చివరికి కోర్టు ధిక్కరణ చేపడతామని కోర్టు హెచ్చరించడంతో ఆధారాలు ఇచ్చారు. ఆ ఆధారాలు మొత్తం ఇచ్చారా లేదా అన్నదానిపై స్పష్టత లేదు. కానీ ఆ ఆధారాలు తీసుకున్న తర్వాత కూడా ఈడీ సైలెంట్ గా ఉంది. ఇప్పుడు నోటీసులు జారీ చేసింది.
ఫామ్ హౌస్ కేసు ద్వారా తమను ట్రాప్ చేసిన పైలట్ రోహిత్ రెడ్డి పై బీజేపీకి కోపం ఉంటుంది. ఆయనకు నోటీసులు ఇస్తే.. కామనే అనుకోవచ్చు. కానీ హఠాత్తుగా ఈ అంశంలో రకుల్ ప్రీత్ సింగ్కూ నోటీసులు జారీ చేయడం మాత్రం ఆసక్తి రేపుతోంది. ఖచ్చితంగా రకుల్ కు నోటీసులు జారీ చేయడం వెనుక ఈసీ మాస్టర్ స్కెచ్ ఉంటుందని.. తెలంగాణ ప్రభుత్వంలో వణుకు పుట్టించడానికే ఇలా చేస్తున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
పైలట్ రోహిత్ రెడ్డిపై బెంగళూరులోనూ డ్రగ్స్ కేసు ఉంది. గతంలో విచారణకు హాజరయ్యే చివరి నిమిషంలో బెంగళూరు పోలీసులు సైలెంట్ అయ్యారు. ఇప్పుడు ఆ కేసును కూడా బయటకు తీస్తామని చెబుతున్నారు. ముందు ముందు డ్రగ్స్ కేసు తెలంగాణలో సంచలనం అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి