కాంగ్రెస్ పార్టీ చేతుల్లో ఉండే నేషనల్ హెరాల్డ్ అనే సంస్థ ఆస్తులను జప్తు చేయడానికి ఈడీ రెడీ అయిపోయింది. అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ ,యంగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీల ఆస్తులను ఈడీ స్వాధీనం చేసుకోనుంది. మనీ లాండరింగ్ జరిగిందన్న ఆరోపణలతో రూ. 661 కోట్ల విలువైన ఢిల్లీ, ముంబై, లక్నోలలోని స్థిరాస్తులను జప్తు చేయనున్నారు. ఏజేఎల్ , కాంగ్రెస్ పార్టీ షేర్హోల్డర్లు , పార్టీ దాతలను మోసం చేశారని ఈడీ ఆరోపిస్తోంది. ఆయా సంస్థల ఆస్తులను చాలా తక్కువకు కొట్టేయడానికి ప్రయత్నించారని.. ఏఐసీసీ నుండి రూ. 90.21 కోట్ల రుణాన్ని వైఐకి రూ. 50 లక్షలకు బదిలీ చేశారని ఇది పెద్ద స్కామని చెబుతోంది. అయితే ఈ కేసులో ఎక్కడా మనీ లావాదేవీలు జరగలేదు. కేవలం షేర్ల మార్పిడి జరిగింది. దీన్నే అతి పెద్ద స్కాంగా ఈడీ చెబుతోంది.
నిజంగా వందలు, వేల కోట్ల నగదు లావాదేవీలు జరిగిన స్కాంలు కళ్ల ఎదుట ఉన్నాయి. కేసులు నమోదు అయినా చూసీ చూడనట్లుగా పోతున్న కేసులు లెక్కలేనన్ని ఉన్నాయి. ఆర్థిక ఉగ్రవాదానికి పాల్పడినట్లుగా ఆరోపణలు ఉన్నా వారంతా హాయిగా దోపిడీ చేసిన సంపదతో వ్యాపారాలు చేస్తూనే ఉన్నారు. ఆ సంపదను అనుభవిస్తూనే ఉన్నారు. వ్యవస్థలను దుర్వినియోగం చేస్తూనే ఉన్నారు. ప్రత్యక్ష ఆధారాలు ఉన్న వారిపై చర్యలు మాత్రం ఏళ్లకు ఏళ్లు ఆలస్యమవుతూనే ఉన్నాయి.
ఆంధ్రాలో జగన్మోహన్ రెడ్డి ఆర్థిక ఉగ్రవాదానికి పాల్పడ్డారని న్యాయస్థానాలు కూడా వ్యాఖ్యానించాయి. ఆయన దోపిడీ స్టైల్ బహిరంగం. ప్రభుత్వ ఆస్తుల్ని ప్రైవేటు సంస్థకు ఆయన తండ్రి సీఎంగా ఉన్నప్పుడు రాసిస్తే వారి వద్ద నుంచి పెట్టుబడుల రూపంలో జగన్ లంచాలు తీసుకుని వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించారు. సీఎం అయిన తర్వాత ఆయన అతి పెద్ద లిక్కర్ స్కాం చేశారు. ఆధారాలు ఉన్నా.. రంగంలోకి దిగడం లేదు. ఇలాంటి ఆర్థిక నేరస్తుల్ని ఎదురుగా పెట్టుకుని వారిపై జాలి చూపించి..అసలు లావాదేవీలే జరగని.. ఎప్పుడో లక్షల రూపాయల విలువ ఉన్నప్పటి ఆస్తులకు ?ఇప్పటి మార్కెట్ వాల్యూ చూపించి వందల కోట్ల దోపిడీ అని ప్రచారం చేస్తే ఏం వస్తుంది?. అసలైన ఆర్థిక ఉగ్రవాదుల్ని ఎప్పుడు పట్టుకుంటారు..? దోచుకున్న సంపదను ఎప్పుడు స్వాధీనం చేసుకుంటారు?