గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఎన్నారై మెడికల్ కాలేజీ ఆస్పత్రిపై ఈడీ రెండు రోజుల పాటు దాడులు చేయడం.. సోదాలు నిర్వహించడం…ఆనక వెళ్లిపోవడం జరిగాయి. ఏం గుర్తించారో ఎవరికీ తెలియదు. వారు అధికారిక ప్రకటన చేయలేదు. కానీ కొన్ని మీడియా సంస్థలు మాత్రం డైరక్టర్లు.. రూ. కోట్లకు కోట్లు మళ్లించారని గుర్తించారని.. కోవిడ్ పేషంట్ల నుంచి ఎక్కువ వసూలు చేశారని ఇలా రకరకాలుగా రాశారు. ఏది నిజమో తేలాల్సి ఉంది.
కరోనా సమయంలో ఎన్నారై ఆస్పత్రి గుంటూరు, కృష్ణా ప్రజలకు ఎంతో సేవ చేసింది. తక్కువకే వైద్యం చేసింది. ఇప్పటికీ మెడికల్ కాలేజీ ఆస్పత్రిలో చాలా తక్కువ ఫీజులు వసూలు చేస్తారు. ఇక డైరక్టర్లు ఆస్పత్రి డబ్బులు నొక్కేశారని చాలా కథలు రాశారు.ముఖ్యంగా డాక్టర్ అక్కినేణి మరి ఆరేడు కోట్లు తరలించుకున్నారని కొన్ని మీడియాల్లో రాశారు. డాక్టర్ అక్కినేని మణి ఎన్నారై మెడికల్ కాలేజీ, ఆస్పత్రి వ్యవస్థాపకుల్లో ఒకరు. ఆమె విదేశాల్లో ఎంతో అనుభవం సంపాదించి ఇక్కడి ప్రజలకు వైద్యం, వైద్య అందుబాటులోకి తేవాలన్న లక్ష్యంతో వచ్చారు. ఆమె వయసు కూడా పైబడింది. ఇవేమీ తెలియకుండానే ఆమెపై నిందలు వేసేశారు. నిజమేమిటో ఈడీనే చెప్పాల్సి ఉంది.
కానీ ఈ ఆస్పత్రి చుట్టూ జరుగుతున్న రాజకీయం మాత్రం అంతా ఇంతా కాదు. డైరక్టర్లు రాజకీయ ప్రభావంతో రెండు వర్గాలుగా విడిపోయారు. మేఘా కృష్ణారెడ్డికి ఈ మెడికల్ కాలేజ్,ఆస్పత్రి అమ్మేయాడనికి ప్రయత్నించారు. రూ. 630కోట్లతో డీల్ కుదిరిందని ప్రచారం జరిగింది. కానీ సగానికి కన్నా ఎక్కువ మంది డైరక్టర్లు వ్యతిరేకించారు. అప్పట్లో ఆ డీల్ ఆగిపోయింది. ఇలా వ్యతిరేకించిన వారిపైనే కేసులు.. అరెస్టులు వంటివి చోటు చేసుకుంటున్నాయి. ఇప్పుడు ఈడీ దాడులు కూడా జరిగాయి. త్వరలో ఎన్నారై ఆస్పత్రి చేతులు మారితే ఈడీ దాడుల మోటివ్ అర్థం చేసుకోవచ్చు. లేకపోతే.. ఈడీ చెప్పే అధికారిక వివరాలు ఏమిటో..బయట జరుగుతున్న ప్రచారం ఏమిటో..తేలడానికి కొంత సమయం పట్టే అవకాశం ఉంది.