తెలంగాణలో రెండు రోజుల పాటు జరిగిన ఈడీ దాడులు కలకలం రేపాయి. గ్రానైట్ వ్యాపారులయిన టీఆర్ఎస్ నేతలు గంగుల కమలాకర్, గాయత్రి రవిలను టార్గెట్ చేసి ఈ దాడులు జరిగాయి. వెంటనే కేసీఆర్ వారిద్దర్నీ పిలిచి కంగారు పడొద్దని.. ధైర్యం చెప్పారు. అయితే ఈ సోదాలపై తాజాగా ఈడీ అధికారిక ప్రకటన చేసింది. అదేమిటంటే.. తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన ఫిర్యాదు మేరకే సోదాలు చేసిందట ఈడీ. కరీంనగర్ జిల్లాలోని క్వారీ లీజు ప్రాంతాల నుంచి సముద్రమార్గం ద్వారా రవాణా చేసిన గ్రానైట్ బ్లాకులపై పెద్ద ఎత్తున సీగ్నియరేజ్ ఫీజు ఎగవేతకు పాల్పడినట్లుగా తెలంగా ప్రభుత్వ విజిలెన్స్ & ఎన్ఫోర్స్మెంట్ విభాగం నివేదిక ఆధారంగానే కేసులు పెట్టామని ఈడీ ప్రకటించింది.
ఈ సోదాల్లో రాయల్టీ చెల్లించిన పరిమాణం కంటే ఎగుమతి చేసిన పరిమాణం ఎక్కువగా ఉందని రికార్డులు వెల్లడయ్యాయని. ఎగుమతి చేసేటప్పుడు పరిమాణం తక్కువ చూపించి పన్నులు ఎగ్గొట్టారని తేలింది. ఎగుమతి ఆదాయం బ్యంక్ ఖాతాలలో కనిపించలేదని.. తద్వారా ఎగుమతి ఆదాయం బ్యాంకింగ్ మార్గాల ద్వారా కాకుండా ఇతర మార్గాల ద్వారా స్వీకరించారని గుర్తించినట్లయిందని ఈడీ తెలిపింది. అంటే హవాలాకు పాల్పడ్డారని ఈడీ చెప్పినట్లయింది. సోదాల సందర్భంగా ఈడీ సెర్చ్ బృందాలు లెక్కల్లో చూపని రూ. 1.08 కోట్లు నగదు స్వాధీనం చేసుకున్నామని ఈడీ తెలిపింది.
అదే సమయంలో ఎగుమతులు చేసినందుకు గాను.. రావాల్సిన డ్బబును ఉద్యోగుల పేరుతో అనేక బినామీ బ్యాంకు ఖాతాలను తెరిచి అందులో జమ చేయించారు. ఎగుమతుల నగదు.. హవాలా ద్వారా తీసుకున్నారు. బ్యాంకుల్లో జమ చేయలేదు. పత్రాలు లేకుండా చేతి రుణాల రూపంలో చైనీస్ సంస్థల నుండి భారతీయ సంస్థలకు డబ్బు తిరిగి మళ్లించారు. ఈ సంస్థలన్నీ పనామా లీక్స్‌లో కనిపించిన లి వెన్హువోకు చెందినవని ఈడీ ప్రకటించింది. ఈడీ ప్రకటన ప్రకారం చూస్తే తెలంగాణ సర్కారే తమ నేతలను ఇరికించిందన్న అభిప్రాయం అందరికీ వస్తుంది. అసలు గ్రానైట్‌తో ఈడీకి ఏం పని అని మంత్రి గంగుల ఆశ్చర్యం వ్యక్తం చేశారు. కానీ ఇప్పుడు క్లారిటీ వచ్చినట్లయింది.