కాకినాడ పోర్టును అధికారాన్ని అడ్డం పెట్టుకుని మాఫియాలాగా వ్యవహరించి అణాకాణీలకు కొట్టేసిన కేసులో అనూహ్యంగా ఈడీ ఎంట్రీ ఇచ్చింది. వైవీ సుబ్బారెడ్డి కుమారుడు విక్రాంత్ రెడ్డికి నోటీసులు జారీ చేసినట్లుగా వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. విక్రాంత్ రెడ్డి పై ఇప్పటికే ఈ అంశంలో సీఐడీ కేసు ఉంది. కానీ ఆయన కోర్టుకు వెళ్లి కఠిన చర్యలు తీసుకోకుండా ఆదేశాలు తెచ్చుకున్నారు. కేసు ప్రస్తుతానికి నడుస్తోంది. ఆయనను దర్యాప్తునకు సహకరించాలని కోర్టు ఆదేశించింది. ఈ క్రమంలో ఈడీకేసు నమోదు చేయడం సంచలనంగా మారింది.
పోర్టు ఒప్పందం గురించి తెలిసిన ఎవరికైనా సినిమాల్లో మాఫియాలే గుర్తుకు వస్తాయి. అధికారాన్ని అడ్డం పెట్టుకుని మొదట పోర్టులో పెద్దఎత్తున అక్రమాలు అంటూ నివేదికలు రెడీ చేశారు. తర్వాత వేల కోట్ల జరిమానా అన్నారు. బెదిరించారు. పాయింట్ బ్లాంక్ లో తుపాకీ పెట్టి సంతకాలు చేయించుకున్నారు. తరవాత ఆ నోటీసులన్నీ ఉపసంహరించుకున్నారు. ప్రజలు ఇచ్చిన అధికారాన్ని ఇలా కూడా దోపిడీకి ఉపయోగిస్తారా అని అందరూ ఆశ్చర్యపోయేలా ఆ డీల్ జరిగిందని.. స్వయంగా పోర్టు ఓనర్ కేవీరావే ఫిర్యాదు చేస్తున్నారు. ఆయన ఫిర్యాదు మేరకు సీఐడీ కేసు నమోదుచేసింది. సీఐడీ కేసు ఆధారంగా ఈడీ రంగంలోకి దిగింది.
డీల్ ఎలా జరిగిందన్నది ఈడీకి ముఖ్యం కాదు. ఇందులో జరిగిన డబ్బు లావాదేవీలే కీలకం. మనీలాండరింగ్ పెద్ద ఎత్తున జరిగినట్లుగా అనుమానాలు ఉన్నాయి. ఈ కేసులో తాడేపల్లి ప్యాలెస్ సలహాలతో తెర ముందు అంతా విక్రాంత్ రెడ్డి మాత్రమే కనిపిస్తున్నారు. అందుకే ఆయనకు నోటీసులు జారీ చేశారు. తర్వాత పోర్టులో లెక్కల తేడాలంటూ నివేదికలు ఇచ్చిన రెండు ప్రైవేటు ఆడిటింగ్ సంస్థలకూ నోటీసులు వెళ్లనున్నట్లుగా చెబుతున్నారు. మొత్తంగా ఈ కేసును సీరియస్ గా తవ్వుకుంటూ పోతే ఎక్కడి వరకూ పోతుందో సులువుగా అంచనా వేయవచ్చని చెబుతున్నారు.