” సరైన సమయంలో సరైన నిర్ణయం ” ఈ మాట రాజకీయ పార్టీల నోటి నుంచి ఎక్కువగా వినిపిస్తూ ఉంటుంది. సరైన సమయం ఏదో.. సరైన నిర్ణయం ఏదో వారికి క్లారిటీ ఉండదు. అది సరైన నిర్ణయమే అనుకుని రంగంలోకి దిగారు. అనుకున్న ఫలితం వస్తే సరైన సమయంలోనే అడుగు ముందుకేశామనుకుంటారు… అనుకున్న ఫలితం రాకపోతే ఇక చెప్పాల్సిన పని లేదు. ఇప్పుడు దేశంలో ఉన్న రాజకీయ పార్టీలు ముఖ్యంగా అధికార పార్టీలు ఎప్పుడు ఎన్నికలకు వెళ్లిపోదామా అని ఆలోచిస్తున్నాయి కేంద్ర ప్రభుత్వం కూడా అదే ఆలోచనతో ఉంది. డిసెంబర్ లేదా జనవరి మొదటి వారంలో పోలింగ్ నిర్వహించి మరో టర్మ్ కొనసాగించుకోవాలని భావిస్తోంది. ఇలా ముందస్తుకు వెళ్లడానికి కేంద్రం పెట్టబోతున్న పేరు .. జమిలీ ఎన్నికలు. ప్రజాధనం ఆదా చేయడం. ఇందు కోసం పార్లమెంట్ ప్రత్యేక సమావేశానికి ఈ నెల మూడో వారంలో నిర్వహిస్తున్నారు. నిజంగా తీసుకోవాల్సిన నిర్ణయాలు ఉంటే… వర్షాకాల సమావేశాల్లో తీసుకుని ఉండేవారు. కనీ జీ 20 సమావేశాలు ఉన్నాయి. వాటిని కళ్లు చెదిరేలా నిర్వహించి విశ్వగురు మోదీ అనే ప్రచారం పీక్స్‌కు తెచ్చుకుని ఎన్నికల ప్రకటన చేయబోతున్నారు. కేంద్రం ఇలా ప్రకటన చేయగానే అలా ఎన్నికలను ప్రకటించడానికి ఎన్నికల సంఘం ఇప్పటికే రెడీ అయిపోయింది.
వాతలపై వెన్న పూస్తూ ప్రజల వద్దకు వస్తున్న బీజేపీ
కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు నిర్వహించడానికి సిద్ధమయింది. అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న జీ 20 సమావేశాలు ముగిసిన తర్వాత సెప్టెంబర్ 18 నుంచి 22వ తేదీ వరకూ పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. ఇప్పటికే దేశంలో ముందస్తు ఎన్నికలకు కేంద్రం ప్లాన్ చేసిందని చెబుతున్నారు. అవునన్నా కాదన్నా కేంద్రంలోని మోదీ ప్రభుత్వంపై పదేళ్ల వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తోంది. మీడియాను మేనేజ్ చేసి.. వీలైనంత తక్కువగా అసంతృప్తి చూపించుకున్నా.. వారు అనుకున్నంతగా ప్రచారం చేసుకుంటున్నంత సులువుగా పరిస్థితి లేదు. అందుకే విపక్ష పార్టీలకూ ప్రత్యేకమైన నమ్మకం ఏర్పడింది. కూటమిగా ఏర్పడుతున్నాయి. సాధారణంగా ప్రతిపక్ష పార్టీలకు అవకాశం ఇవ్వకుండా అనూహ్యంగా ఎత్తుగడలు వేసి .. ఎన్నికలకు వెళ్లిపోవాలనేది అన్ని అధికార రాజకీయ పార్టీలు ఉపయోగించే వ్యూహం. బీజేపీ కూడా అదే చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కేంద్ర ప్రభుత్వాన్ని వెంటాడుతున్నాయని, ఊహించిన దానికి భిన్నంగా అక్కడి తీర్పు రావడంతో ఆ ప్రభావం ఎక్కడి వరకు వెళ్తుందోనని బీజేపీలో టెన్షన్ మొదలైందని ప్రత్యేకంగా చెప్పాల్సినపని లేదు. అక్టోబర్‌లో ఐదు రాష్ట్రాల ఎన్నికలకు నోటిపికేషన్ ఇవ్వాల్సి ఉంది. ఛత్తీస్‌ఘడ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, మీజోరం, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలను నిర్వహించాల్సి ఉంది. లోక్‌సభ ఎన్నికలు షెడ్యూల్ ప్రకారం పార్లమెంట్ ఎన్నికలు ఏప్రిల్ 2024లో జరగాల్సి ఉన్నది. బీజేపీని ప్రక్షాళన చేయడం, కేంద్ర మంత్రి వర్గ విస్తరణను చేయనుండటం మాత్రమే ఎన్డీఏను కూడా బలోపేతం చేయడానికి ప్రధాని మోదీ ప్రయత్నిస్తున్నారు. కొత్త పార్టీలను చేర్చుకుంటున్నారు. తాజాగా ప్రజలకు తాయిలాలు ప్రకటిస్తున్నారు. గ్యాస్ సిలిండర్ ధరను రెండు వందలు తగ్గించారు. పెట్రోల్, డీజిల్ ధరలను కూడా తగ్గించే చాన్స్ కనిపిస్తోంది. అంటే మందస్తుకు మోదీ కూడా రెడీ అయ్యారని అర్థం చేుకోవచ్చు. డిసెండర్‌లో ఎన్నికలు జరగాల్సి ఉన్న న ఐదు రాష్ట్రాల్లో ఒక్క రాజస్థాన్ లో మాత్రమే బీజేపీ పరిస్థితి మెరుగ్గా ఉందన్న అభిప్రాయం వినిపిస్తోంది. ఈ రాష్ట్రాల్లో ఫలితాలు వచ్చిన తర్వాత మూడు నెలల వ్యవధిలో పార్లమెంట్ ఎన్నికలు జరగనున్నాయి. సార్వత్రిక ఎన్నికల తొలి విడత పోలింగ్ మార్చిమొదటి వారంలోనే ఉంటుంది. ఆయా రాష్ట్రాల్లో వ్యతిరేక ఫలితాలు వస్తే.. సార్వత్రిక ఎన్నికలపై ప్రభావం పడుతుందేమోనన్న ఆందోళన బీజేపీ వర్గాల్లో ఉంది. కర్ణాటక ఎన్నికల్లో వచ్చిన ఫలితాల తర్వాత మోదీ అజేయుడు కాదన్న అభిప్రాయాన్ని విపక్ష పార్టీలు విస్తృతంగా ప్రచారం చేస్తున్నాయి. ఏడాది చివరిలో జరగనున్న రాష్ట్రాల ఎన్నికల్లో ఓడిపోతే… మోదీ మానియా అనేది అసలు లేదని అందరికీ అర్థమవుతుంది. అదే జరిగితే బీజేపీ ఇంత కాలం ఆధారపడుతున్న ఓ శక్తి లేనట్లు అవుతుంది ? మరి బీజేపీ గెలుపునకు ఆధారమేంటి ? బీజేపీ గతంలోలా సిద్దాంతాల మీద నడవడం లేదు. వ్యక్తి పూజ మీద నడుస్తోంది. ఇప్పుడు అదే ఆ పార్టీకి గుదిబండగా మారనుంది.
గడ్డు పరిస్థితుల కారణంగా మినీ జమిలీకి ప్లాన్
మధ్యప్రదేశ్, చత్తీస్ ఘడ్, రాజస్థాన్‌లలో కాంగ్రెస్‌తో బీజేపీ ముఖాముఖి పోరాడుతోంది. తెలంగాణలో త్రిముఖ పోటీ ఉంది. కానీ అక్కడ ఇటీవల పరిణామాలు బీజేపీకి ఇబ్బందికరంగా మారాయి. ముఖాముఖి పోరులో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తే… ఆ పార్టీ అనూహ్యంగా పుంజుకుంటుంది. ఇప్పటికే కర్ణాటక ఇచ్చిన ఊపు ఉంది. ఇది బీజేపీకి ఇబ్బందికర పరిణామమే. అదే సమయంలో ప్రాంతీయ పార్టీలు కూడా బలం పెంచుకుంటున్నాయి. దక్షిణాదిలోని దాదాపు అన్ని రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలే కీలకంగా ఉన్నాయి. ఈ పార్టీలన్నీ సంప్రదాయంగా బీజేపీని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఓ వైపు కాంగ్రెస్ పుంజుకుని.. ఈ ప్రాంతీయ పార్టీలు కూడా.. అండగా నిలిస్తే.. బీజేపీకి ఇబ్బందికర పరిణామమే. పైగా ఇటీవల ప్రాంతీయ పార్టీలన్నీ కూటమిగా మారుతున్నాయి. ఈ కూటమిపై బీజేపీ పెద్దలు ఆందోళన చెందుతున్నారని వారి ప్రకటనలను బట్టి అర్థమవుతుంది. నిజానకి ఈ కూటమి ఇంకా పూర్తి స్థాయిలో ఏర్పడలేదు. నేతలంటూ ఎవరూ లేరు. నితీష్ కుమార్ నాయకత్వం వహించడానికి వెనుకడుగు వేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వారు కుదురుకోకుండానే… ఎన్నికలకు వెళ్తే మంచిదని అమిత్ షా , మోదీ కలిసి నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. డిసెంబర్ లో ఎన్నికలు వస్తాయని I.N.D.I.A కూటమి నేతలు గట్టిగా నమ్ముతున్నారు. ఇప్పుడు ప్రత్యేక పార్లమెంట్ సెషన్ కూడా అందుకోసమేనని ఎక్కవ మంది నమ్ముతున్నారు. అయితే పార్లమెంట్ ను రద్దు చేసి ఐదు రాష్ట్రాలతో పాటు ముందస్తుకు వెళ్తారా లేకపోతే.. దేశమంతా చర్చనీయాంశమయ్యేలా జమిలీ ఎన్నికలకు ప్లాన్ చేస్తారా అన్నది మాత్రం పార్లమెంట్ సమావేశాల్లోనే తేలే అవకాశం ఉంది.
పార్లమెంట్ సమావేశాల్లో జమిలీ బిల్లు ?
జమిలీ ఎన్నికలు అనేది బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వానికి ఓ టార్గెట్ . వన్ నేషన్ – వన్ ఎలక్షన్ అనే పద్దతికి ఎప్పటి నుంచో మద్దతు తెలుపుతుంది. జమిలీ కోసం లా కమిషన్ సిఫారసులు కూడా చేసింది. జమిలీ ఎన్నికలు అంటూ వస్తే నిర్వహించాడనికి తాము సిద్ధమేనని ఇందు కోసం రాజ్యాంగ సవరణ చేయాల్సి ఉందని ఎన్నికల సంఘం ఇప్పటికే ప్రకటించింది. ఇప్పుడు కేంద్రం జమిలీ ఎన్నికలకు పూర్తి స్థాయిలో కాకపోయినా సగం రాష్ట్రాలకు పార్లమెంట్ తో పాటే ఎన్నికలు నిర్వహించాలన్న ఆలోచన చేస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ఎన్నికల్లో గెలుపు కోసమే ముందస్తుకు వెళ్తున్నారని ప్రజలు అనుకుంటే.. ఇబ్బందికర పరిస్థితి రావొచ్చు. అందుకే.. ప్రజల కోసం .. ప్రజాధనం కాపాడటానికే తాము ముందస్తుకు వెళ్తున్నామన్న అభిప్రాయం కల్పించేందుకు రెడీ అవుతున్నారని అర్థం చేసుకోవచ్చు.
అందు కోసం చట్టసవరణ చేయడానికే ప్రత్యేకంగా పార్లమెంట్ సమావేశ పరుస్తున్నారన్న అభిప్రాయం వినిపిస్తోంది. వచ్చే ఏడాది మార్చిలో లోక్‌సభ ఎన్నికలు జరగాల్సి ఉంది. షెడ్యుల్ ప్రకారం డిసెంబర్‌లోపు తెలంగాణ, ఛత్తీస్ గఢ్, రాజస్ధాన్, మధ్యప్రదేశ్, మిజోరం ఎన్నికలు జరగాల్సి ఉంది. ఆ తర్వాత ఆరు నెలల్లోనే లోక్ సభ ఎన్నికలతో పాటు మరో 4 రాష్ట్రాల ఎన్నికలు జరగాలి. ఇంకా జమ్మూకశ్మీర్ ఎన్నికలు కూడా నిర్వహిస్తామని చెబుతోంది. అంటే పది రాష్ట్రాల ఎన్నికలు జరగాల్సి ఉంది. అదే సమయంలో మహారాష్ట్రలో కూడా పోల్స్ పెట్టే ఆలోచనలో ఉన్నారు.
నాలుగు నెలల వ్యవధిలో రెండు సార్లు ఎందుకు అన్నింటినీ ఒకే సారి పెడితే ఎలా ఉంటుందన్న ఆలోచనలో కేంద్రం ఉందని అంటున్నారు. లోక్‌సభతో పాటు మొత్తం 11 రాష్ట్రాల ఎన్నికలను మినీ జమిలీ తరహాలో జరపాలన్న ఆలోచనలో ఉందని ఎప్పట్నుంచో చెప్పుకుంటున్నారు. అయితే ఇలా కేంద్రం అనుకుంటే అలా ఎన్నికలు పెట్టడం సాధ్యం కాదు. రాజ్యాంగ సవరణ చేయాల్సి ఉంటుంది. ఇందుకు అనుగుణంగా ల పార్లమెంటు సమావేశాల్లో కేంద్రం.. బిల్లు ప్రవేశపెట్టబోతోందని అర్థం చేసుకోవచ్చు. ఈ బిల్లు పాస్ అయితే ‘మిని జమిలి ఎన్నికలు’ జరిగే అవకాశం ఉంది. వృధా ఖర్చును అరికట్టే ఉద్దేశంతో జమిలి ఎన్నికలు జరపబోతున్నామని ఆర్టికల్ 172 ప్రకారం అసెంబ్లీ గడువును పెంచే అధికారం తమకు ఉందని కేంద్రం ఇప్పటికేవాదిస్తోంది.
విపక్ష కూటమి కలసిపోకుండా ప్లాన్
బీజేపీకి వ్యతిరేకంగా ఇప్పటి వరకు ప్రతిపక్షాలన్నీ ఏకమయ్యేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఆయా రాష్ట్రాల్లోని పరిస్థితులను అంచనా వేసుకుని.. సిద్ధాంతాల ప్రాతిపదికగా అందరూ ఒకే వేదికపైకి రావడానికి కొంత సమయం పడుతుంది. పట్నా, బెంగళూరలో సమావేశాలు జరిగాయి. ఇండియా కూటమిగా ఏర్పడ్డాయి. ఈ కూటమి పూర్తి స్థాయిలో సమన్వయం సాధించక ముందే ఎన్నికలకు వెళ్లాలనే ఆలోచన బీజేపీ చేస్తున్నట్లు సమాచారం. అలా చేయడం వల్ల ఎవరికి వారు పోటీ చేసి.. ఓట్లు చీలిపోయి.. లాభం పొందుతామని బీజేపీ భావిస్తోంది. కాంగ్రెస్ పార్టీని ఇప్పుడు నిధుల సమస్య పట్టి పీడిస్తోంది. కాంగ్రెస్ పార్టీ రేసులోకి వచ్చినట్లు అనిపిస్తే.. ఆ పార్టీకి విరాళాలు వస్తాయి. ఇది బీజేపీకి చిక్కులు తెచ్చి పెట్టే అంశమే. అందుకే.. ఎన్నికల ఖర్చులు తగ్గించడానికి జమిలీ ఎన్నికలకు వెళ్తున్నామని.. ఆ దిశగా తొలి అడుగు వేస్తున్నామని బీజేపీ చెప్పుకునే అవకాశం ఉంది. అదే సమయంలో లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికలు ఒక సారి జరిగితే బీజేపీకి అడ్వాంటేజ్ లభిస్తుంది. రాష్ట్రాల్లో ఉన్న వ్యతిరేకత.. మోదీ హవాతో కలిసిపోతుందని భావిస్తున్నారు. రాష్ట్రంలో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు ఒకేసారి జరిగితే బీజేపీకి కలసి వస్తుందన్న అంచనాలు ఉన్నాయి. ప్రజల్లో మోడీ పట్ల ఆదరణ ఉందని, జమిలి ఎన్నికలు జరిగితే అటు లోకసభ, ఇటు అసెంబ్లీ సీట్లు బీజేపీకే పడతాయని అనుకుంటున్నారు. మోడీ ప్రభావం ఎక్కువగా ఉంటే పోతాయనుకునే అసెంబ్లీ ఎన్నికల్లోన కూడా విజయం సాధించవచ్చని అంచనా వేస్తున్నారు.
బీజేపీ సన్నిహితులందరికీ ఇప్పటికే సూచనలు !
బీజేపీ డిసెంబర్ లో ఎన్నికల ఆలోచనలు చేస్తుందనడానికి మరో కారణం ప్రజలకు తాయిలాల ప్రకటన. సామాన్య ప్రజల్లో కేంద్రంపై ఆగ్రహం ఉంది. దానికి కారణం నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదల. అందుకే ఇప్పటికిప్పుడు కొన్ని చర్యలు తీసుకుంటున్నారు. గ్యాస్ బండను రెండు వందల వరకూ తగ్గించారు. పెట్రోల్, డీజిల్ ధరలు రేపోమాపో తగ్గించబోతున్నారు. ఇప్పటికే పది లక్షల ఉద్యోగ నియామక పత్రాలు అందిస్తున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం కూడా ఇప్పటికే ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లు దాదాపుగా పూర్తి చేసింది. అన్ని లోక్ సభ నియోజకవర్గాలకూ రిటర్నింగ్ ఆఫీసర్లను గుర్తించడం కూడా చేసింది. ప్రస్తుతం ఓటరు జాబితాలను సవరిస్తున్నారు. అన్నీ డిసెంబర్ ఎన్నికల కోసమే అన్నట్లుగా ఈసీ కూడా వేగంగా పనులు చక్కబెడుతోంది. తెలంగాణ సహా ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియకు కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తు చేసింది. అధికారుల బదిలీలు, పోస్టింగులకు సంబంధించి కీలక ఆదేశాలు కూడా జారీ చేసింది. రాజ్యాంగం ప్రకారం అయితే అసెంబ్లీల గడువు ముగియడానికి ఆరు నెలల ముందే ఈసీ ఎన్నికలు నిర్వహించవచ్చు. కానీ లేటుగా నిర్వహించడానికి అవకాశం లేదు. ఐదేళ్ల గడువు పూర్తయితే ఆ ప్రభుత్వానికి కాలం తీరిపోయినట్లే. అయితే రాష్ట్రపతి పాలన విధించాల్సి ఉంటుంది. అసెంబ్లీ గడువు పొడిగింపు సాధ్యమా కాదా అన్నది రాజ్యాంగ నిపుణులు తేల్చాల్సి ఉంది. మినీ జమిలీపై స్పష్టత పార్లమెంట్ సమావేశాల్లోనే వచ్చే అవకాశం ఉంది.
డిసెంబర్ ఎన్నికలపై తెలుగు రాష్ట్రాల రాజకీయ నేతలకూ స్పష్టత ఉంది. అందుకే నారాలోకేష్ తన పాదయాత్రను నాలుగు వందల రోజుల నుంచి మూడు వందల రోజులకు తగ్గించుకున్నారు. రాయలసీమ నుంచి ప్రకాశం జిల్లాలోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత వెంటనే.. ప్రకాశం, గుంటూరు, కృష్ణా పాదయాత్రలను పూర్తి చేశారు. ఇప్పుడు గోదావరి జిల్లాల్లో ఉన్నారు. వీలైనంత త్వరగా పాదయాత్ర పూర్తి చేయబోతున్నారు. ఇక చంద్రబాబునాయుడు పూర్తి స్థాయిలో కార్యాచరణ ప్రారంభించారు. విస్తృతంగా పర్యటిస్తున్నారు. మరో వైపు ఎలక్షనీరింగ్ చేస్తున్నారు. అభ్యర్థుల కసరత్తు దాదాపుగా పూర్తి చేశారు. అదే సమయంలో జగన్మోహన్ రెడ్డి కూడా డిసెంబర్ పోల్స్ కు రెడీ అవుతున్నారు. ఆయన రెండేళ్ల ముందు నుంచే ఎన్నికల కసరత్తు చేస్తున్నారు. పార్టీ నేతల్ని గడప గడపకూ పంపి ఇంటింటి ప్రచారం చేస్తున్నారు.
రాజకీయ నాయకులకు పుట్టెడు తెలివితేటలుంటాయి. సామాన్యులకు అర్థం కావు. ఆ తెలివితేటలన్నీ.. తమ అధికారం నిలబెట్టుకోడానికే వాడుతున్నారు. అసలు సమస్య అక్కడే వస్తోంది. ప్రజలు మాత్రం ఓట్లు వేయడమే పని. అందు కోసం డిసెంబర్లో సమయం కేటాయించుకోవాలి. అంతకు మించి చేసేదేమీ ఉండదు.