జగన్ అక్రమాస్తుల కేసులో ఈడీ మరో సారికీలక చర్యలు తీసుకుంది. దాల్మియా సిమెంట్స్ ఆస్తులను జప్తు చేసింది. మొత్తంగా రూ. 793 కోట్ల ఆస్తులను జప్తు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కడప జిల్లాలోని సున్నపురాయి గనుల తవ్వకాల్లో అక్రమాలు జరిగాయని గతంలో CBI చార్జిషీటు దాఖలుచేసింది. దీనిపై 2013 లో సీబీఐ దాఖలు చేసిన చార్జ్ షీట్ ఆధారంగా ఈడీ కేసులు పెట్టింది. ఈ వ్యవహారంలో మొత్తం రూ. 150 కోట్ల మేర జగన్ లబ్ధి పొందారని CBI తేల్చింది.
CBI చార్జ్ షీట్ ఆధారంగా మనీ లాండరింగ్ జరిగిందని ఈడీ తేల్చి ఇప్పుడు ఆస్తులు జప్తు చేస్తూ నిర్ణయం తీసుకుంది. జగన్ రూ.150 కోట్ల లబ్ధిని షేర్లు, హవాలా రూపంలో నగదు పొందినట్లు ఈడీ గుర్తించింది. రూ.95కోట్లు రఘురాం సిమెంట్స్‌లో షేర్లు పొందారు. ఇది తర్వాత భారతి సిమెంట్స్ గా మారింది. రూ.55కోట్లు హవాలా రూపంలో డబ్బు ఇచ్చినట్లు గుర్తించారు. కడప జిల్లాలోని సుమారు 417 హెక్టార్ల విస్తీర్ణంలో ఉన్న సున్నపురాయి గనులను దాల్మియా సిమెంట్స్ సంస్థకు అప్పటి వైఎస్ఆర్ ప్రభుత్వ కాలంలో లీజుగా మంజూరు చేశారు.
ఇప్పటికే అన్ని ఆధారాలతో చార్జిషీటు దాఖలు పుష్కరం దాటిపోయింది. ఇప్పటికి వివిధ రకాల పిటిషన్లు వేస్తూ జగన్ ట్రయల్ ను ఆలస్యం చేస్తున్నారు. ఇప్పటికి వరకూ ఆ ఆస్తుల జప్తులో ఈడీ కూడా సీరియస్ గా వ్యవహరించలేదు. హఠాత్తుగా ఈడీ జప్తు చేయడం చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికైనా జగన్ అక్రమాస్తుల కేసుల విచారణలో వేగం పెరుగుతుందని తెలుగు ప్రజలు అంచనా వేస్తున్నారు.