మునుగోడు ఉపఎన్నికల్లో డబ్బులే కీలకం. తెలంగాణలో ఉన్న అధికార పార్టీకి ఎలాంటి అడ్డంకుల్లేవు. కానీ బీజేపీ నేతలు మాత్రం ఎక్కడ పైసా కదిలిస్తే అక్కడ దొరికిపోతోంది. చివరికి బైకుల మీద తరలించాలన్నా.. పట్టేసుకుంటున్నారు. ఈ సమాచారం అంతా ఎలా తెలుస్తోందోనని బీజేపీ నేతలు మథనపడుతున్నా…బయటకు ఏమీ చెప్పుకోలేని పరిస్థితి. ఇప్పటి వరకూ రూ. పదిహేను కోట్లకుపైగా దొరికింది. దీంతో రాజగోపాల్ రెడ్డి.. నేరుగా బ్యాంక్ ఖాతాలకు ట్రాన్స్ ఫర్ చేయాలని నిర్ణయించుకున్నట్లుగా కనిపిస్తోంది.
మునుగోడు ఉపఎన్నికలు రావడానికి కారణం సుశీ ఇన్ ఫ్రా సంస్థకు రూ. పద్దెనిమిది వేల కోట్ల కాంట్రాక్ట్ రావడమేనని టీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తూంటారు. ఇప్పుడు అదే కంపెనీ నుంచి మునుగోడు నియోజకవర్గంలో ఉన్న పలువురు నేతలకు రూ. ఐదు కోట్ల కంటే ఎక్కువ నగదు ట్రాన్స్ ఫర్ అయింది. ఈ విషయం ఎలా కనిపెట్టారో కానీ టీఆర్ఎస్ నేతలు ఈసీకి ఫిర్యాదు చేశారు. మునుగోడు నియోజకవర్గంలో డబ్బులను ఇలా ట్రాన్స్ ఫర్ చేయడానికి కారణం .. ఓటర్లకు పంచడానికేనని.. చర్యలు తీసుకోవాలని ఆధారాలతో సహా ఫిర్యాదు చేశారు.
దీనిపై ఈసీ స్పందించింది. రాజగోపాల్ రెడ్డికి నోటీసులు జారీ చేసింది. ఆ డబ్బులు నియోజకవర్గంలోని వ్యక్తులకు ఎందుకు ట్రాన్స్ ఫర్ చేశారో చెప్పాలని ఆదేశించింది. ఓటర్లకు పంచడానికి అయితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. అయితే రాజగోపాల్ రెడ్డి అలా చెప్పడానికి అమాయకుడేమీ కాదుగా.. వాళ్లు తమ కంపెని సబ్ కాంట్రాక్టర్లు అనో.. మరొకటో చెప్పే చాన్స్ ఉంది. అయితే అసలు నిజం మాత్రం… ఇలా లిక్విడ్ క్యాష్‌ను సరఫరా చేసుకోలేక.. బ్యాంకుల ద్వారా కానిచ్చేస్తున్నారు. బయటపడినా.. పర్వాలేదనుకుంటున్నారు.