“To rule is easy, to govern difficult.” అధికారం చెలాయించడం ఈజీనే కానీ పరిపాలించడం మాత్రం అంత సులువు కాదు. ఓ జర్మన్ రాజకీయ వేత్త పద్దెనిమిదో శతాబ్దంలో చెప్పిన ఈ మాట మనం ఇప్పటికీ గుర్తు చేసుకుంటున్నామంటే దీనికి కారణం… అధికారానికి.. పరిపాలనకు మధ్య ఉన్న తేడాను ప్రపంచవ్యాప్తంగా పాలకులు గుర్తించకపోడమే. ముఖ్యంగా ఓట్లు కూడా కొనుగోలు వస్తువులైపోయిన పేరు గొప్ప ప్రజాస్వామ్యంలో ఇలాంటి అధికారంలోకి వచ్చే వారు తప్ప.. పరిపాలన చేసే వారు కనిపించడం లేదు. దానికి దేశం 70 ఏళ్లకు ప్రతిఫలం అనుభవిస్తూనే ఉంది. ప్రజలు కూడా భరిస్తూనే ఉన్నారు. ఇప్పుడు కూడా భరిస్తున్నారు. పవర్లో ఉన్న ప్రభుత్వాలకు పరిపాలన చేత కాకపోవడం వల్ల దేశం దేశం మొత్తం కరెంట్ సంక్షోభం తాండవిస్తోంది.
మిగులు విద్యుత్ ఉన్న దేశం అని డాంబికాలు పలికింది ఆరు నెలలు కూడా కాలేదు !
మిగులు విద్యుత్ ఉన్న దేశంలో బొగ్గుకొరత గురించి మాట్లాడుతున్నారెందుకు? అని గత ఏడాది అక్టోబర్‌లో చైనా సహా ఇతర దేశాల్లో విద్యుత్ సంక్షోభం ఏర్పడినప్పుడు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతామన్ చేసిన ప్రకటన ఇది. కేంద్రమంత్రి ప్రకటన చూసి చాలా మంది గుండెలపై చేయి వేసుకున్నారు. కానీ ఇప్పుడేం జరుగుతోంది. దేశం మొత్తం విద్యుత్ సంక్షోభం.
దేశవ్యాప్తంగా విద్యుత్ కొరత వేధిస్తోంది. దాదాపుగా అన్ని రాష్ట్రాల్లోనూ కరెంట్ కోతలు అమలు చేస్తున్నారు. అసలే వేసవి ఆపైన కరెంట్ కోతలు అంటే.. ప్రజలకు ఎంత అసహనంగా ఉంటుందో చెప్పనక్కరలేదు. అదే మూడు నెలల కిందటి వరకూ దేశంలో కరెంట్ పుష్కలంగా ఉండే్ది. కావాల్సినంత ఉండేది. దేశం మొత్తం మిగులు విద్యుత్ ఉందని చెప్పుకున్నారు. కానీ ఇప్పుడుఎందుకు సమస్య వచ్చిందంటే ఎవరూ ఠక్కున సమాధానం చెప్పలేకపోతున్నారు. విద్యుత్ కు కొరత లేదు.. బొగ్గుకూ కొరత లేదు. కానీ ఎందుకు సంక్షోభం వచ్చింది.
కేంద్రం ప్రకటించుకున్న విద్యుత్ స్వావలంబన ఎటు వైపు పోయింది !?
భారతదేశ చరిత్రలోనే మొదటిసారిగా 2012 జులై నెలలో భారీ స్థాయిలో కరెంటు సరఫరాకు ఆటంకం కలిగింది. దీనివల్ల ఆ సమయంలో 62 కోట్ల మంది చీకట్లో కొట్టుమిట్టాడారు. 24,000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యానికి అవకాశమున్నప్పటికీ బొగ్గు, గ్యాస్ కొరత కారణంగా ఉత్పత్తి పడిపోయింది. 2014లో ఎన్ డీ ఏ ప్రభుత్వం పాలనాపగ్గాలు చేపట్టే నాటికి బొగ్గు ఆధారిత విద్యుత్ కర్మాగారాల్లో మూడింట రెండువంతులు బొగ్గు కొరతను ఎదుర్కొన్నాయి. ఆ సమయానికి వాటి దగ్గర ఏడు రోజులకు సరిపోయే బొగ్గు మాత్రమే స్టాకులో ఉంది. ఆనాడు అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ ప్రభుత్వానికి పరిస్థితులు కలసి వచ్చాయి. విద్యుత్ రంగంలో కొత్త పెట్టుబడులు భారీగా వచ్చాయి. గత సంవత్సరం 22,566 మెగావాట్ల సామర్థ్యాన్ని పెంచుకున్నారు. పీక్ అవర్స్‌లో కొరత 2008-09లో 11.9 శాతం ఉంటే దాన్ని 2.3 శాతానికి తగ్గించగలిగామని ప్రభుత్వం ఇటీవలే ప్రకటించుకుంది. కేంద్ర ప్రభుత్వ సంస్థ సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ (సీఈఏ) 2017-18 వార్షిక లెక్కల ప్రకారం దేశంలోని వివిధ రాష్ట్రాల్లో విద్యుత్ సరఫరా పరిస్థితి ఆశాజనకంగా ఉందని వెల్లడించింది. 2017-18 నాటికి దేశంలో అవసరమైన విద్యుత్ 1229661 మిలియన్ యూనిట్లు కాగా, లభ్యత 1337828 మిలియన్ యూనిట్లుగా ఉంది. దీంతో 108167 మిలియన్ యూనిట్లు అంటే అవసరమైన విద్యుత్ కన్నా లభ్యత ఎక్కువగా ఉందనేది సీఈఏ లెక్కలు స్పష్టం చేశాయి.
కానీ ఇదంతా మాటల్లోనే.. రికార్డుల్లోనే కనిపిస్తోంది. ఇప్పుడు కొరత అసాధారణంగా కనిపిస్తోంది. భారతదేశం గరిష్ట విద్యుత్ డిమాండ్ శుక్రవారం అన్ని రికార్డులను బద్దలు కొట్టి 207 గిగా వాట్లకి చేరుకుంది. కానీ ఉత్పత్తి బాగా పడిపోయింది.
సమస్య బొగ్గు లేకపోవడమా ? కేంద్రం సంస్కరణలా?
కరెంట్ సమస్యలకు ప్రభుత్వాల నుంచి ఎక్కువగా వస్తున్న సమాధానం బొగ్గు కొరత. కానీ అసలు సమస్య బొగ్గు కొరత కాదని నిధుల సమస్య . కాస్త ప్రణాళికతో వ్యవహరించి ఉంటే.. విద్యుత్ కొరత ఉండేది కాదు. దేశంలోని అనేక రాష్ట్రంలోని విద్యుత్ పంపిణీ సంస్థలు అంటే డిస్కంలు తీవ్రమైన రుణ భారంతో ఉన్నాయి. ఇవన్నీ చెల్లింపుల సమస్యను ఎదుర్కొంటున్నాయి. బొగ్గు ఉత్పత్తి చేస్తున్న ప్రభుత్వ రంగ కోల్ ఇండియాకు… విద్యుత్ ఉత్పత్తి కంపెనీలకు రూ.12,300 కోట్లు బకాయిలు ఉన్నాయి. అయినా కోల్ ఇండియా విద్యుత్ ఉత్పత్తి కంపెనీలకు బొగ్గును అందిస్తోంది.కానీ చెల్లింపులు తక్కువగా ఉండటం కోల్ ఇండియా పనితీరుపై ప్రభావం చూపిస్తోంది. అనుకున్న విధంగా ఉత్పత్తి పెంచలేకపోతోంది. మరో వైపు జెన్కోలు విద్యుత్ ఉత్పత్తి చేసి… వాటిని విద్యుత్ పంపిణీ సంస్థలకు ఇస్తాయి. డిస్కంలు విద్యుత్ ఉత్పత్తి సంస్థలకు చెల్లింపులు చేయాలి. ఇలా విద్యుత్ పంపిణీ సంస్థలకు డిస్కంలు రూ.1.1 లక్షల కోట్ల బకాయిలు ఉన్నాయని కేంద్ర ప్రభుత్వ రికార్డులు చెబుతున్నాయి. ఇంత భారీ మొత్తం చెల్లించనప్పటికీ అదే కంపెనీలకు విద్యుత్‌ను విక్రయించాల్సి వస్తోంది. పైగా ఇవి చాలా కాలంగా నష్టాల్లో ఉన్నాయి. విద్యుత్ పంపిణీ సంస్థల నష్టం రూ.5 లక్షల కోట్లకు పైగా పెరిగింది. పలు రాష్ట్రాల ప్రభుత్వాలు ఉచిత విద్యుత్‌ను అందజేస్తున్నాయి. ఆ విద్యుత్ సబ్సిడీని కంపెనీలకు ప్రభుత్వాలు చెల్లించడం లేదు. ఇది కంపెనీల పనితీరుపై ప్రభావం చూపుతోంది. చెల్లింపుల సంక్షోభం మొత్తం సరఫరా చెయిన్‌పై ప్రభావం చూపుతోంది. బొగ్గు సంక్షోభం లేదా విద్యుత్ సంక్షోభం విద్యుత్ కోతలకు కారణం కాదు. చెల్లింపు సంక్షోభమే దీనికి అసలు కారణమని దీని ద్వారా నిపుణులు విశ్లేషిస్తున్నారు.ప్రస్తుతం విద్యుత్ డిమాండ్ గరిష్ట స్థాయి 201 గిగావాట్లకు చేరుకుంది. విద్యుత్ డిమాండ్ గతంలో ఎన్నడూ ఈ స్థాయికి చేరుకోలేదు. మే-జూన్‌లో ఇది 215-220 గిగావాట్లకు పెరుగుతుందని మంత్రిత్వ శాఖ అంచనా వేసింది. కానీ దానికి తగ్గ ఉత్పత్తి ప్రణాళిక కేంద్రం వద్ద కానీ.. రాష్ట్రం వద్ద కానీ లేనే లేవు.
గత అక్టోబర్‌లోనే నిపుణులు హెచ్చరికలు – పెడచెవిన పెట్టిన పాలకులు !
బొగ్గు నిల్వలు లేక చాలా రాష్ట్రాలు గత ఆరు నెలలుగా సతమతమవుతున్నాయి. అప్పట్లోనే వేసవికి సిద్ధం కాకపోతే.. పరిశ్రమల విద్యుత్ డిమాండ్‌ను సంపూర్ణంగా తట్టుకోగలిగే స్థితి ఉండదని.. గృహావసరాలు తీర్చగలిగే మంచి కాలం కూడా ముందుముందున ఉండబోదని అంచనా విద్యుత్ రంగ నిపుణులు అంచనా వేశారు. కాసిన్నినిల్వలూ కొద్దిరోజుల్లోనే హరించుకుపోతాయని, సరఫరాతో ఆదుకోవాలని చాలా రాష్ట్రాలు కేంద్రానికి లేఖలు రాశాయి. కానీ మేలుకున్న పాపాన పోలేదు. విద్యుదుత్పత్తికి అవసరమైనంత బొగ్గు దొరకని స్థితి వల్ల సుదీర్ఘకాల విద్యుత్ కోతలు ఇకపై నిత్యకృత్యం కావచ్చు. ఆర్థికరంగంలో చురుకుదనం, కరోనా పూర్వపు విద్యుత్ డిమాండ్లను రాష్ట్రాలు అంచనావేయలేకపోవడంతో నిల్వ నిర్వహణలో అవి దెబ్బతిన్నాయి. , విదేశీబొగ్గుమీద ఆధారపడిన విద్యుత్‌ప్లాంట్లు అంతర్జాతీయంగా బొగ్గు ధరలు యాభైశాతం పెరగడంతో ఒక్కసారిగా కేంద్రం మీద పడ్డాయి. ప్రస్తుత విద్యుత్సంక్షోభం బొగ్గుకొరతకు మాత్రమే పరిమితం కాదు. మొత్తం విద్యుత్ రంగమే కుప్పకూలే స్థితికి చేరుతోంది. డిస్కమ్‌లు జెన్కోలకు లక్షకోట్లకుపైగా బకాయీపడినందువల్ల జెన్కోలు కోల్ ఇండియాను భారీ బకాయీతో ముంచేశాయని అంటున్నారు. కోల్ ఇండియా వద్ద సరిపడా నిల్వలు లేవన్న రాష్ట్రాల ఆరోపణ, ఉన్నాయన్న కేంద్రం సమర్థింపునూ అటుంచితే, ఈ సంక్షోభానికి రాష్ట్రాలే కారణమని కేంద్ర ప్రభుత్వ అధికారులు అంటున్నారు.
సవాళ్లను అంచనా వేయకుండా సంస్కరణలు అమలు చేస్తున్నకేంద్రం !
సంస్కరణలు ఎప్పుడూ పురోగామిగా ఉండాలి. సంస్కరణలు ఉండేది అందుకే. కానీ ఓ వ్యవస్థను మారుస్తున్నప్పుడు..దుష్ఫలితాలు కూడా ఎక్కువగా వస్తాయి. అలాంటి వాటిని అంచనావేసి సంస్కరణలు అమలు చేయడం తెలివైన పాలకులు చేసే పని. కానీ దేశంలో ఏం జరిగింది..? గుడ్డిగా సంస్కరణలు అమలు చేసేందుకు కేంద్రం ప్రయత్నించింది. ఇష్టారాజ్యంగా వాటిని రాష్ట్ర ప్రభుత్వాలపై రుద్దింది. ముందూ వెనుకా చూసుకోకుండా.. తమ ఆర్థిక పరిస్థితులు అంచనా వేయకుండా .. ఎంతోకొంత అప్పు పుడుతుందన్న ఉద్దేశంతో కొన్ని రాష్ట్రాలు సంస్కరణలు అమలు చేస్తున్నాయి. రాష్ట్రాలు ఏ గతి పోతేనేమీ… విద్యుత్ వ్యవస్థను తాము సంస్కరిస్తున్నామని.. ఆ భారం దించేసుకుంటున్నామని కేంద్రం అనుకుంది. కానీ సైడ్ ఎఫెక్ట్స్ చాలాఎక్కువగా ఉంటున్నాయని తాజా విద్యుత్ కోతలతోనే తేలిపోతోంది. ఇప్పుడు అంతా చేసింది కేంద్రమే..భరిస్తోంది మాత్రం రాష్ట్రాలు. తప్పు ఎవరు చేశారన్నదాన్ని ఇక్కడ చర్చించలేం.. కానీ భరిస్తోంది మాత్రం ప్రజలని నిర్ణయించుకోవాలి.
రాష్ట్రాల బాధ్యతారాహిత్య నిర్ణయాలు
ముందుగా చెప్పుకున్నట్లుగా అధికారం అనుభవించేవారికి.. పరిపాలన చేసే వారిక చాలా తేడా ఉంటుంది. పరిపాలన చేయాలనుకున్న వారు భవిష్యత్ పరిణామాల గురించి ఆలోచిస్తారు. ఎందుకంటే తన ప్రభుత్వం తాత్కాలికం.. రాష్ట్రం శాశ్వతం అనే సంగతి గుర్తుంచుకుంటారు. దురదృష్టశాత్తు అలాంటి పాలకులు లేరు. ఏపీనే ఉదాహరణగా తీసుకుంటే గత ప్రభుత్వం చేసుకుందన్న కారణంగా పీపీఏలను రద్దు చేశారు. కరెంట్ తీసుకోవడం మానేశారు. బహిరంగ మార్కెట్లో కొన్నారు. చివరికి ఆ పీపీఏలను చట్ట ప్రకారం రద్దు చేయడం సాధ్యం కాలేదు. కానీ బిల్లులు కట్టాల్సి ఉంటుంది. ఇప్పుడు బిల్లులు కట్టాలి.. కరెంట్ కూడా తీసుకోలేని పరిస్థితి. కరెంట్ డిమాండ్ లేనప్పుడు మిగులు విద్యుత్ ఉన్నప్పుడు అంతాబాగానే ఉంది.. కానీ ఇప్పుడేమవుతోంది…? మొత్తానికే మోసం వచ్చింది. ఇప్పుడు పీపీఏలకు రూ. ఇరవై వేల కోట్లు కట్టాల్సి ఉంటుంది. కానీ డబ్బుల్లేవని చేతులెత్తేసే పరిస్థితి. అలా అనాలోచిత పాలకులు దేశం మొత్తం ఉన్నారు. కేంద్రంలనూ ఉన్నారు అలాంటి వారి వల్లే ఈ దుస్థితి.
ఓ పది, ఇరవై ఏళ్ల కింద కరెంట్ కోతలున్నాయంటే వేరు…ఇప్పుడు అలాంటి కోతలున్నాయంటే వేరు. కరెంట్ లేకపోతే రోజువారీ జీవన ప్రమాణాలే మారిపోతాయి. అంతకీలకంగా రోజువారీ జీవితంలో కరెంట్ మారింది. అందుకే ప్రభుత్వాలు ఇకరైనా అధికారం కోసం రాజకీయం మానేసి అచ్చమైన పాలన చేయాలి. ప్రజలను ఎలాగోలా భావోద్వేగానికి గురి చేసి ఓట్లు సంపాదిచుంకుంటామనే ధీమానుపక్కన పెట్టి.. వారి పట్ల కనీస బాధ్యత ఉంటుందనే సంగతిని గుర్తించాలి. లేకపోతే ప్రజలు మాత్రమే కష్టాలకు గురి కాదు.. దేశానికి నష్టం జరుగుతుంది. అది భావితరాలపై ప్రభావం చూపుతుంది. ఓట్లేసిన ప్రజలకు చుక్కలు చూపించడం భావ్యం కూడా కాదు. కానీ అధికారంలో ఉన్న వారు మారతారా ? అది సాధ్యమేనా?