తెలంగాణ సీఎం కేసీఆర్ కుమార్తె , ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఎన్ ఫోర్స్ మెంట్ డైరక్టరేట్ నోటీసులు జారీ చేసింది. గురువారం ఢిల్లీలో తమ ఎదుట హాజరు కావాలని ఆదేశించింది. మంగళవారమే రామచంద్ర పిళ్లైను అరెస్ట్ చేసిన ఈడీ… రిమాండ్ రిపోర్టులో ఆయనను కవిత బినామీగా తేల్చారు. ఈ విషయాన్ని రామచంద్ర పిళ్లై ఒప్పుకున్నారని పేర్కొన్నారు . దీంతో కవిత విషయం సంచలనంగా మారింది. ఒక్క రోజులోనే కవితకు ఈడీ నోటీసులు జారీ చేయడం కలకలం రేపుతోంది.
గతంలో సీబీఐ అధికారులు నోటీసులు జారీ చేసినప్పుడు కవిత .. మొదట విచారణకు గడువు కోరారు. తర్వాత ఆమె ఇంట్లోనే ప్రశ్నించారు. మరోసారి విచారణకు హాజరు కావాలని నోటీసులు ఇచ్చారు…కానీ తేదీ చెప్పలేదు. ఇంత వరకూ పిలువలేదు. ఈడీ మాత్రం ఈ సారి నేరుగా నోటీసులు జారీ చేసింది. ఇంటికొచ్చి ప్రశ్నిస్తామనే వెసులుబాటు ను కూడా కల్పించలేదు. ఢిల్లీకి రావాలని ఆదేశించింది.
కవితను అరెస్ట్ చేస్తారా లేదా అన్నదానిపై స్పష్టత లేదు కానీ.. ఇప్పటి వరకూ జరిగిన అరెస్టుల్ని బట్టి చూస్తే… ఆ అవకాశం ఎక్కువగా ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. కేసులో ప్రధానంగా సిసోడియా, కవితనే సూత్రధారులని మిగతా వారంతా పాత్రధారులన్నట్లుగా ఈడీ , సీబీఐ అధికారులు ఇప్పటికే వివిధ రకాల రిమాండ్ రిపోర్టులు చార్జిషీట్ల ద్వారా వెల్లడించారు.
ఢిల్లీ లిక్కర్ స్కాంలో సీబీఐ స్కాంపై దర్యాప్తు చేస్తూండగా.. ఈడీ మాత్రం.. మనీలాండరింగ్ కోణంలో విచారణ జరుపుతోంది. ఈ రెండు వేర్వేరు కేసులవుతాయి.