“అయ్యో! తోటకూర నాడే ఇది తప్పని చెప్పలేక పొయానే! చెప్పినట్లయితే నా కొడుకు ఇలా అయ్యే వాడు కాదు కదా ” అని ఓ తల్లి ఏడుస్తూ ఉంటుంది. ఎందుకంటే ఆమె కొడుకు దొంగగా మారి పోలీసుల చేతికి చిక్కి జైలుకెళ్లాడు. తప్పు ఆ కొడుకుది కాదు తనదేనని ఆమె రియలైజ్ అయింది. ఎలా అంటే .. చిన్నప్పుడు ఆ కొడుకు పక్కింటి నుంచి తోట కూర దొంగిలించి తీసుకు వచ్చి ఇస్తే పొగిడింది. ఆ దొంగ పనే మంచిపనిగా ఆమె పొగిడే సరి ఇక దొంగతనాలే అలవాటు చేసుకున్నాడు. చివరికి గజదొంగగా మారి జైలుకెళ్లాడు. కొడు దారి తప్పి జైలుకెళ్లిన తర్వాత కానీ అసలు విషయం ఆ తల్లికి అర్థం కాలేదు. అప్పుడు అర్థం అయినా చేయగలిగేదేమీ ఉండదు. ఎందుకంటే అప్పటికే చేయిదాటి పోయి ఉంటుంది. ఇది నీతి కథే కావొచ్చు. కానీ మన జీవితాలకు వర్తిస్తుంది. మనల్ని పాలించే ప్రభుత్వాలకూ వర్తిస్తుంది. అసలేం చేస్తున్నాం..? ఎలా చేస్తున్నాం…? ఎందుకు చేస్తున్నాం..? అని ఒక్క సారి వెనక్కి తిరిగి చూసుకుంటే అంతా బోధపడుతుంది.
సీక్రెట్ జీవోలపై నాడేం చెప్పారు ? నేడేం చెస్తున్నారు..?
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అంశాన్నే తీసుకుంది. నిన్నటికి నిన్న అసలు ప్రభుత్వ జీవోలేమీ ప్రజలకు అందుబాటులో ఉంచకూడదని నిర్ణయం తీసుకుంది. ఆ జీవోలు వివాదాస్పమవుతాయో.. కనిపిస్తే కోర్టు కొట్టి వేస్తుందో అన్నది తరువాత సంగతి. కానీ ఈ జీవోల గురించి గతంలో ఏం చెప్పామో ఈ నిర్ణయాలు తీసుకున్న వారికి కనీసం గుర్తు ఉండదా..?. ముఖ్యమంత్రి అయిన కొత్తలో సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రజా వేదికలో కూర్చుని పారదర్శకత పాలనలో దేశం మొత్తం మన వైపు చూసేలా పరిపాలించాలని అధికారులకు హితబోధ చేశారు. ఇప్పుడు ప్రభుత్వ నిర్ణయాలేమీ తెలియకుండా ఆయనే నిర్ణయం తీసుకున్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం కాన్ఫిడెన్షియల్ జీవోలు జారీ చేస్తోందని తీవ్రమైన విమర్శలు చేసేవారు. ప్రజాధనాన్ని దోపిడీ చేయడానికి కాన్ఫిడెన్షియల్ జీవోల మార్గం ఎంచుకున్నారని ఆరోపించేవారు. ఇప్పుడు అసలు కాన్ఫిడెన్షియల్.. బ్లాంక్ జీవోల రేంజ్ నుంచి ఏకంగా మొత్తం వ్యవస్థనే కప్పెట్టి ఉంచాలనే నిర్ణయం తీసుకున్నారు. మరి అప్పుడు చెప్పిన నీతులు.. చేసిన విమర్శలేం గుర్తుకు రావాలా..? వెనక్కి తిరిగి చూసుకునే అలవాటు లేదా..?
పార్టీ ఫిరాయింపులపై నాడేం చెప్పారు..? నేడేం చేస్తున్నారు ?
ఒక్క జీవోల వ్యవహారమే అడ్డం తిరిగారు.. మిగతావన్నీ పక్కాగా చేస్తున్నారని సంతృప్తి పడదామా అంటే.. గత ప్రభుత్వంలో ఏవైతే తప్పులు అని నిందించారో అవే మరింత ఉత్సాహంగా చేయడం మన కళ్ల ముందు ఉంటూనే ఉంది. ఒకటా.. రెండా.. గత ప్రభుత్వంలో తాము ఏ అంశంపై పోరాటాలు చేశారో అవన్నీ చేసేస్తున్నారు. ఇంత కూడా వెరపు ఉండటం లేదు. ఎమ్మెల్యేల్ని పార్టీలో చేర్చుకున్నారని .. తాము అలాంటి పని చేయబోమన్నారు కానీ.. కక్కుర్తి పడ్డారు. నలుగుర్ని చేర్చుకుని పార్టీ కార్యక్రమాల్లో భాగం చేసి.. ఇంకా కండువా కప్పలేదనే ఆత్మవంచన ఒకటి. అది ఆరంభమే ప్రభుత్వ నిర్ణయాల్లో తెలుగుదేశం పార్టీ మీద ఆరోపణలు చేసి … ఆందోళనలు చేసి.. పోరాటాలు చేసి.. కోర్టులకెళ్లి పోరాడిన అంశాల్లో కూడా వాటినే కొనసాగించాలనుకోవడం.. కొనసాగించడానికి వెనుకాడకపోవడం చూస్తే ఫాలో అయ్యే వారికే “హవ్వ” అనిపిస్తుంది. విద్యుత్ పీపీఏలు టీడీపీ హయాంలో పాతికేళ్లు అంటేనే పెద్ద స్కాం అన్న వైసీపీ నేతలు.. ఇప్పుడు వైసీపీ సర్కార్ 30ఏళ్లకు ఒప్పందం చేసుకుంది. బోగాపురం ఎయిర్ పోర్టు జీఎంఆర్‌కి ఇస్తే పెద్ద స్కాం అని రద్దు చేసి.. కాకినాడ సెజ్ తీసుకుని మళ్లీ వారికే కాంట్రాక్ట్ ఇవ్వడానికి అసలు మొహమాటమే పడలేదు. ఇలా చెప్పుకుంటూ పోతే పదుల సంఖ్యలో టీడీపీ హయాంలోనే నిర్ణయాలను రద్దు చేసి.. మళ్లీ కొనసాగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. తెర వెనుక ఏం జరిగిందో కానీ తెర ముందు మాత్రం… ” నాడు – నేడు ” కనిపిస్తూనే ఉంది. ప్రజలు ఔరా అని అబ్బురపడుతూనే ఉన్నారు.
నాడు టీడీపీ బినామీలు – నేడు వైసీపీ పదవుల పెద్దలా..?
రెండున్నరేళ్ల కాలంలో ఇలాంటి చిత్రాలు.. విచిత్రాలు రాసుకుంటే పుస్తకం అవుతుంది. అబ్బురపడేవి కొన్ని ఉంటాయి. అలాంటి వాటిలో రిలయన్స్‌కు పిలిచి పీట వేయడం… శేఖర్ రెడ్డికి టీటీడీ బోర్డు సభ్యునిగా పదవి ఇవ్వడం వంటివి ఖచ్చితంగా ఉంటాయి. తన తండ్రి చావుకు కారణం ఇంకా చెప్పాలంటే ఆయనను హత్య చేసింది రిలయన్సేనని గట్టిగా వాదించిన వ్యక్తి జగన్మోహహన్ రెడ్డి. అంతే కాదు ఆయన మీడియా అలాంటి ప్రచారం చేసిన రోజున రిలయన్స్ దుకాణాలపై వ్యవస్థీకృతంగా దాడులు కూడా జరిగాయి. అలాంటిది ఇప్పుడు ఆ రిలయన్స్ ఇంటి మనిషికి తీసుకొచ్చి రాజ్యసభ పదవి ఇచ్చారు. ఆయన పదవి తీసుకుని మరోసారి ఏపీ వైపు చూడలేదు. గుర్తొచ్చినప్పుడల్లా…ఓ పొగడ్తల ట్వీట్ పడేసి రుణం తీర్చుకుంటున్నారు. అప్పట్లో అన్న మాటలేంది… ఇప్పుడు చేస్తున్న చర్యలేంది అని సొంత పార్టీ కార్యకర్తలే అబ్బురపడ్డారు. అలాంటిదే… టీటీడీ బోర్జు సభ్యుడిగా శేఖర్ రెడ్డి నియాకమం. టీడీపీ హయాంలో ఆయన ఇంట్లో నోట్ల కట్టలు దొరికాయని చంద్రబాబు, లోకేష్ బినామీలని ఆరోపించిన నోటితోనే ఆయనకు పదవి ఇచ్చేశారు. ఇక కాంట్రాక్టర్లను అందర్నీ టీడీపీకి అంటగట్టి ఇప్పుడు వారితోనే వ్యవహారాలు చక్కబెట్టడం రాజకీయ చాకచక్యం అని అనిపించుకుంటుందేమో కానీ.. ” నాడు -నేడు” అని ప్రజలు చూసుకుంటేనే మొదటికే మోసం వస్తుంది.
ప్రజలు మర్చిపోకుండా నాడు – నేడు గుర్తు చేసేలా పాలన..!
ప్రజలకు జ్ఞాపకశక్తి చాలా తక్కువ. ఈ రోజూ భూకంపం వచ్చినా నెల రోజుల తర్వాత మర్చిపోతారనేది రాజకీయ నేతల అభిప్రాయం. ముఖ్యంగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన నేరుగానే ఈ మాట చెప్పేవారు. ప్రజలకు గుర్తుండదని. అలా గుర్తు ఉండకుండా చేయడానికి ఆయన చేయాల్సిన పనులు చేసేవారని కాంగ్రెస్ నేతలు ఇప్పటికీ చెప్పుకుంటారు. నిజానికి మరుపు అనేది మనిషికి గొప్ప వరం అంటారు. అలా మర్చిపోయాలే చేయడం కూడా ఓ కళే. అయితే ప్రజలు తమంతటకు తాము అన్నీ మర్చిపోతారనుకుంటే అంత కంటే అమాయకత్వమేమీ ఉండదు. పాలకులే మర్చిపోయేలా చేయగలగాలి. కానీ ఎప్పటికప్పుడుగు వాటినే గుర్తు చేసేలా చేస్తే మాత్రం .. తేడా కొట్టేస్తుంది. ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం చేస్తోంది అదే. పదే పదే తమ వైఫల్యాలను ప్రజలకు గుర్తు చేస్తోంది. గతంలో తాము ఏమి చెప్పామో.. ఇప్పుడు దానికి రివర్స్‌లో చేస్తున్నామని గుర్తు చేస్తోంది. దానికి ప్రతిఫలం కూడా కనిపిస్తోంది.
నాడు బెస్ట్ సీఎం .. మరి నేడు..?
ఏడాది కింద జగన్మోహన్ రెడ్డికి చెందిన సాక్షి దినపత్రిక చాలా పెద్ద పెద్ద అక్షరాలతో ఫ్రంట్ పేజీలో బ్యానల్లో మన సీఎం నెంబర్ వన్ అని రాసుకుంది. ఇండియా టుడేచెప్పిందని చెప్పింది. అప్పుడు విపక్ష నేతలు అంతా ట్రాష్ అని విమర్శించారు. వారిపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు విరుచుకుపడ్డారు. ఇప్పుడు ఏడాది దాటిపోయింది. మళ్లీ అదే ఇండియా టుడే ఫలితాలు ప్రకటించారు. ఫస్ట్ పేజీలో కాదు కదా.. లాస్ట్ పేజీలో కూడా కవరేజీ ఇవ్వలేకపోయింది సాక్షి దినపత్రిక. ఎందుకంటే ఆయన అడ్రస్ లేరు. పట్టు మని వెయ్యి మంది అభిప్రాయాలు కూడా తీసుకోలేదు అది ఒక సర్వేనా అని తీసి పడేయవచ్చు. కానీ అదే అభిప్రాయం ఏడాది కిందట ఎందుకు లేదనే ప్రశ్న సహజంగానే వస్తుంది. బయటకు చెప్పుకోలేకపోయినా వస్తుంది. ఎందుకంటే అది మార్పు. నాడు – నేడు అని విశ్లేషించుకుంటే కనిపించే మార్పు. ఇది ఎందుకు వచ్చింది అని ఒక్క సారిగా వెనక్కి తిరిగి చూసుకుంటే సమస్య అర్థమవుతుంది. కానీ పాలకులకు అంత తీరిక ఓపిక.. ఇంకా చెప్పాలంటే నిజాన్ని అంగీకరించే ధైర్యం ఉందా అన్నదే డౌట్.
చదివే స్పీచ్‌లు మైండ్‌కి ఎక్కితే చాలు తత్వం బోధపడుతుంది..!
సీఎం జగన్మోహన్ రెడ్డి ఎక్కువగా స్పీచ్‌లు చూసి చదువుతూంటారు. అంటే ఎక్కువగా ఆయనకు స్పీచ్‌లు రాసి ఇస్తూ ఉంటారు. అలా రాసి ఇచ్చిన ఆయన మైండ్ ఉపయోగించే చదవాలి. ఆయనకు రాసే స్క్రిప్ట్‌లు అత్యున్నత ప్రమాణాలతో ఉంటాయి. అయన చదవడంతో అవి ఖూనీ కావొచ్చు కానీ చాలా వాటిలో మంచి సందేశాలు ఉంటాయి. మంచి మంచి కొటేషన్లు ఉంటాయి. వాటిని సీఎం జగన్ చాలా కాన్ఫిడెంట్‌గా చదువుతూ ఉంటారు. ఆయన చేస్తున్న పనులకు ఆ కొటేషన్లు పూర్తి విరుద్ధంగా ఉన్నప్పటికీ అలాంటి భావాలను ఆయన కనిపించనివ్వరు. అలాంటి కొటేషన్లలో చాలా వరకూ ఓ భావం గోచరిస్తూ ఉంటుంది.. అదేమిటంటే “అధికార అహంకారం తలకెక్కకూడదని నేల మీదే ఉండాలని.. మిత్రులు.. బంధువుల గురించి కాకుండా ప్రజల గురించే ఆలోచించాలనే ” సారాంశం ఉంటుంది. ఈ అంశాన్ని సీఎం జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైనా సమీక్షించుకున్నారో లేదో స్పష్టత లేదు. ఒక్కసారి తల ఎత్తి చూస్తే ఆయనకూ స్పష్టత వచ్చే అవకాశం ఉంది. కానీ అలా చూసే అవకాశం లేదని మనం అనుకోవడానికి ప్రత్యేకమైన కారణాలు అక్కర్లేదు.
తాను పడుకునే ముందు ప్రతీ రోజూ బైబిల్ చదువుతానని సీఎం జగన్ కొన్ని సందర్భాల్లో చెప్పారు. బైబిల్లో మంచి మంచి వాక్యాలు ఉంటాయి. అలాంటి వాటిలో ఒకటి ఇది
“నాశనమునకు ముందు గర్వము నడచును. పడిపోవుటకు ముందు అహంకారమైన మనస్సు నడచును గర్విష్ఠులతో దోపుడుసొమ్ము పంచుకొనుటకంటె దీనమనస్సు కలిగి దీనులతో పొత్తుచేయుట మేలు. ”
మనసులో కుల, మత, వర్ల ద్వేషాలను వదిలేసి ప్రశాంతంగా బైబిల్‌ను చదువుతూ .. తాను చేస్తున్న పనులేమిటో విశ్లేషించుకంటే… నాడు – నేడు పాలకుల కళ్ల ముందు స్పష్టంగా కనిపిస్తుంది. అప్పుడు అన్ని సమస్యలకూ పరిష్కారం లభిస్తుంది.