ఎవరు ఫిర్యాదు చేశారో తెలియదు.. ఎవరు ఆదేశించారో తెలియదు.. తెలంగాణ ఎక్సైజ్ శాఖ చార్జిషీట్ దాఖలు చేసిన నెలల తర్వాత ఈడీ కి లైట్ వెలిగింది. నోటీసుల పేరుతో టాలీవుడ్ స్టార్స్‌తో ఆడుకోవడం ప్రారంభించింది. అలా నోటీసులు ఇచ్చిన విషయం బయటకు వచ్చినప్పటి నుండి ఈడీ వర్గాలు మీడియాకు లీకులు ఆపడం లేదు. నిజం తేలితే ఏం జరుగుతందో కూడా కథలు.. కథలుగా చెప్పేందుకు మీడియాకు సమాచారం ఇస్తున్నారు. వారు చెప్పే మాటల్లో కొన్ని చాలా వరకూ తమకు రహస్యాలు దొరికిపోయాయన్న లీకులే ఉంటున్నాయి.
రెండు రోజులుగా మీడియాలోని ఓ వర్గానికి ఈడీ వర్గాల నుంచి కాన్ఫిడెన్షియల్ సమాచారం అందుతోంది. దాని ప్రకారం డ్రగ్స్ ఎలా తెప్పించేవారు..? డబ్బులు ఎలా చెల్లించారు..? అన్న వాటిపై పూర్తి సమాచారం సేకరించేశారని చెబుతున్నారు. అదంతా హవాలా మార్గం ద్వారా నడిచిందని మీడియా చెబుతోంది. కానీ హవాలా ద్వారా నడిస్తే రికార్డులు ఉండవు. నిరూపించడం అసాధ్యం. ఇప్పటి వరకూ జరిగిన కేసుల్లో అదే వెల్లడయింది. లావాదేవీ జరిగినట్లుగా ఏదో ఓ రికార్డు ఉంటే తప్ప నిరూపించలేరు. హవాలాలో అవేమీ ఉండవు.
ఇక నేరం చేసినట్లుగా నిరూపితమైతే ఆస్తులు జప్తు చేస్తామన్న సందేశాన్ని కూడా ఈడీ సినీ ప్రముఖులకు పంపింది. పబ్ నిర్వహించే ఓ ప్రముఖుడు పెద్ద ఎత్తున తెప్పించి సినీ వర్గాలకు సరఫరా చేశాడని.. ఆయన ఆస్తులు జప్తు చేసే అవకాశం ఉందని తాజాగా మీడియాలో ప్రచారం అయ్యేలా చేశారు. నిజానికి డ్రగ్స్ కేసులో ఏమైనా చేయాలనుకుంటే చాలా లోతైన ప్రపంచం ఉందని అందరికీ తెలుసు. కానీ నాలుగేళ్ల కిందటే ఈ కేసును కోల్డ్ కేసులో పెట్టడానికి ఏర్పాట్లు పూర్తయిపోయాయి. కొత్తగా ఇప్పుడు ఈడీ చేయగలిగిందేమీ లేదు. కానీ.. ఎందుకు హడావుడి చేస్తుందో మాత్రం క్లారిటీలేదు.
ఇప్పటి వరకూ ఇలా హఠాత్తుగా వెలుగులోకి వచ్చిన కేసులు.. నోటీసులు కాస్త హడావుడి తర్వాత సైలెంటయినవే ఎక్కువ. దాని వెనుక అర్థం.. పరమార్థం వేరే ఉంటాయని అంటున్నారు. అదే నిజమైతే… కాస్త పబ్లిసిటీ తరవాత ఈడీ కూడా సైలెంటయ్యే అవకాశం ఉంది. కాదు సీరియస్‌గానే ఉన్నారంటే మాత్రం సినీ తారలకు చిక్కులు తప్పకపోవచ్చని అంటున్నారు.