తెలుగు సూపర్ స్టార్ మహేష్‌బాబుకు ఈడీ నోటీసులు జారీ చేసింది. 28వ తేదీన తమ ఎదుట హాజరు కావాలని ఆదేశించింది. సాయి సూర్య డెవలపర్స్ అనే కంపెనీకి మహేష్ బాబు బ్రాండ్ అంబాసిడర్ గా పని చేశారు. ఆ కంపెనీ నుంచి చెక్కులతో కొంత మొత్తం.. నగదు కొంత మొత్తం స్వీకరించారు. ఈ వ్యవహారంలో అక్రమ నగదు చెలామణి జరిగిందని ఈడీ గుర్తించింది. అందుకే ఆయనకు నోటీసులు జారీ చేశారు.
హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ అక్రమాలకు పాల్పడినట్లుగా సురానా గ్రూప్, సాయి సూర్య డెవలపర్స్ పై ఫిర్యాదులు రావడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసు ఆధారంగా ఈడీ అధికారులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. రెండు గ్రూపులకు చెందిన కార్యాలయాలు, వాటి యజమానులకు సంబంధించిన ఇళ్లల్లో సోదాలు నిర్వహించారు. ఈ క్రమంలో మహేష్ బాబుకు సాయి సూర్య డెవలపర్స్ సంస్థ రూ.5 కోట్ల 90 లక్షలు చెల్లించినట్లుగా పత్రాలు వెలుగు చూశాయి. ఇందులో రూ.3 కోట్ల 40 లక్షలు చెక్కుల రూపంలో.. మిగిలిన రెండున్నర కోట్ల నగదు రూపంలో చెల్లించారు.
నగదు రూపంలో రెండున్నర కోట్లు చెల్లించడాన్ని ఈడీ సీరియస్ గా తీసుకుంది. ఇది ఖచ్చితంగా మనీలాండరింగ్ వ్యవహారంగానే భావిస్తోంది. తప్పుడు పద్దతుల ద్వారా .. కొనుగోలుదారులను మోసం చేయడం ద్వారా సేకరించిన డబ్బును ఇలా చెల్లించారని అనుమానిస్తోంది. పూర్తి వివరాలు తెలుసుకునేందుకు మహేష్ బాబుకు ఈడీ నోటీసులు జారీ చేసినట్లుగా తెలుస్తోంది.
సురానా గ్రూప్, సాయి సూర్య డెవలపర్స్.. పెద్ద ఎత్తున వినియోగదారుల్ని మోసం చేసినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్నాయి. ఒక్క ఫ్లాట్ నే నలుగురు, ఐదుగురుకు అమ్మినట్లుగా చెబుతున్నారు. వందల కోట్లలో వీరు ఫ్రాడ్ చేసినట్లుగా పోలీసులు, ఈడీ కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాయి. బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించి మహేష్ బాబు కూడా సమస్యల్లో ఇరుక్కున్నారు.