“నా అండర్ వేర్ డాలర్ కంపెనీది కాబట్టి సరిపోయింది అదే రూపాయి కంపెనీది అయితే జారిపోతూ ఉండేది.. లాక్కోలేకపోయేదాన్ని” అని అలనాటి అందాల హీరోయిన్, కోల్‌కతా ఐపీఎల్ టీం గ్లామరస్ యజమానుల్లో ఒకరు అయిన జూహిచావ్లా కామెంట్ ఇటీవల వైరల్ అయింది. ఇప్పుడు అలాంటి చిలిపి జోక్ వేసేంత సీరియస్ నెస్ మన సినీతారల్లో ఎవరికీ లేదు. ఈ జోక్ వేసింది.. మన దేశాన్ని దివాలా స్థితి నుంచి ఆర్థికంగా గట్టెక్కించారని.. భారతరత్న ఇవ్వాల్సిందేనని బీజేపీ నేతలు కూడా అంటున్న మన్మోహన్ సింగ్ హయాంలో. 2013లో. ఎందుకంటే డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువరోజు రోజుకు పడిపోతూ వస్తోంది. డాలర్‌కు రూపాయి మారకం విలువ రూ. 60కి అటూ ఇటూగా ఉండేది. రోజుకు పది .. పదిహేను పైసలు బలహీనపడుతూ వచ్చేది. దీనికి జూహిచావ్లా నుంచి నాడు గుజరాత్ సీఎంగా ఉన్న నరేంద్రమోదీ వరకూ అందరూ విరుచుకుపడేవారు. బలహీన ప్రధాని మన్మోహన్ కాబట్టే రూపాయి బలహీనంగా ఉందని వాదించేవారు. బీజేపీ అధికారంలోకి వస్తే డాలర్‌తో సమానంగా రూపాయి విలువ ఉంటుందని ఇంకా చెప్పాలంటే.. రూపాయి రెండు, మూడు డాలర్లు వచ్చే రోజులు వస్తాయని ఉదరగొట్టారు. అంతకు రెండేళ్ల ముందే ఉపేంద్ర హీరోగా వచ్చిన సూపర్ సినిమాలో ఇదే కాన్సెప్ట్ ఉండేది. విదేశీయులంతా ఇండియాకు వచ్చి పనులు చేసుకునేవాళ్లని చివరికి అడుక్కునేవాళ్లని.. ఒక్క రూపాయికి వంద డాలర్లు ఇచ్చే పరిస్థితి ఉంటుందని ఆ సినిమాలో చూపించారు. మోదీ ప్రధాని అయితే మన దేశంలో అలాంటి అద్భుతం జరుగుతుందని బీజేపీ నేతలు ప్రచారం చేశారు. ఇప్పటికి మోదీ మూడో సారి ముఖ్యమంత్రి అయ్యారు. మరి రూపాయి ఎక్కడుంది రూ. 86 దరిదాపుల్లోకి చేరింది. అంటే బీజేపీ మాటల ప్రకారం బలహీన ప్రధాని ఉన్నప్పటిన్నా విశ్వగురు లాంటి బలమైన ప్రధాని ఉన్నప్పుడు ఇంకా ఎక్కువగా రూపాయి బలహీనపడుతోంది. ఈ తప్పు అంచనాలు పెంచుకున్న ప్రజలదా ? రూపాయి పతనం మా చేతుల్లో లేదు అని అంటున్న పాలకులదా?
మోదీ డాలర్‌తో రూపాయిని సమానం చేస్తారని ఆశపడిన భారతీయులు
అమెరికా అధ్యక్షుడిగా డోనాల్డ్ ట్రంప్ ఎన్నికయిన నవంబరు ఐదున రూపాయి విలువ 84.11 ఉంటే డిసెంబరు చివరి వారంలో ముందే చెప్పుకున్నట్లు 85.65ని తాకింది. వాజ్‌పేయి ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో అంటే 2000 సంవత్సరంలో రూపాయి విలువ 43.35 ఉంది. అది మన్మోహన్ సింగ్ అధికారానికి వచ్చిన 2004లో 45.10, మోడీ పదవీ స్వీకారం చేసిన 2014లో 62.33గా ఉంది. ఇప్పుడు 85.65 దగ్గర ఉంది. 1947లో స్వాతంత్య్రం వచ్చినపుడు రూపాయి విలువ డాలరుకు 3.30 మాత్రమే ఉంది. మోదీ మళ్లీ ఆ స్థాయికి తీసుకు వస్తారని ఆశించిన, ఆశలు పెట్టుకున్న భక్తుల కోరికలు కూడా కనీసం తీర్చే ప్రయత్నం జరగలేదు. రూపాయి ప్రమాదకరంగా బలహీనపడుతున్నా ప్రధాని నరేంద్ర మోడీ సర్కార్ పెద్దగా చర్యలు చేపట్టలేదు. రూపాయి పతనం గురించి గతంలో మోదీ మాట్లాడిన మాటలను జనం మరచిపోయి ఉండవచ్చు కానీ సోషల్ మీడియాలో మాత్రం వైరల్ అవుతూనే ఉన్నాయి. ఆ సమయంలో సినీ ప్రముఖులు, వ్యాపార రంగ ప్రముఖులు చేసిన కామెంట్స్ కూడా వైరల్ అవుతున్నాయి. కానీ ఇప్పుడు అందరూ మౌనంగా ఉంటున్నారు. 2014 ఎన్నికలకు ముందు రూపాయి పతనాన్ని కాంగ్రెస్‌పై దాడికి ఒక ఆయుధంగా వాడుకున్నారు. కానీ ఆ రూపాయిని బలోపేతం చేసే విషయంలో మాత్రం సైలెంట్ గా ఉంటున్నారు. అంటే చేత కావడం లేదనే అనుకోవాలి. ఆ మధ్య కొంత స్థిరంగా ఉన్న రూపాయి గత మూడు నెలలుగా పతనం అవుతోంది. రూపాయిని నిలబెట్టేందుకు ప్రభుత్వం ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్న దాఖలాలు లేవు. మరో నాలుగేళ్లకు డాలర్‌తో రూపాయి మారకం విలువ 101కి పతనం అవుతుందని ద్రవ్య వ్యాపార నిపుణులు చెబుతున్నారు. రూపాయి పతనం వేగాన్ని చూస్తూంటే ఇంకా ఆశ్చర్యక రీతిలో దిగజారేందుకే అవకాశం ఉందని అంటున్నారు. అంతే తప్ప బలపడుతుందని ఎవరూ అనుకోవడం లేదు. ఎందుకంటే ఆ దిశగా చేపడుతున్న చర్యలు కనుచూపు మేరలో కనిపించడం లేదు. గతంలో నిర్మలా సీతారామన్ ఈ రూపాయి పతనంపై చాలా సిద్దాంతాలు చెప్పారు. అందులో ఒకటి రూపాయి బలహీనపడటం లేదు.. డాలర్ బలపడుతుంది అంతే అని. పళ్లు రాలగొట్టుకోవడానికి ఏ రాయి అతేనేం అనే సిద్దాంతాలు ఇలాంటి రాజకీయ నేతల వల్లే వస్తాయి. రూపాయి బలహీనపడితే చాలా లాభాలు వస్తాయని మనం ఎగుమతులు చేస్తాం కాబట్టి కాబట్టి వాటికి వచ్చే చెల్లింపులు ఎక్కువగా ఉంటాయని సంబర పడుతున్నారు. కానీ అసలు నిజం చెప్పడం లేదు. మనం ఎగుమతులు చేసుకునేవి కన్నా.. దిగుమతి చేసుకునేవే ఎక్కువ. అంటే.. ఆ లోటు అంతకంతకూ పెరుగిపోతుందన్నమాట.
అప్పట్లో జోకులేసిన వారు ఇప్పుడు నోరు మెదపరేంటో ?
రూపాయి ఎందుకు పతనం అవుతుందో విశ్లేషించడానికి కూడా ఇప్పుడు ఆర్థిక నిపుణులకు ధైర్యం చాలడం లేదు. ఎందుకంటే మౌనంగా ఉండటానికి పైన పవర్ లో ఉంది మన్మోహన్ సింగ్ కాదు. సరే విమర్శలు చేయనివ్వకుండా కట్టడి చేస్తే ఓకే.. మరి రూపాయి ఎందుకు పడిపోయిందో గుర్తించి కట్టడి చేయాలని ఎందుకు అనుకోరు ?. విదేశీ మదుపుదార్లు స్టాక్, రుణ మార్కెట్ల నుంచి తమ పెట్టుబడులను వెనక్కు తీసుకుంటున్నారు. వాటిని ఇతర చోట్లకు తరలిస్తున్నారు. వారంతా డాలర్ల రూపంలోనే లావాదేవీలు చేస్తారు కాబట్టి డాలర్లకు డిమాండ్ పెరిగి రూపాయి విలువ తగ్గుతోంది. అమెరికాలో వడ్డీ రేట్లను పెంచారు. ఇది పెట్టుబడిదారులను ఆకట్టుకుంది. డాలర్లను ఇక్కడ ఉపసంహరించి అమెరికాలో డిపాజిట్ చేసుకుంటున్నారు. అమెరికా ప్రభుత్వ బాండ్ల కొనుగోలుకు ఎగబడుతున్నారు. లొంగని దేశాలపై ట్రంప్ బెదిరింపులు, వాణిజ్య పోరు వంటి అనేక సమస్యలు కూడా అనేక దేశాల కరెన్సీల విలువ పతనానికి కారణం అవుతున్నాయి. మనపైనా అందే ప్రభావం చూపిస్తోంది. ఈ సమస్యను ఐర్బీఐ గుర్తించడం లేదా అంటే .. అన్నీ వంద శాతం తెలుసు. గతంలోయూపీఏ హయాంలో మన్మోహన్ వంటి ఆర్థిక నిపుణుడు ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో రూపాయి విలువ పతనాన్ని అరికట్టేందుకు రిజర్వుబాంకు రంగంలోకి దింపి విదేశీ కరెన్సీ విక్రయాలు చేసి రూపాయిని కాస్త బలం పుంజుకునేలా చేశారు. కనీసం పడిపోకుండా ఆపే ప్రయత్నం చేశారు. కానీ ప్రస్తుతం అలాంటి విధానాలను పట్టించుకోవడడం లేదు. రూపాయి పతనాన్ని అరికట్టేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఆర్బిఐ చెబుతున్నప్పటికీ అవన్నీ ఉత్తుత్తి ప్రయత్నాలే. కరెన్సీ విలువ పతనం కూడా ఆర్థిక వ్యవస్థ బలహీనం అవుతుందని …మన ఆర్థిక వ్యవస్థకు సమస్యలు వస్తే తట్టుకునే శక్తిని కోల్పోతుందని ఆర్థిక నిపుణులు ఎప్పటికప్పుడు ఆందోళన చెందుతూనే ఉన్నారు,
పతనం వల్ల లాభాలు అని పిచ్చి కబుర్లు
ప్రపంచవ్యాప్తంగా డాలర్‌ను మారకపు విలువగా చూస్తారు. అంటే ఏ దేశంలో అయినా డాలర్ పని చేస్తుంది. కానీ అదే భారత రూపాయి పక్క దేశంలో చెల్లదు. అక్కడకు వెళ్లి మా రూపాయిలు ఇస్తాం.. మీ దేశం మారకం విలువ ఇవ్వాలంటే ఇవ్వరు. దుబాయ్ కి వెళ్లి రూపాయల్లో చెల్లిస్తామంటే కష్టం. ముందుగా వాటిని డాలర్లలోకి మార్చుకోవాలి. ఆ తర్వాతే వాటిని అవసరమైన దేశంలో కరెన్సీ మార్పిడి చేసుకోవాలి. అంటే డాలర్ ప్రపంచ కరెన్సీ అన్నమాట. ఆ అలాంటి కరెన్సీతో మన మారకపు విలువ పడితే .. ఎంత తీవ్ర నష్టమో ఊహిస్తే చెమట్లు పడతాయి. మనం ఎగుమతులు చేస్తే డాలర్లలో కడతారు. అది నిజమే. కానీ మన దిగుమతులకు కూడా డాలర్లలోనే చెల్లించాలి. మన దేశం ఉపయోగించుకునే పెట్రోలియం ఉత్పత్తుల్లో 90 శాతం దిగుమతులే. అంటే రూపాయి విలువ పడిపోయే కొద్దీ.. పెట్రోల్ దిగుమతుల భారం ఎంత పెరుగుతుందో చెప్పాల్సిన పని లేదు. అంతిమంగా ఈ భారం ఎవరిపై పడుతుంది..? రూపాయి పతనం ఎంతో మంది జీవితాలపై వ్యాపారాలపై ప్రభావం చూపిస్తోంది. విదేశాల నుంచి దిగుమతి చేసుకొనే వస్తువుల భారంతో సామాన్యులకు జేబు గుల్ల అవుతుంది. దిగుమతుల మీద ఆధారపడిన వస్తువుల ఉత్పత్తి ఖర్చులు పెరుగుతాయి. దాని వల్లవాటి రేట్లు పెంచాల్సి వస్తుంది. రూపాయి పతనం వలన ల ద్రవ్యోల్బణం, దాంతో ధరల పెరుగుదలకు దారితీస్తుంది కొనుగోలు శక్తి తగ్గుతుంది. చమురు దిగుమతి బిల్లు పెరిగి అందరి మీదా భారం పెరుగుతుంది. విదేశాల నుంచి రుణాలు పొందిన కంపెనీల మీద భారం పెరుగుతుంది. పెట్టుబడుల మీద కూడా ప్రతికూల ప్రభావం పడుతుంది. అంతే కాదు మన దేశం నుంచి అమెరికా సహా ఇతర దేశాలకు చదువులకు వెళ్లే వాళ్లు పెద్ద మొత్తంలో ఖర్చు పెడుతున్నారు. అమెరికాకు మన వాళ్లు లక్ష కోట్లు ధారబోస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. ఉద్యోగాలు రాని చదువుల కోసం ఆస్తుల్ని తాకట్టుపెట్టి డాలర్లుగా మార్చి పంపిస్తున్నారు. ఇలాంటివారికి గత పదేళ్లలో ముఫ్పై శాతానికిపైగా భారం పెరిగింది. అసలు ఏదైనా పతనం వల్ల మేలు జరుగుతుందని చెప్పడం కష్టం. అదే నిజమైతే.. డాలర్ ను.. అమెరికా ఆ స్థాయిలో ఉంచుకోదు. డాలర్ తక్కువగా ఉంటే…మేలు జరుగుతుందనుకుంటే.. రూపాయికి వంద డాలర్లు వచ్చేలా వెంటనే మార్చుకుంటుంది. అయినా డాలర్ పడిపోతే లాభపడేవాళ్లు ఉన్నారని సైలెంట్ గా ఉండటం దేశానికి నష్టం చేసినట్లే అవుతుంది.
రూపాయి బలహీనం కాకుండా కేంద్రం తమ ప్రయత్నాలు తాము చేయాలి. రూపాయిని బలపరిచే ప్రయత్నాలు చేయాలి కానీ… దేవుడికి వదలేసి జరిగేదో జరుగుతుందని అనుకుంటే.. అది కచ్చితంగా రూపాయి ద్రోహమే అవుతుంది. దేశానికి నష్టం చేయడమే అవుతుంది.