జగన్మోహన్ రెడ్డి సీబీఐ కేసులు మాత్రమే కాదు.. ఎన్ఫోర్స్మెంట్ డైరక్టరేట్ కేసులు కూడా ఎదుర్కొంటున్నారు. ఆ కేసుల విచారణ కూడా సీబీఐ కోర్టులోనే సమాంతరంగా జరుగుతోంది. గతంలో సీబీఐ విచారణకు వ్యక్తిగత మినహాయింపు అడిగిన జగన్కు చుక్కెదురు అయింది. ఇప్పుడు.. ఈడీ కేసుల్లో విచారణకు వ్యక్తిగత హాజరు మినహాయింపు కోసం పిటిషన్ వేసుకున్నారు. దీనిపై వాదనలు ముగిశాయి. కోర్టు తీర్పును ఈ నెల ఇరవై నాలుగో తేదీకి వాయిదా వేసింది. ఈడీ కూడా.. జగన్కు ఎట్టి పరిస్థితుల్లోనూ.. హాజరు మినహాయింపు ఇవ్వవొద్దని ఆదేశించింది.
అక్రమాస్తుల కేసులో జగన్మోహన్ రెడ్డి చాలా రోజుల తర్వాత సీబీఐ కోర్టుకు హాజరయ్యారు. ఆయనతో పాటు ఇతర నిందితులంతా హాజరయ్యారు. పదిన్నర సమయంలో కోర్టుకు వచ్చిన జగన్.. దాదాపుగా రెండు గంటలు.. నిందితులు కూర్చునే చోట కూర్చున్నారు. అటెండర్ హాజరీ కోసం అరిచినప్పుడు తాను వచ్చినట్లుగా సంకేతం పంపారు. విచారణ జరిగినంత సేపు ఆయన సైలెంట్ గానే ఉన్నారు. తదుపరి విచారణ పదిహేడో తేదీకి వాయిదా పడటంతో.. అక్కడ్నుంచి నేరుగా.. బేగంపేట వెళ్లారు. అక్కడ్నుంచి ప్రత్యేక విమానంలో అమరావతి చేరుకున్నారు.
కోర్టు.. పెన్నా సిమెంట్ అనుబంధ చార్జీషీట్ను.. పరిగణనలోకి తీసుకుంది. దీన్ని పరిగణనలోకి తీసుకోవద్దని… జగన్ తో పాటు ఇతర నిందితులు దాఖలు చేసిన పిటిషన్ను కోర్టు కొట్టి వేసింది. ఇందులో నిందితులుగా ఉన్న.. జగన్ తో పాటు బొత్స, ధర్మాన సహా ఇతరులకు సమన్లు జారీ చేసింది. అందరూ ఈ నెల పదిహేడో తేదీన మళ్లీ హాజరు కావాల్సి ఉంది. జగన్మోహన్ రెడ్డి కోర్టు హాజరు నుంచి తప్పించుకోలేని పరిస్థితుల్లో పడ్డారని న్యాయనిపుణులు చెబుతున్నారు.