గుడివాడలో కేసినో నిర్వహాకుడు చికోటి ప్రవీణ్ పై ఈడీ దాడులు చేయడం ఏపీలోనూ రాజకీయంగా చర్చనీయాంశం అవుతోంది. చికోటి ప్రవీణ్ గుడివాడలోనే కేసినోలు నిర్వహించలేదు. ఆయన బిజినెస్సే అది. ప్రత్యేక విమానాల ద్వారా ఆయన పెద్ద ఎత్తున జూదరులను గోవా, శ్రీలంక, బ్యాంకాక్ వంటి చోట్లకు తీసుకెళ్తూంటారు. తాజాగా నేపాల్‌కు ఇలా తీసుకెళ్లిన అంశంలలో జూదంలో వందల కోట్లు చేతులు మారాయన్న సమాచారం మేరకు దాడులు చేసినట్లుగా ఈడీ వర్గాలు చెబుతున్నాయి.
అయితే ఆ కేసినో నిర్వహణపై వచ్చిన ఫిర్యాదు మేరకు సోదాలు చేస్తూండవచ్చు కానీ.. ఆయన పాత లెక్కలన్నీ సోదాల్లో వెలుగులోకి రావొచ్చని చెబుతున్నారు. గుడివాడ కేసినో వ్యవహారం కూడా ఇందులో ఉంటుందని చెబుతున్నారు. గుడివాడలో కేసినో అత్యంంత భారీగా జరిగింది. పెద్ద ఎత్తున జూదం జరిగిందన్న వాదన ఉంది. ఈ అంశంపై తెలుగుదేశం పార్టీ నేతల గతంలో ఈడీకి ఫిర్యాదు చేసి ఉన్నారు. ఈ ఫిర్యాదును ఈడీ పరిగణనలోకి తీసుకుని ఉంటుందని భావిస్తున్నారు.
కేసినో నిర్వహణ అంటే సామాన్యమైన విషయం కాదు. ప్రభుత్వ పెద్దల ఆశీస్సులు ఉండాలి. అలా ఉండటం వల్ల వారికి ఏదో ప్రయోజనం దక్కుతుంది. అలాంటి ప్రయోజనాలు చికోటి ప్రవీణ్ ఎవరెవరికి అయినా ఇచ్చినట్లుగా ఆధారాలు లభిస్తే గుడివాడ కేసినో వ్యవహారం మరోసారి ఏపీలో హాట్ టాపిక్ అయ్యే అవకాశం కనిపిస్తోంది.