ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈడీ దూకుడు ఓ రేంజ్లో ఉన్నట్లుగా కనిపిస్తోంది. ఆ లిక్కర్ స్కాం పేరు పెట్టుకుని తెలంగాణలో అధికార పార్టీలో ఉన్న కీలకమైన “మనీ” లింకుల్ని బయటకు లాగుతున్నట్లుగా కనిపిస్తోంది. ఇప్పటికే రెండు సార్లు తెలంగాణలో ఈడీ సోదాలు జరిగాయి. ఇప్పుడు మరోసారి ఢిల్లీ నుంచి ప్రత్యేకంగా వచ్చిన బృందాలు తెలంగాణలో సోదాలు నిర్వహిస్తున్నాయి. ఈ సారి ఒకే వ్యక్తిపై ఈడీ అధికారులు దృష్టి సారించారు. ఆయన పేరు వెన్నమనేని శ్రీనివాసరావు.
కరీంనగర్‌కు చెందిన వెన్నమనేని శ్రీనివాసరావు టీఆర్ఎస్ నేతగా చెప్పుకుంటారు కానీ ఆయన .. ఎంపీ సంతోష్‌కు బాగా దగ్గర అని చెబుతున్నారు. కేసీఆర్ కుటుంబంతో బంధుత్వం కూడా ఉందని చెబుతారు. ఆయన హైదరాబాద్‌లో ఓ సాఫ్ట్ వేర్ కంపెనీ.. ట్రావెల్స్ కంపనీతో పాటు ఇతర వ్యాపారాలు కూడా నిర్వహిస్తూంటారని చెబుతున్నారు. ఆయన ఆర్థిక లావాదేవీలపై పూర్తి స్థాయిలో పరిశీలన జరిపి.. చివరికి అన్ని వివరాలు తెలుసుకున్న తర్వాతనే ఈడీ అధికారులు రంగంలోకి దిగినట్లుగా తెలుస్తోంది. సోదాల తర్వాత ఈడీ అధికారులు వెన్నమనేని శ్రీనివాసరావును అదుపులోకి తీసుకున్నారు. ప్రశ్నిస్తారు.
ఢిల్లీ లిక్కర్ స్కాం వ్యవహారంలో ఈడీ చాలా సీరియస్‌గా దృష్టి సారించినట్లుగా కనిపిస్తోంది. ఒక్కో లింక్ బయటకు వస్తే పెద్ద ఎత్తున విషయాలు వెలుగులోకి వస్తాయని భావిస్తున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కాం మొత్తం దేశ రాజధానిదే అయినా టార్గెట్ చేసింది మాత్రం తెలంగాణ లోని రాజకీయాలనన్న చర్చ జరుగుతోంది. ముందు ముందు ఈ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం కనిపిస్తోంది.