తెలుగుదేశం పార్టీ ఎంపీ సుజనా చౌదరికి చెందిన కంపెనీలు బ్యాంకులకు ఏకంగా రూ. 5,700 కోట్లు ఎగ్గొట్టాయని.. ఎన్ ఫోర్స్ మెంట్ డైరక్టరేట్ వర్గాలు.. మీడియాకు సమాచారం అందించాయి. నెలలో రెండు సార్లు ఆయనకు చెందిన కంపెనీల్లో ఈడీ అధికారులు విస్తృత సోదాలు నిర్వహించారు. పలు కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ నెల 27న విచారణకు హాజరు కావాలని ఈడీ అధికారులు సమన్లు జారీ చేశారు. హైదరాబాద్, దిల్లీలోని ఆయన నివాసాలు, కార్యాలయాల్లో ఈ రోజు సోదాలు చేసిన ఈడీ అధికారులు ఈ మేరకు ఆయనకు నోటీసులు జారీచేశారు. సుజనా ఆధీనంలోని 120 డొల్ల కంపెనీలు ఉన్నట్టు ఈడీ వెల్లడించింది. సుజనా చౌదరికి చెందిన ఆరు ఖరీదైన కార్లను ఈడీ జప్తు చేసింది. అప్పులిచ్చిన బ్యాంకుల ఫిర్యాదు మేరకే చర్యలు తీసుకున్నామని ఈడీ వర్గాలంటున్నాయి.
తెలుగుదేశం పార్టీ నేతల మాత్రం కావాలనే టార్గెట్ చేసి… సుజనా చౌదరిపై దాడులు చేస్తున్నారని ఆరోపిస్తున్నాయి. నిజానికి సుజనా చౌదరి కేంద్రమంత్రిగా ఉన్నప్పుడే కొన్ని వివాదాలు చుట్టుముట్టాయి. మారిషస్ బ్యాంక్ ఒకటి సుజనా కంపెనీలపై దావా వేసింది. ఆ తర్వాత సుజనా చౌదరి కూడా ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయన్న విషయాన్ని అంగీకరించారు. పార్టీ నిర్ణయం మేరకు.. కేంద్ర మంత్రి పదవి నుంచి వైదొలిగిన తర్వాత ఆయన లో ప్రోఫైల్ మెయిన్ టెయిన్ చేస్తున్నారు. ఆ సమయంలో ఆయన బీజేపీలో చేరుతారన్న ప్రచారం కూడా జరిగింది. అప్పుడు… పెద్దగా.. దృష్టి పెట్టని ఈడీ ఇప్పుడు.. ఒక్కసారిగా దాడులకు చేస్తోంది. అయితే ఏకంగా రూ. 5,700 కోట్లు ఎగవేస్తే. ఇంత సాదాసీదాగా దాడులు చేసి.. సమన్లు ఇచ్చి ఊరుకుంటారా.. అన్న సందేహాలు ఆర్థిక వర్గాల్లో ఉన్నాయి
ఈడీ వర్గాలు మీడియాకు అందించిన సమాచారాన్ని సుజనా గ్రూప్ ఖండించింది. తమ డైరెక్టర్లకు లుకౌట్ నోటీసులు జారీ చేశారన్నదిదుష్ప్రచారమేనని, ఆ ఆరోపణల్ని ఖండిస్తున్నట్టు తెలిపింది. పదేళ్ల నాటి ఓ శోధనలో భాగంగా చెన్నై నుంచి ఈడీ అధికారులు వచ్చారని, వారికి అవసరమైన సమాచారం అందించినట్టు సుజనా గ్రూప్ స్పష్టం చేసింది. ఇరవై ఏడో తేదీన ఈడీ ముందు సుజనా చౌదరి హాజరైన తర్వాత అసలు వ్యవహారం బయటకు వచ్చే అవకాశం ఉంది.