ఆంధ్రప్రదేశ్ లో సీఐడీ ఎలాగో.. ఢిల్లీలో బీజేపీకి ఈడీ అలా తయారైంది. ప్రతీ దానికి ఈడీ కేసులు నమోదు చేస్తూ పోతున్నారు. తమకు వ్యతిరేకంగా మాట్లాడే వారికి ఏదో ఓ లింక్ పెట్టి నోటీసులు జారీ చేస్తున్నారు. ఇటీవల మహదేవ్ యాప్ పేరుతో.. ఆ యాప్ ప్రచార కర్తలందరికీ నోటీసులు జారీ చేసి.. హంగామా చేశారు. ఇప్పుడు ప్రకాష్ రాజ్ వంతు వచ్చింది. ఆయన మహదేవ్ యాప్ కు ప్రచారం చేయలేదు.. కేరళలో ఓ చిన్న జ్యూయలరీ షాప్ కు ప్రచారం చేశారు. ఇది చాలు కదా.. అని ఈడీ రంగంలోకి దిగిపోయింది.
తిరుచ్చికి చెందిన ప్రణవ్ జువెలర్స్ అనే కంపెనీపై నవంబర్ 20న ఈడీ దాడులు చేసింది. ఆ జువెలరీ సంస్థ నుంచి లెక్కల్లో చూపని రూ.23.70 లక్షలు నగదు, కొన్ని బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్లు ఈడీ తెలిపింది. ఆ సంస్థకు ప్రకాశ్ రాజ్ ప్రచారకర్తగా ఉన్నారు. అందుకే ఆయనను విచారణకు పిలిచింది ఈడీ. సాధారణంగా ప్రతి బంగారం దుకాణం ఓ స్కీమ్ నిర్వహిస్తూ ఉంటుంది. పదకొండు నెలలు కిస్తీలు కడితే.. పన్నెండో నెల తాము యాడ్ చేసి బంగారం ఇస్తామని చెబుతూ ఉంటాయి. అలాంటి స్కీమ్ ద్వారా .. ప్రణవ్ జ్యూయలర్స్ వంద కోట్లు వసూలు చేసిందని చెబుతున్నారు. ఇందులో ప్రకాష్ రాజ్ పాత్రేముంటుంది.. ఒక రోజో..రెండు రోజులో కాల్ షీట్లు ఇచ్చి.. ప్రచారకర్తగా షూట్ చేసి ఉంటారు. దానికి డబ్బులు తీసుకుని ఉంటారు. అయినా ఆయనకు ఈడీ నోటీసులు జారీ ేచసింది.
బీజేపీని, మోదీని తీవ్రంగా విమర్శించడంలో ప్రకాష్ రాజ్ ముందు ఉంటారు. జస్ట్ ఆస్కింగ్ పేరుతో.. తన సోషల్ మీడియా ఖాతాల్లో మోడీ తీరును ఎగతాళి చేస్తూంటారు. ఇప్పుడు ఈడీ ఆయనకు నోటీసులు జారీ చేసింది. వచ్చే వారం చెన్నైలో ఈడీ కార్యాలయానికి ఆయన హాజరు కావాల్సి ఉంది.