తెల్లని బట్టలు,జులపాల జుత్తు.. ఎప్పుడూ మొహంపై చెరగని చిరునవ్వు…
గౌతమ్ రాజు అంటే గుర్తొచ్చే రూపం ఇది. `ఎడిటింగ్ – గౌతంరాజు` అని కొన్ని వందల సినిమాల్లో చూసి ఉంటారు జనం. ఎడిటర్లలో ఆయన తొలి స్టార్ అనుకోవచ్చు. దాదాపు 800 చిత్రాలకు ఎడిటింగ్ చేశారాయన. మూడు దశాబ్దాలకు పైగానే చిత్రసీమకు తన సేవలందించారు. గౌతమ్ రాజు వచ్చాక.. సినిమా `కటింగ్`లో చాలా మార్పులొచ్చాయి. వేగం పెరిగింది. నిజానికి ఎడిటర్ ఎంత పని చేయగలడు? ఓ సినిమా విజయం వెనుక ఎడిటర్ బాధ్యత ఎంత ఉంటుంది? అనేది తెలుగు సినిమాకి గౌతమ్ రాజు వచ్చాకే ఆగా అర్థమైంది. ఇది వరకు దర్శకుడు ఏఆర్డర్లో చెబితే.. ఆ ఆర్డర్ లో.. సినిమాని కత్తిరించేవారు. కానీ.. గౌతమ్ రాజు మాత్రం.. రషెష్ అంతా చూశాక, కథ మొత్తం విన్నాక `ఈ కథని ఈ ఆర్డర్ లో కట్ చేస్తే బాగుంటుంది` అంటూ.. తనదైన టెక్నిక్ వాడేవారు. ఒక్కోసారి.. ఎడిట్ అయిన తరవాత.. సినిమా మొత్తం చూసుకుంటే.. `ఇది మన సినిమానేనా` అని దర్శకులు కూడా షాకయ్యేవారు. ముందున్న సీన్ వెనుక పెట్టి, వెనుకున్న సీన్ ముందుకు తీసుకురావడం వల్ల.. ఒక్కోసారి సినిమా స్పీడే మారిపోతుంది. గౌతమ్ ఇలాంటి మ్యాజిక్ చాలాసార్లు చేసేవారు. అందుకే గౌతమ్ రాజుని నమ్మి, ఆయనకు సినిమాని అప్పజెప్పేసేవారు దర్శకులు. `ఈ సినిమాలో ఇలాంటి సీన్ ఉంటే బాగుంటుంది… ఎమోషన్ సరిపోలేదు. ఇక్కడ ఇంకో డైలాగ్ కావాలి..` అంటూ దర్శకుల్ని, రైటర్లని పిలిపించి మరీ.. తన అభిప్రాయాలు చెప్పేవారు. గౌతమ్ రాజు చెప్పారంటే. అది విలువైన పాయింటే అని దర్శకులూ నమ్మేవారు. అలా చాలా సినిమాల జాతకాల్ని మార్చారు గౌతమ్ రాజు. ఇప్పుడు టాలీవుడ్ లో ఓ వెలుగు వెలుగుతున్న చాలామంది ఎడిటర్లు ఆయన శిష్యులే. కాకపోతే.. ఆయనకు మీడియా అంటే చాలా సిగ్గు. ఎప్పుడూ మీడియా ముందుకు రాలేదు. ఒక్క ఇంటర్వ్యూ కూడా ఇవ్వలేదు. కనీసం ఆడియో ఫంక్షన్లలోనూ మాట్లాడేవారు కాదు. ఓ రకంగా ఆయన మౌనముని. ఆయన మాట్లాడకపోయినా.. ఆయన కత్తెర మాట్లాడుతూనే ఉంటుంది. ఇంత అనుభవ శీలి, ఎడిటింగ్‌లో తెలుగు సినిమాకు కొత్త పాఠాలు నేర్పిన గురువు.. లేకపోవడం, సడన్‌గా ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్లడం నిజంగా బాధాకరం. ఆయనకు తెలుగు 360 ఘనమైన నివాళి అర్పిస్తోంది.