” నేను గెలిచానని అనుకున్నా కానీ అది గెలుపు కాదు ఓటమి ” . ఒక్క గెలుపుతో సర్వం పోగొట్టుకుంటే ఎవరికైనా ఇదే అనిపిస్తుంది. ఈ మాటలు తత్వవేత్తలు చెప్పాల్స్సిన పని లేదు. తత్వం బోధపడిన ప్రతీ వారికి అర్థమవుతుంది. గెలిచానని విర్రవీగి మొత్తం పోగొట్టుకున్న వారికి తర్వాత తెలుస్తుంది.. అంటే తత్వం బోధఫడిన తర్వాత తెలుస్తుంది. ఇప్పుడీ తత్వం బోధపడే పరిస్థితికి ఏపీ సీఎం జగన్ రెడ్డి వచ్చారు. ఆయన 2019 ఎన్నికల్లో గెలిచారని అనుకున్నారు. కానీ ఐదేళ్ల తరవాత చూస్తే.. అది గెలుపు కాదు.. ఘోరమైన ఓటమి అని అర్థమవుతుంది. ఇప్పుడు ఆయనకు కుటుంబం దూరమైంది. నమ్మకస్తులు లేరు. నమ్మేవాళ్లు లేరు. రేపు అధికారం ఉడందు. ఊరంతా శత్రువులు. పవర్ పోగానే పక్కన ఉండటానికి కూడా సొంత వాళ్లు భయపడే పరిస్థితి. ప్రతీ క్షణం భయం .. భయంగా బతకాల్సిన పరిస్థితి. పలకరించడానికి కూడా ఆత్మీయులు సంకోచించే దౌర్భాగ్యం. ఇదంతా 2019లో జగన్ రెడ్డి అనుకుంటున్న గెలుపు వల్ల వచ్చిన ఓటమి. అది గెలుపు కాదు.. ఓటమి అని ఆయనకు తత్వం బోధపడటానికి ఇంకా నెల రోజులే ఉంది.
2019 గెలుపు జగన్ రెడ్డిపై ప్రజలు వేసిన ట్రాప్
గెలిచి ఓడారు అని క్రీడల్లో చెబుతూంటారు. రాజకీయాల్లో చెప్పాలంటే.. ఈ మాట జగన్ రెడ్డికి ఖచ్చితంగా సరిపోతుంది. 2019 ఎన్నికల్లో ప్రజలు ఏకపక్ష విజయాన్ని ఇచ్చారు. ఎంతగా అంటే ప్రతిపక్షానికి పోరాడేంత బలం కూడా ప్రజలు ఇవ్వలేదు. 22 మంది ఎంపీలు, 151 మంది ఎమ్మెల్యేలతో ప్రజలు విజయం కట్టబెట్టారు. ఈ బలంతో ఆయన మరితంగా ప్రజల్లోకి వెళ్తారని వారి అభిమానాన్ని పొందుతారని అనుకున్నారు. కానీ ఈ ఏకపక్ష విజయం ప్రజలు వేసిన ట్రాప్ అని ఆ తర్వాత వరుసగా జరిగిన.. జరుగుతున్న పరిణామాలతో అర్థమవుతుంది. ఇంత ఏకపక్ష విజయం సాధించిన తాను.. దేవుడ్నని.. ప్రజలంతా అలాగే అనుకుంటున్నారన్న ఫీలింగ్ కు వచ్చారు. అదే ఆయన పతనానికి మొదటి మెట్టుగా మారింది. ఫలితంగా ఒంటరిగా మారారు. రాజకీయంగా పక్కన పెడతాం.. ఈ గెలుపుతో జగన్ రెడ్డికి వచ్చిన మొదటి ఓటమి.. కుటుంబానికి దూరం కావడం.
గెలుపుతో కుటుంబం దూరం – మళ్లీ దగ్గర కాలేనంత ఆగాథం
యొదుగూరి సందింటి కుటుంబం గత చరిత్ర ఎలా ఉన్నా.. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో కుటుంబం మొత్తాన్ని ఏకతాటిపైన ఉంచారు. వారిలో పొరపొచ్చాలు అన్న మాటలు బయటకు రాలేదు. కుటుంబాన్ని ఐక్యంగా ఉంచకపోతే ఇక రాజకీయంగా అందర్నీ ఎలా కలుపుకునిపోగలరన్న ప్రశ్న సహజంగానే వస్తుంది. కానీ అలాంటి మాటల్ని తన మీదకు రాకుండా చేసుకోవడంలో వైఎస్ సక్సెస్ అయ్యారు. ఆయన హఠాత్ మరణంతో.. వారసత్వాన్ని తీసుకుని జగన్ రెడ్డి.. ఇప్పుడు ఏం చేశారు ?. అధికారంలోకి వచ్చి కూడా కుటుంబాన్ని కాపాడుకోలేకపోయారు. తల్లీ , చెల్లీని గెంటేశారు. పార్టీ గౌరవాధ్యక్షురాలి పదవి నుంచి తల్లిని తరిమేశారు. చివరికి వైఎస్ రాజశేఖర్ రెడ్డి మనవడు.. సొంత చెల్లి కుమారుడు పెళ్లికి కూడా వెళ్లలేనంత గ్యాప్ పెరిగిపోయింది. ఇప్పుడు జగన్ రెడ్డి మొహం చూసేందుకు చెల్లి షర్మిల కూడా ఇష్టపడదు. ఎందుకంటే..అధికారం అందిన అహంకారంతో జగన్ రెడ్డి చూపించిన అహంకారం.. మా అన్న అని అనుకోలేనంత అసహ్యాన్ని రాజేసింది. ఎంత ధనవంతుడికైనా.. ఎంతో పేరు ప్రతిష్టలు సంపాదించుకున్న వాడికైనా.. అధికారం శాశ్వతంగా ఉన్న వాడికైనా కుటుంబం ముఖ్యం. ఎందుకంటే డబ్బు, అధికారం ఏదీ శాశ్వతం కాదు. మరి 2019లో వచ్చిన గెలుపు వల్ల జగన్ నిజంగా గెలిచారా… ?. జీవితంలో మళ్లీ వెనక్కి తెచ్చుకోలేనంతగా .. గెలవలేనంతగా ఓటమి పాలయ్యారా ?
ఆత్మీయులు దూరం.. శ్రేయోభిలాషులు దూరం… చివరికి తండ్రి ఫ్యాన్స్ కూడా దూరం !
జగన్ రెడ్డి కోల్పోయింది కుటుంబాన్ని మాత్రమే కాదు.. ఆత్మీయుల నమ్మకాన్ని కోల్పోయారు. పార్టీ క్యాడర్ నమ్మకాన్ని కోల్పోయారు. నమ్ముకున్న వారి నమ్మకాన్నీ కోల్పోయారు. పదవి పోతే తన పక్కన ఎవరూ ఉండని వారు మాత్రమే ఆయన వెంట ఉన్నారు. ఆ విషయంలో మరో నెల రోజుల్లో అర్థమవుతుంది. జగన్ రెడ్డి గెలవక ముందే సీఎంగా వ్యవహరించారు. ఎన్నికల కోడ్ ను అడ్డం పెట్టుకుని తాను నియమించుకున్న సీఎస్ తో రెండు నెలల ముందు నుంచే పాలన చేశారు. కానీ ఇప్పుడా సీఎస్ ఏమంటున్నారు ?. ఆయన ఒక్కరు కాదు.. జగన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు… అధికారంలోకి రావడానికి తన నైతిక విలువలకు తిలోదకాలు ఇచ్చి మరీ సహకరించిన ఎంతో మంది ప్రముఖులు ఇప్పుడు జగన్ రెడ్డిని ముఖానే అసహ్యించుకుంటున్నారు. తన కోసం పదేళ్లు కష్టపడిన పార్టీ కార్యకర్తలు ఇప్పుడు సమయం వేస్ట్ చేసుకున్నామని బాధపడుతున్నారు. ఊరూవాడా పెట్టిన వైఎస్ విగ్రహాల మట్టికొట్టుకుపోతే… కనీసం జయంతి, వర్థంతులకైనా కాస్త శుభ్రం చేద్దామన్న అభిమానం కూడా అనుచరుల్లో అభిమానుల్లో లేకుండా చేశారు. చివరికి డబ్బులు, మద్యం పోస్తే తప్ప పార్టీ మీటింగ్‌లకూ రాని దుస్థితిని కొని తెచ్చుకున్నారు. ఇది గెలుపుతో వచ్చిన భయంకరమైన ఓటమి కాదా ?
ఎవరూ నమ్మలేని వ్యక్తిత్వం బహిర్గతం – అవసరం లేని పగ, ప్రతీకారాల కంపుతో అందరూ దూరం !
పోని ఎన్నికల్లో వచ్చిన గెలుపుతో వ్యక్తిత్వం అయినా నిలబడిందా అంటే.. అదీ రోడ్డున పడింది. ఇప్పుడు ఎవరైనా ఆప్యాయంగా పలకరించే వారు ఉన్నారా ?. సొంత కుటుంబసభ్యుడ్ని .. అదీ కూడా బాబాయ్ ని ఘోరంగా నరికి చంపితే… ఏ మాత్రం సానుభూతి చూపించకపోగా రాజకీయంగా వాడుకున్నారు. తరవాత ఆ బాబాయ్ పైనే నిందలేశారు. న్యాయం కోసం పోరాడుతున్న బాబాయ్ కుమార్తె.. చెల్లి సునీతపైనా అత్యంత ఘోరమైన ప్రచారాలు చేశారు. తర్వాత షర్మిలపైనా అదే ప్రయోగం చేశారు. ఇక జగన్ రెడ్డికి వ్యక్తిత్వం అనేది ఒకటి ఉందని ఎవరికైనా అనిపిస్తుందా ?. తనకు తల్లి, చెల్లి…. సహా ఎలాంటి సెంటిమెంట్లు లేవని.. తన స్వార్థమే తన లాభమని ఆయన అనుకుంటాడన్న విషయాన్ని 2019 ఎన్నికల గెలుపు ప్రజల ముందు పెట్టింది. ఇది అసలైన ఓటమి కాదా ? . పోనీ తాను అయినా ప్రశాంతంగా జీవిస్తున్నారా అంటే.. అదీ లేదు. తాను చేసిన నిర్వాకాలతో ముప్పు ఎటు వైపు నుంచి వచ్చి పడుతుందోనని భయం భయంగా బతుకుతున్నారు. పోతున్న రోడ్లలో చెట్లు ఉండటానికి ఇష్టపడటం లేదు. రెండు,మూడు కిలోమీటర్ల దూరానికీ .. హెలికాఫ్టర్ వాడాల్సి వస్తోంది. భద్రత కోసం ఎస్ఎస్జీ అనే గ్రూపును పెట్టుకోవాల్సి వచ్చింది. ఇవన్నీ అధికారంలో ఉన్నప్పుడు ఉండే భయం. అధికారం పోతే చేసిన నిర్వాకాలకు అసలు బయటకు రాగలరా అనే పరిస్థితి. ఇది గెలుపా ? ఓటమా ?
తిరిగి చూసుకుంటే సర్వం కోల్పోయిన వైనం – మరో నెల రోజుల్లో అధికారం కూడా మాయం
2019లో వచ్చిన గెలుపు గెలుపు కాదు.. అది ఘోరమైన ఓటమి అని.. నిరూపించేందుకు కోకొల్లలుగా ఉదాహరణలు ఉన్నాయి. నిజానికి అది ప్రజలు వేసిన ట్రాప్. ఆయనను ఓడించడానికి పక్కాగా పన్నిన ఉచ్చు. జగన్ రెడ్డి ఇందులో చాలా సులువుగా చిక్కుపోయారు. ప్రజలు పెట్టిన పరీక్షలో తాను ఘోరంగా ఫెయిలయి ఓడిపోయానని నిరూపించుకున్నారు. అంత ఏకపక్ష మెజార్టీ రాకపోతే జగన్ రెడ్డి ఇంత విచ్చలవిడిగా వ్యహరించేవారా ?. చాన్సే లేదు. బలమైన ప్రతిపక్షం ఉండి ఉంటే.. ఎంతో కొంత భయభక్తులతో పరిపాలన చేసేవారు. అమరావతే రాజధాని అని నినదించి.. రాజధాని అంటే ఎలా ఉండాలో తన నోటితో వివరించినట్లుగానే ఉన్న అమరావతిని ఏకపక్షంగా పీకనొక్కేసే ధైర్యం చేసేవారు కాదు. అసెంబ్లీలో స్వయంగా ఆమోదించి….గెలిచిన తర్వాత ప్రజలకు ఇచ్చిన మాటను ఏకపక్షంగా కాదనేసేవారు కాదు. ఒక్క అమరావతి విషయంలోనే కాదు.. ప్రతీ ఏకపక్ష నిర్ణయం… మద్యం బ్రాండ్లు సహా అన్నింటిలోనూ జాగ్రత్తగా ఉండేవారు. కానీ ఏకపక్ష విజయం వచ్చిందన్న అహంకారంతో తీసుకునే నిర్ణయాలతో వరుసగా పోగొట్టుకోవడం ప్రారంభించారు. రాజకీయ ప్రత్యర్థుల్ని లేకుండా చేయాలనుకోవడం… అధికారం అందింది.. .. తనను రాజకీయంగా వ్యతిరేకించే వారిపై పగ తీర్చుకోవడానికి అన్నట్లుగా వ్యవహరించడం దగ్గర్నుంచి అలవి మాలిన సంపాదన కోసం … ప్రజల్ని నిట్టనిలువుగా దోపిడి చేయడం.. ప్రజా ఆస్తిని పిండేసుకోవడం వంటివి అన్నీ జగన్ రెడ్డి గెలిచి ఓడిపోయాడనదానికి ఉదాహరణలు. ప్రజలు అంత భారీ విజయాన్ని ఇవ్వకపోతే.. తన అహంకారం ఈ రేంజ్ లో ఉంటుందని… తనను తాను చక్రవర్తిగా భావించుకుని పీడిస్తారని ప్రజలకు తెలిసే అవకాశం ఉండేది కాదు. ఆయన రాక్షాస మనస్థత్వాన్నిప్రజల ముందు పెట్టేలా వచ్చిన గెలుపు.. నిజంగా గెలుపా.. అసలైన ఓటమా ?
కానీ ఈ ఐదేళ్లలో పోగొట్టుకున్నది ఎప్పటికైనా తెచ్చుకోవడం అసాధ్యం… అందుకే 2019లోనే అసలైన ఓటమి !
గెలుపు ద్వారా వచ్చిన ఓటమిని జగన్ రెడ్డి పరిపూర్ణం చేసుకోవడానికి ఇంకా ఎంతో కాలం లేదు. ప్రజలు గతంలో ఏకపక్షంగా గెలిపించి…. మళ్లీ కోలుకోలేనంత ఓటమి గిఫ్ట్ గా ఇచ్చారు. మరో నెల రోజుల్లో … నిజమైన ఓటమిని అందించబోతున్నారు. అది కూడా గెలుపు వచ్చినంత రివర్స్‌లో ఉంటుంది. రివర్స్ పాలన చేసిన జగన్ రెడ్డికి .. రివర్స్ ఫలితాలను ఇవ్వడం ఖాయమే. అయితే గత గెలుపు.. ఓటమి అయినట్లుగా.. ఈ సారి ఓటమి గెలుపు అయ్యే అవకాశం లేదు. ఎందుకంటే.. ఓ సారి పోగొట్టుకున్నవి.. మళ్లీ వెనక్కి తెచ్చుకోవడం అంతతేలిక కాదు. జగన్ రెడ్డి విషయంలో అసలు సాధ్యంకాదు. ఎందుకంటే ఆయన అంతకు మించి అన్నట్లుగా చేశారు. పవన్ కల్యాణ్ అన్నట్లుగా… పాతాళంలోకి వెళ్లిపోయేలా ఓటమి ఉండబోతోంది. దీనికి 2019 ఎన్నికల గెలుపే కారణం. గెలుపుతో అన్నీ పోగొట్టుకున్న జగన్ రెడ్డి .. చివరి అంకంగా అధికారాన్నీ పోగొట్టుకోబోతున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే.. భస్మాసుర జీవితమన్నమాట.