రేవంత్ రెడ్డి పేరు పీసీసీ చీఫ్ పోస్టు పదవిలో ఎంత దూకుడుగా వినిపిస్తుందో.. అంతే దూకుడుగా ఆయనను ఇబ్బంది పెట్టేందుకు కేసులు తెర మీదకు వస్తున్నాయి. తాజాగా ఈడీ ఓటుకు నోటు కేసులో విచారణ ప్రారంభించింది. అసలు ఈకేసుకు ఈడీకి ఏం సంబంధం అనే చర్చ సహజంగానే వస్తుంది. మనీలాండరింగ్ ఏమైనా జరిగితే.. ఆధారాలుంటే.. ఈడీ దర్యాప్తు చేస్తుంది. ఇలాంటి కేసుల్ని స్థానిక దర్యాప్తు సంస్థలే నిర్వహిస్తాయి. అయితే.. ఓటుకు నోటు కేసు దాదాపుగా తేలిపోయిన పరిస్థితిలో.. సుప్రీంకోర్టులో ఉంది. ఇక్కడ ఏమీ చేయడానికి లేకపోవడంతో.. ఈడీని రంగంలోకి దింపారనే అనుమానాలు వస్తున్నాయి.
తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు.. రేవంత్ రెడ్డా.. కోమటిరెడ్డా అనే అంశంపై చర్చ జరుగుతోంది. కోమటిరెడ్డి ప్రశాంతంగానే ఉన్నారు. కానీ రేవంత్ రెడ్డికి మాత్రం ఆ పదవి రాకుండా.. అటు కాంగ్రెస్‌లోని ఓ వర్గం.. ఇటు టీఆర్ఎస్లోని మరో వర్గం.. ఓ బడా పారిశ్రామిక లాబీ… చివరికి బీజేపీలోని మరికొంత మంది నేతలు కూడా.. తీవ్రంగా ప్రయత్నిస్తున్నారన్న చర్చ జరుగుతోంది. రేవంత్ రెడ్డిని అంతగా ఎందుకు టార్గెట్ చేస్తున్నారో కానీ.. ఈ విషయంలో ఆయన మాత్రం నింపాదిగా ఉన్నారు. ఈడీ విచారణ జరిపినట్లుగా..ఈ కేసులో ఎప్పుడో హైకోర్టు నుంచి సంబంధం లేనట్లుగా తీర్పు కూడా తెచ్చుకున్న మత్తయ్య అనేపాస్టర్ కు నోటీసులిచ్చి… వాంగ్మూలం ఇచ్చినట్లుగా దాన్ని మీడియాలో ప్రచారం చేసి.. మళ్లీ ప్రజల్లోకి చర్చకు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు.
ఒక్క కేసు మీద ఎన్ని రకాల దర్యాప్తు సంస్థలు దర్యాప్తు జరుపుతాయో కానీ.. కొంత మంది నేతల్ని టార్గెట్ చేసుకోవడానికి ఈ కే్సు ఓ అవకాశంగా దొరికింది. న్యాయస్థానాల్లో ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు కానీ.. మీడియాలో మాత్రం సదరు వ్యక్తుల ఇమేజ్ డ్యామేజ్ చేయడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. మత్తయ్య అనే వ్యక్తికి అసలు కేసుతో ఏ సంబంధం ఉందో ఎవరికీ తెలియదు కానీ..ఆయన మాత్రం… ఇప్పటి వరకూ అన్ని రకాల ప్రకటనలు చేశారు.