తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రశ్నాపత్రాలు లీకైన వ్యవహారంలో ఎన్ ఫోర్స్మెంట్ డైరక్టరేట్ అధికారులు విచారణ జరుపుతున్నారు. సోమ వారం రోజు టీఎస్పీఎస్సీ చైర్మన్ తో పాటు కార్యదర్శిని పిలిచి ఏకంగా పన్నెండు గంటల పాటు ప్రశ్నించారు. సాధారణంగా ఈడీ దర్యాప్తు చేసేది మనీ లాండరింగ్ కోణంలోనే. విదేశాలకూ కొన్ని పేపర్లు వెళ్లాయని అక్కడి నుంచి నగదు ఇక్కడకు వచ్చిందన్న కోణంలోనే మొదట దర్యాప్తు ప్రారంభించిన ఈడీ.. అసలు మొత్తం గుట్టును బయటకు లాగే ప్రయత్నం చేస్తోంది.
ఓ వైపు ఈ విషయంలో సీబీఐ విచారణ కావాలంటూ కాంగ్రెస్ సహా ఇతరులు హైకోర్టులో పిటిషన్ వేశారు. అయితే ఇప్పుడు అవసరం ఏముందని హైకోర్టు విచారణ జూన్ కు వాయిదా వేసింది. ప్రభుత్వం వేసిన సిట్ విచారణ జరుపుతోంది. కానీ ఈ సిట్ కింది స్థాయి ఉద్యోగుల్నే అసలు నిందితులుగా తేల్చి.. విచారణను దాదాపుగా ముగించేసింది. కానీ ఈడీ మాత్రం నేరుగా అసలు ఇంత తేలికగా ప్రశ్నాపత్రాలు లీక్ చేయవచ్చా అన్నట్లుగా దర్యాప్తు చేస్తూండటంతో ప్రభుత్వ వర్గాల్లో గుబులు రేగుతోంది.
మనీలాండరింగ్ కేసే అయినప్పటికీ ఈడీ అన్ని విషయాలను తెలుసుకుంటోంది. పేపర్లు ఎలా తయారు చేస్తారు.. లీకేజీని ఎందుకు గుర్తించలేకపోయారు.. గుర్తించినా పట్టించుకోలేదా లేక.. వారి హస్తమూ ఉందా అన్న రీతిలో ఈ విచారణ జరుగుతూండటం సంచలనంగా మారింది. నిరుద్యోగుల్లో ఈ పేపర్ లీకేజీ అంశంపై చాలా అనుమానాలున్నాయి. కింది స్థాయి .. కాంట్రాక్ట్ ఉద్యోగి.. అన్ని రకాల పేర్లను దొంగిలించడం సాధ్యం కాదని.. పెద్ద కుట్ర ఉందని అనుమానిస్తున్నారు. సిట్ ఎలాగూ తేల్చదని.. కనీసం.. ఈడీ అయినా మొత్తం గుట్టు బయట పెట్టాలని కోరుకుంటున్నారు. మరి ఈడీ .. సంచలన విషయాలు బయటపెడుతుందా లేదా అన్నది వేచి చూడాల్సి ఉంది.