పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంట్లో నోట్ల కట్టలు పెద్ద ఎత్తున బయటపడినట్లుగా తెలుస్తోంది. వాటిని లెక్క పెట్టడానికి రెండు కౌంటింగ్ మెషిన్లను ఈడీ అధికారులు తెప్పించుకున్నారు. మొదట ఓ మెషిన్ ను తీసుకెళ్లారు..సరిపోవడం లేదని రెండో మెషీన్‌నూ తీసుకెళ్లారు. దీంతో పెద్ద మొత్తంలో నగదు పట్టుకుని ఉంటారని అంచనా వేస్తున్నారు. పొంగులేటి, ఆయన కుటుంబానికి చెందిన మొత్తం పదిహేను చోట్ల సోదాలు జరుగుతున్నాయి.
రాఘవ కన్‌స్ట్రక్షన్స్ గ్రూపును నడుపుతున్న పొంగులేటి ముందస్తు పన్ను చెల్లింపుల్లో భారీ అవకతవకలకు పాల్పడినట్లుగా గుర్తించినట్లుగా తెలుస్తోంది. ఈ మేరకు ఈడీ అధికారులకు స్పష్టమైన సమాచారం అందడంతో సోదాలు చేస్తున్నారు. తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీలో ఆయన కీలక మంత్రి కావడంతో.. ఇక్కడ ఈడీ అధికారులకు కూడా సమాచారం లేకుండా.. కేంద్ర బలగాలతో సహా ఢిల్లీ నుంచి వచ్చి .. సోదాలు చేస్తున్నారు.
ఈ సోదాలు సుదీర్ఘంగా సాగే అవకాశాలు ఉన్నాయి. సోదాలు ముగిసిన తర్వాత అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉంది. సాధారణంగా ఇలాంటి సోదాలు అంతర్గతంగా జరిగిపోతాయి. ఈడీ నేరుగా తాము ఫలానా వారిపై దాడులు చేశామని కూడా చెప్పదు. అయితే హైదరాబాద్‌లో దాడులు చేశామని ఇంత నగదు స్వాధీనం చేసుకున్నాం.. ఇన్ని అక్రమాలను గుర్తించామని మాత్రం ప్రకటిస్తూంటారు. దాన్ని బట్టి ఎంత దొరికిందని తేలే అవకాశం ఉంది. అప్పటి వరకూ పొంగులేటి ఇంట్లో ఎన్ని నోట్ల కట్టలు బయటపడ్డాయనేది ఎవరూ చెప్పలేరు.