కర్ణాటక కాంగ్రెస్ ట్రబుల్ షూటర్…శివకుమార్ చిక్కుల్లో పడ్డారు. ఆయన చిదంబరం లాగే… జైలుకెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. అర్థరాత్రి బెంగళూరులో సమన్లు పంపి.. తర్వాతి రోజు మధ్యాహ్నం ఢిల్లీలో ఈడీ అధికారులు తమ ఎదుట హాజరు కావాలని ఆదేశించారు. ఆయన హాజరయ్యారు. శివకుమార్‌ను మనీలాండరింగ్ కేసులో అరెస్టు చేసినట్లయితే కేంద్ర మాజీ ఆర్థికమంత్రి చిదంబరంలాగే ఆయన కూడా కొంతకాలం జైల్లో ఉండాల్సిందే. ఈడీ ఎదుట హాజరయ్యేందుకు వెళ్లే ముందు ఆయన తాను హత్యలు చేయలేదని.. అత్యాచారాలు చేయలేదని కాస్త ఘాటుగానే వ్యాఖ్యానించారు.
కర్ణాటక రాజకీయాల్లో డీకేఎస్గా చిరపరిచితుడైన శివకుమార్ అక్కడ కాంగ్రెస్ పార్టీకి పిల్లర్ లాంటి వ్యక్తి. 27 ఏళ్ల వయస్సులో ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుండి ఆయన ట్రబుల్ షూటర్‌గానే పేరు పొంందారు. 1990లో బంగారప్ప కర్ణాటక సీఎంగా పనిచేసినప్పుడు 29 ఏళ్లకే మంత్రి అయ్యారు. ఆ తర్వాత కాంగ్రెస్‌లో కీలకంగా వ్యవహరించారు. 2013లో కాంగ్రెస్ గెలిచినప్పటికీ మంత్రి పదవి ఇవ్వలేదు. 2014లో ఇవ్వక తప్పలేదు. బీజేపీతో కర్ణాటకలో రాజకీయ ప్రత్యర్థిగా తలపడినా.. ఢిల్లీ పెద్దలకు.. శివకుమార్ టార్గెట్ అయింది మాత్రం… గుజరాత్ రాజ్యసభ ఎన్నికల సమయంలోనే. అహ్మద్ పటేల్‌ను గుజరాత్ రాజ్యసభ ఎన్నికల్లో ఓడించాలని బీజేపీ ప్రయత్నించినప్పుడు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలందరినీ బెంగళూరు క్యాంపుకు తరలించి పటేల్ పరువు కాపాడారు శివకుమార్. ఈడీ, ఐటీ దాడులు జరిగినా శివకుమార్ భయపడలేదు.
కర్ణాటక శాసనసభ ఎన్నికల తర్వాత బీజేపీ నుంచి ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు తొలుత బెంగళూరు రిసార్ట్‌కు తర్వాత హైదరాబాద్‌కు తరలించారు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా సంఘటనలే ఉన్నాయి. శివకుమార్ ను కంట్రోల్ చేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తూనే ఉంది. మరో పక్క ఈడీ కేసు ఆయన్ను మరిన్ని ఇబ్బందుల్లోకి నెట్టే అవకాశం ఉంది. ఆయన రాజకీయంగా ఏ నిర్ణయం తీసుకుంటారన్నదానిపై.. ఆయన కేసుల నడక కూడా ఆధారపడి ఉంది.