ఎడిటర్స్ కామెంట్ : ఏపీ నీడ్స్ వింటేజ్ చంద్రబాబు !

” ఒకే ఒక్కడు ” సినిమాలో హీరో ఒక్క రోజు సీఎం అయితే ఎంత డైనమిక్ గా పని చేస్తారో చూపించారు. ఈ సినిమా రిలీజ్ అయిన సంవత్సరం 1999. ఈ సినిమా చూసిన తర్వాత ప్రతి ఒక్కరూ గుర్తు చేసుకున్న లీడర్ చంద్రబాబు నాయుడు. అర్జున్ పాత్రలో అందరూ చంద్రబాబునే చూశారు. ఎందుకంటే ఆయన పనితీరును ఆదర్శంగా తీసుకునే హీరో క్యారెక్టర్‌కు రూపకల్పన చేశారు. 1995 సెప్టెంబర్ ఒకటో తేదీన ముఖ్యమంత్రిగా చంద్రబాబు మొదటి సారి ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తర్వాత ఆయన పాలన దేశం మొత్తం అబ్బురపడిపోయి చూసింది. అప్పట్లో సోషల్ మీడియా లేదు. ఎలక్ట్రానిక్ మీడియా లేదు. కానీ చంద్రబాబు ఏ పని చేసినా సంచలనంగా ప్రజల్లోకి వెళ్లేది. అంత విప్లవాత్మకంగా ఆయన పరిపాలన ఉండేది. ఒకే ఒక్కడు సినిమాలో ఒక్క రోజులో అర్జున్ ఏం చేశారో.. చంద్రబాబు ప్రతి రోజూ అంత కంటే ఎక్కువే చేసేవారు. ఆయన రెడీ అయి ఇంట్లో నుంచి బయటకు వచ్చారంటే ఉమ్మడి రాష్ట్రం మొత్తం అలర్ట్ అయిపోయేది. ఎక్కడ ఆకస్మిక తనిఖీలకు వెళ్తారో ఎవరికీ తెలియదు. హెలికాఫ్టర్ లో ఆ మూల నుంచి ఈ మూల వరకు విస్తృతంగా పర్యటించేవారు. అధికారుల్ని పరుగులు పెట్టించేవారు. అధికార యంత్రాంగం మొత్తం అలర్ట్ గా ఉండేది. ఏ చిన్న విషయమూ మిస్ అయ్యేది కాదు.

ప్రజల వద్దకు పాలన తీసుకెళ్లిన మొదటి సీఎంను చూసిన ప్రజలు

సీఎంగా చంద్రబాబు మొదటి విడత పరిపాలన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో సువర్ణాక్షరాలతో లిఖించవచ్చు. నేటి అభివృద్ధికి మొదటి అడుగులు అప్పుడే పడ్డాయి. ఓ యువకుడు.. చురుకైన.. విభిన్నమైన ఆలోచనలు.. సాంప్రదాయబద్దమైన పాలనను పక్కన పెట్టి.. సంస్కరణలతో ప్రజల జీవితాల్లో వెలుగులు తేవాలనుకున్న నేత ఏం చేయగలరో చంద్రబాబు చూపించారు. 1995కి ముందు హైదరాబాద్ ఉపాధి కి కేంద్రం కాదు. శివారు ప్రాంతాల్లో కొన్ని ప్యాక్టరీలు ఉండేవి. అందులో కార్మికులుగా చేరాలనుకున్నవారే వలస వచ్చేవారు. కానీ వారి కంటే టూరిజానికే ఎక్కువ ప్రసిద్ధి చెందింది. చార్మినార్ తో పాటు చివరికి లుంబిని పార్క్ కూడా ఓ టూరిజం ఎట్రాక్షన్. అలాంటి సిటీ రూపురేఖల్ని చంద్రబాబు తన విజన్ తో మార్చేశారు. ఉపాధి కేంద్రంగా మారాలంటే.. అప్పుడప్పుడే పురుడుపోసుకుంటున్న సాఫ్ట్ వేర్ ఇండస్ట్రీని నగరానికి ఆకర్షించాలని రంగంలోకి దిగారు. కేంద్రంలో చక్రం తిప్పే అవకాశం కూడా అప్పుడే రావడంతో ఆయనకు ఎదురు లేకుండా పోయింది. హైటెక్ సిటీకి పునాదులు పడిన తర్వాత తిరుగులేకుండా పోయింది. హైదరాబాద్ సంప్రదాయ నగరాన్ని మించి సైబరాబాద్ పురుడు పోసుకుంది. ఇప్పుడు అసలు హైదరాబాద్ కన్నా సైబరాబాద్‌నే ఎక్కువగా గుర్తు చేసుకుంటున్నారంటే అతిశయోక్తి కాదు. ఐటీ సంస్థల ఏర్పాటుకు వీలుగా ఇక్కడ మౌలికవసతులు, వనరులను అభివృద్ధి చేయడంతో బాబు హయాంలో హైదరాబాద్ బాగా అభివృద్ధి చెందింది. ఫ్లై ఓవర్ల నిర్మాణం, అఫ్రో ఆసియాన్ గేమ్స్ నిర్వహణ ప్రపంచం దృష్టిని ఆకర్షించాయి. అప్పటి అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్‌ను హైదరాబాద్‌కు తీసుకురావడం.. ఐటీకి పరిశ్రమలకు కావాల్సిన ప్రోత్సాహకాలు కల్పించడంతో హైదరాబాద్ ఐటీ సిటీగా మారిపోయింది.

ముందుచూపుతో తీసుకున్న నిర్ణయాలు – చేసిన పనులే నేడు అభివృద్ధి వృక్షాలు

పాలనా సంస్కరణలతో అన్ని రంగాలను గాడిన పెట్టారు. అప్పట్లో విద్యుత్ సమస్య ఎక్కువగా ఉండేది. విద్యుత్ సంస్కరణలు అమలు చేసి.. విద్యుత్ కొరత లేకుండా చేశారు. రాజకీయంగా నష్టాలు వస్తాయని తెలిసినా ఆయన ప్రజోపయోగ కార్యక్రమాలు.. భవిష్యత్ కు ఉపయోగపడతాయనుకున్న కార్యక్రమాలపై ఎప్పుడూ వెనుకడుగు వేయలేదు. అనుకున్నది అనుకున్నట్లుగా చేశారు. పాలనలో ప్రజలను భాగస్వామ్యం చేయడంలో చంద్రబాబు తనదైన మార్కును చూపించారు. చివరికి స్కూలు పిల్లలకు కూడా శ్రమ విలువ తెలియచెప్పే ప్రయత్నం చేశారు. ఆయన చేపట్టిన కార్యక్రమాల్లో ప్రజల వద్దకు పాలన ఓ మైల్ స్టోన్. నేరుగా ప్రజల వద్దకు వెళ్లేవారు. వారానికో రోజు ప్రత్యేకంగా కార్యక్రమం పెట్టుకుని వెళ్లి గ్రామాల ప్రజలతో సమావేశమై సమస్యలు పరిష్కరించేవారు. శ్రమదానం ఆయన గొప్ప ఆలోచనల్లో ఒకటి. రాష్ట్రాన్ని బాగు చేసుకోవాలంటే.. అందరి శ్రమ అవసరం అని ఈ కార్యక్రమం చేపట్టారు. ఇందులో స్కూల్ పిల్లల్ని కూడా భాగస్వామ్యం చేశారు. తమ స్కూళ్లను శుభ్రంగా ఉంచుకునే లా వారంలో ఒక రోజు శ్రమదానం కార్యక్రమం చేపట్టేవారు. గంట సేపు విద్యార్థులంతా శ్రమిస్తే స్కూలంతా సుందరంగా తయారయ్యేది. తలా ఓ చేయి వేస్తే. సమాజం ఎంత అందంగా మారుతుందో.. శ్రమదానం చూపించింది. శ్రమకు ఉండేవిలువను ప్రజలకు చూపించింది. ఇప్పుడు ఊరూరా ఉన్న రైతు బజార్లు చంద్రబాబు ఆలోచనే. రైతులు, వినియోగదారుడికి మధ్య దళారులు ఉండకూడదన్న ఉద్దేశంతో రైతు బజార్ల వ్యవస్థను పెట్టారు. రైతుల కోసం ప్రత్యేక బస్సులు పెట్టారు. చంద్రబాబు సీఎంగా ఉన్నంత కాలం ఈ వ్యవస్థ అద్భుతంగా పని చేసింది. తర్వాత వచ్చిన ప్రభుత్వాల కారణంగా రైతు బజార్లలోనూ వ్యాపారులు తిష్టవేశారు. ఇప్పుడు రైతుల కోసం గ్రామాల నుంచి ప్రత్యేక బస్సులు కూడా లేవు. ఇక ఏ రాష్ట్రమైనా అభివృద్ధి చెందాలంటే మౌలిక సదుపాయాలు ఉండాలి. అంటే రోడ్లు, విద్యుత్ వంటివి. వీటిని అభివృద్ధి చేయడంపై చంద్రబాబు ప్రత్యేక దృష్టి పెట్టేవారు. రాష్ట్రంలో రోడ్లన్నీ శరవేగంగా నిర్మాణం అయ్యేవి. కరెంట్ సమస్యలు లేకుండా చూసుకునేవారు. ఓ రకంగా చంద్రబాబును ముఖ్యమంత్రి అని కాకుండా సీఈవో అని పిలిచే వారు. ఏపీ సీఈవో చంద్రబాబు అనేవారు.

చంద్రబాబు పనితీరుతో విప్లవాత్మక మార్పులు – ఇప్పటికీ గుర్తు చేసుకునే ప్రముఖులు

1995లో సీఎం అయిన తర్వాత నాలుగేళ్లలో ఆయన పని తీరు ప్రజలను ఆకట్టుకుంది. ఇప్పటి వరకూ ఏ రాజకీయ నాయకుడు కూడా ఆ స్థాయిలో పని చేయలేదు. అందుకే 1999 ఎన్నికల్లో చంద్రబాబు అభివృద్ధి ప్రాతిపదికగా ఎన్నికలకు వెళ్లారు. దేశంలో ఎక్కడ ఎన్నిక జరిగినా కులం, మతం కేంద్రంగా ఓటింగ్ జరిగేది. కానీ చంద్రబాబు రెండో సారి సీఎం అయిన 1999లో మాత్రం పూర్తి స్థాయిలో అభివృద్ధి అజెండాతో ఎన్నికలు జరిగాయి. అలాగని ఆయన సంక్షేమాన్ని విస్మరించలేదు. దీపం పథకం పెట్టి మహిళలందరికీ గ్యాస్ సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చారు.అందుకే ప్రజలు రెండో సారి పట్టం కట్టారు. నిజానికి చంద్రబాబు మొదటి నాలుగేళ్ల సమయంలో చేసిన అద్భుతాల గురించి చెప్పుకోవాలంటే..ఇంకా ఎన్నో ఉంటాయి. ఆ గవర్నన్స్.. ఆ విజన్.. ఆనాడు ఆయనను చూసిన వారంతా ఇప్పటికీ గుర్తు చేసుకుంటారు. చంద్రబాబు మొదటి సారి సీఎం అయి దాదాపుగా మూడు దశాబ్దాలు అవుతోంది. కొత్త తరానికి చంద్రబాబు పనితీరు గురించి పెద్దగా తెలియదు. కానీ ఆయనతో పాటు పరుగులు పెట్టిన అధికారులు, జర్నలిస్టులు అందరికీ తెలుసు. దేశంలో ప్రముఖ జర్నలిస్టు రిపబ్లిక్ టీవీ ఆర్నాబ్ గోస్వామి చంద్రబాబు గురించి ప్రస్తావన వచ్చినప్పుడల్లా ఆయన విజన్.. పాలనా తీరును పొగడకుండా ఉండలేరు. ఎంతో మంది చంద్రబాబు పాలనా తీరుకు.. విజన్‌కు ఫ్యాన్స్ ఉన్నారు. రాజకీయ కారణాల వల్ల కొంత మంది వ్యతిరేకించవచ్చు కానీ.. ఆయన పని తీరు మాత్రం అనన్య సామాన్యమని మనసులో అయినా కీర్తిస్తూంటారు.. సందర్భం వచ్చినప్పడల్లా చెబుతూంటారు.

నాడులా నేడు పని చేస్తానని చంద్రబాబు హామీ- ఇప్పుడు ఏపీకి అదే అవసరం

ఇప్పుడు కూడా తాను ఆ నాటి వింటేజ్ చంద్రబాబులా పని చేస్తానని అంటున్నారు. అప్పటి చంద్రబాబు పని తీరు గురించి తెలిసిన వారు కూడా ఇదే కోరుకుంటున్నారు. ఉద్యోగులు కోరుకోకపోవచ్చు. కానీ రాష్ట్రం కోసం పని చేసి ఫలితాలు సాధించాలనుకున్నప్రతి ఒక్కరూ చంద్రబాబు నుంచి ఆ వేగం కోరుకుంటారు. ఆయనతో పాటు కలిసి పరుగెత్తడానికి రెడీగా ఉంటారు. ఇప్పుడు చంద్రబాబు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రి కాదు. విభజన ఆంధ్రప్రదేశ్ కు .. అదీ కూడా జగన్ వంటి ఓ విధ్వంస ప్రళయం రాష్ట్రాన్ని దాటిపోయిన తర్వాత సీఎం అయ్యారు. ఇప్పుడు ఆయనకు సైబరాబాద్ ను మంచిన అమరావతిని అభివృద్ధి చేయాల్సి ఉంది. గాడి తప్పిన వ్యవస్థల్ని దారిలో పెట్టుకోవాల్సి ఉంది. అన్నింటికి మించి ఎన్నికల హామీల్ని అమలు చేస్తూనే.. ఇవన్నీ చేయాల్సి ఉంది. మామూలగా చాలా ప్రభుత్వాలు ప్రజల నుంచి పన్నులు తీసుకుని.. అప్పులు చేసి.. బండి నడిపించేస్తాయి. కానీ చంద్రబాబుకు ఇప్పుడు ఆ అవకాశం లేదు. ప్రజల నుంచి వసూలు చేసే పన్నులు.. అప్పులు కూడా భవిష్యత్ లో చేయాల్సినవి కూడా గత ఐదేళ్లలోనే జగన్ ఖర్చు పెట్టిపోయారు. ఇప్పుడు చంద్రబాబు చేయాల్సింది .. సంపద సృష్టించి.. దాన్ని ప్రజలకు పంచుతూ.. ప్రజల ఆదాయాన్ని కూడా పెంచడం. ఆయన పై ప్రజలకు ఉన్న నమ్మకం మొదటి నెల రోజుల్లోనే స్పష్టమయింది. రాష్ట్ర వ్యాప్తంగా ఆస్తుల విలువలు పెరిగాయి. ఉపాధి అవకాశాలు ఊపందుకుంటున్నాయి. వ్యాపారాలు మళ్లీ కళకళలాడుతున్నాయి. చంద్రబాబు సీఎంగా చేపట్టిన రెండు వారాల వ్యవధిలోనే ముంబై టు విజయవాడ ఫ్లైట్ సర్వీసులు రోజుకు రెండు పెరిగాయంటే… వ్యాపారవేత్తల రాక ఎలా పెరుగుతుందో అర్థం చేసుకోవచ్చు. ఇదంతా చంద్రబాబు బ్రాండ్ మీద నడుస్తోంది. చంద్రబాబు 1995లో తన పనితీరుతో ఏర్పాటు చేసుకున్న బ్రాండే దీనికి కారణం.

చంద్రబాబు ఎంత సక్సెస్ అయితే రాష్ట్రానికి అంత మేలు

1995లో ఇంత టెక్నాలజీ లేదు. అప్పట్లో వీడియో కాన్ఫరెన్స్ సరికొత్తగా ఉండేది. అలాంటి టెక్నాలజీలు చంద్రబాబు విస్తృతంగా వాడేవారు. ఇప్పుడు ఆయన రియల్ టైమ్ గవర్నెన్స్ అనే వ్యవస్థను పెట్టుకుని ఒక్క చోట కూర్చుని రాష్ట్రంలో ఎక్కడెక్కడ వీధి లైట్లు వెలగడం లేదో కూడా మానిటర్ చేసే వ్యవస్థను పెట్టుకున్నారు. ప్రతి ఉద్యోగి పనితీరును పరిశీలించే వ్యవస్థను పెట్టుకున్నారు. టెక్నాలజీని ఉపయోగించుకుని.. రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేయాలన్నదానిపై కసరత్తు చేస్తున్నారు. నాటి పనితీరును చంద్రబాబు నుంచి ప్రజలు ఆశిస్తున్నారు. అది ప్రభుత్వ ఉద్యోగులతో పని చేయించుకోవడం అయినా.. అమరావతిని అభివృద్ధి చేయడంలో అయినా.. ప్రజల ఆస్తుల విలువ పెంచడంలో అయినా.. మౌలిక సదుపాయాలు.. విద్య, ఉపాధి అవకాశాల పెంపుదలలో అయినా సరే.. ఇప్పుడు ప్రజలంతా వింటేజ్ చంద్రబాబును కోరుకుంటున్నారు. ఆయన కూడా తన తన కల్ట్ చూపించడానికి రెడీ అయ్యానని అంటున్నారు. ఈ విషయంలో చంద్రబాబు ఎంత సక్సెస్ అఇతే ఏపీ ప్రజలకు అంత మేలు జరుగుతుంది.

అందుకే వియ్ వాంట్ వింటేజ్ చంద్రబాబు బ్యాక్. సీఈవో చంద్రబాబు అవతారాన్ని మళ్లీ చూపించాలని అనుకుంటున్నారు. ప్రజలందరూ సహకరిస్తే మరో బెంచ్ మార్క్ సృష్టించాలని ఆయన కూడా రెడీగా ఉన్నారని వయసనేది అడ్డంకి కాదని ఇప్పటికే నిరూపించారు. అందుకే ఏపీ ఇక ఊపిరి పీల్చుకోవచ్చు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఊహాలోకంలో జగన్..ఎదురుదెబ్బలు తప్పవా?

తానొకటి తలిస్తే దైవమొకటి తలచినట్లుగా మారింది జగన్ రెడ్డి పరిస్థితి. ఓటమి నుంచి తేరుకొని మెల్లగా పొలిటికల్ ట్రాక్ ఎక్కబోతున్నామని సంబరపడుతున్న వైసీపీకి త్వరలోనే బిగ్ షాక్ తగిలేలా కనిపిస్తోంది. ఇప్పటికే...

‘భార‌తీయుడు పార్ట్ 3’ అవ‌స‌ర‌మా?

28 ఏళ్ల త‌ర‌వాత శంక‌ర్ భార‌తీయుడు చిత్రానికి సీక్వెల్ తీస్తాన‌ని చెప్ప‌డ‌మే ఓ ఆశ్చ‌ర్యం. ఇప్పుడు పార్ట్ 2 మాత్ర‌మే కాద‌ని, పార్ట్ 3 కూడా ఉంటుంద‌ని మ‌రో షాక్ ఇచ్చాడు. పార్ట్...

ఆస్కార్ మించిపోయే అవార్డులు మ‌న‌మే ఇద్దాం: క‌మ‌ల్‌హాస‌న్

ఆస్కార్ నిజంగానే ప్ర‌పంచంలోని అత్యుత్త‌మ న‌టుల‌కే ఇస్తుంద‌నుకొంటే ఆ అవార్డ్ క‌నీసం 10 సార్లు అందుకోగ‌ల సామ‌ర్థ్యం ఉన్న న‌టుడు క‌మ‌ల్ హాస‌న్‌. ఇందులో ఏమాత్రం సందేహం లేదు. కానీ ఆస్కార్ లెక్క‌లు,...

గేమ్ ఛేంజ‌ర్‌… శంక‌ర్ కు క్లారిటీ లేదా?

గేమ్ ఛేంజ‌ర్ ఎప్పుడు? ఇది మిలియ‌న్ డాల‌ర్ల ప్ర‌శ్న‌. రామ్ చ‌ర‌ణ్ అభిమానులు ఈ సినిమా గురించి ఎప్ప‌టి నుంచో ఎదురు చూస్తున్నారు. దిల్ రాజుని ఎప్పుడు రిలీజ్ డేట్ గురించి...

HOT NEWS

css.php
[X] Close
[X] Close