వైఎస్ జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల విషయంలో మనీలాండరింగ్తో పాటు వివిధ మనీ చట్టాల ఉల్లంఘనకు సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరక్టరేట్ కూడా కేసులు నమోదు చేసింది. అనేక ఆస్తులుఎటాచ్ చేసింది. అటాచ్ చేసిన ఆస్తులను గత ఏడాది చాలా వరకు మినహాయింపు ఇచ్చింది. అయితే ఇప్పుడు ఈడీ మరోసారి పట్టు బిగిస్తోంది. తమ కేసులు విడిగా విచారణ చేయాల్సిందేనని పట్టుబడుతోంది. సీబీఐ కేసులతో సంబంధం లేదని వాదిస్తోంది. సీబీఐ కేసులతో సంబంధం లేకుండా.. ఈడీ కేసులపై విచారణ జరపాలని .. ఈడీ ఛార్జిషీట్లు వేరుగా విచారణ జరపొచ్చని.. గతంలో వివిధ కోర్టులు ఇచ్చిన పలు తీర్పులను ఈడీ తరపు న్యాయవాది కోర్టుకు సమర్పించారు.
సీబీఐ కేసులు తేలిన తర్వాత ఈడీ కేసుల విచారణ చేపట్టాలని జగన్ పిటిషన్ వేశారు. ఒక వేళ సీబీఐ కేసులు కొట్టి వేస్తే ఆటోమేటిక్గా ఈడీ కేసులు కూడా రద్దవుతాయని జగన్ లాయర్ .. చెప్పుకొచ్చారు. సీబీఐ వేసిన చార్జిషీట్ల ఆధారంగానే కేసు పెట్టారనే లాజిక్ వినిపించారు. అయితే.. సీబీఐ కేసులు వేరు.. ఈడీ కేసులు వేరని ఎన్ఫోర్స్ మెంట్ డైరక్టరేట్ తరపు లాయర్లు స్పష్టం చేశారు. జగన్ తరపు లాయర్ వాదనపై మొదటి నుంచి న్యాయనిపుణుల్లో విస్మయం వ్యక్తమవుతోంది. మనీలాండరింగ్ సహా వివిధ చట్టాల ఉల్లంఘన కింద కేసులు నమోదు చేశారు. వాటికి స్పష్టమైన ఆధారాలున్నప్పుడు.. సీబీఐ కేసులు కొట్టి వేస్తే.. ఈడీ కేసులు ఎందుకు రద్దవుతాయని ప్రశ్నిస్తున్నారు.
విదేశాల నుంచి షెల్ కంపెనీల ద్వారా పెట్టుబడులను పెద్ద ఎత్తున తీసుకు వచ్చారని సీబీఐ తేల్చింది. అలా నగదు వచ్చిన మార్గాలను కూడా తెలిపింది. దాంతో ఈడీ కేసులు నమోదు చేసి.. ఆస్తులు సీజ్ చేసింది. కొన్ని కేసుల్లో జగన్ సీఎం అయిన తర్వాత రిలాక్సేషన్ వచ్చింది. ఇప్పుడు.. విచారణ ప్రారంభమయ్యే పరిస్థితి ఉండంటంతో … వాటివిచారణను ఆపేందుకు సీబీఐ విచారణను సాకుగా చెప్పే ప్రయత్నం చేశారు. కానీ.. ఈడీ లాయర్ మాత్రం ఆ ప్రయత్నాన్ని గట్టిగా ప్రతిఘటిస్తున్నారు.