నీవు ఏమిస్తే నీకు అదే తిరిగి వస్తుదంని తత్వవేత్తలు, స్వామిజీలు తమ ప్రవచనాల్లో చెబుతూ ఉంటారు. కాస్త వెనక్కి తిరిగి చూసుకుంటే చాలా మందికి.. అరె ఇది నిజమే కదా అనిపిస్తూంది. ఎందుకంటే.. తమ జీవితంలో జరుగుతున్న కష్టానష్టాలు, లాభ, సుఖాలు అన్నీ గతంతో ముడిపడినట్లుగా అనిపిస్తూ ఉంటాయి. ఇలాంటి పరినామాలకూ రాజకీయ నేతలు ్తీతం కాదు. మనం చేసిన పనులు కూడా ఎప్పుడూ మన చుట్టూనే తిరుగుతూ ఉంటాయి. ఒక్కో సారి కర్మ ఈజ్ చంచల్ గూడ జైల్ అని వెంటాడవచ్చు. అతి రాజకీయాల్లో అయితే ఇంకా ఎక్కువగా ఉంటుంది. అధికారంలో ఉన్న వారందరికీ ఒక మత్తు ఆవహిస్తుంది… అదేమిటంటే తమకు అధికారం శాశ్వతమని అనుకుంటారు. అంతేనా శాశ్వతం చేసుకోవడానికి ఇక ప్రత్యర్థులు లేకుండా చేసుకోవాలని ఆ అధికారాన్ని ఉపయోగించి ప్రయోగాలు చేస్తూంటారు. అవి వందకు వంద శాతం విఫలమవడమే కాదు…తర్వాత తమ మెడకు చుట్టుకుంటాయని చరిత్ర చెబుతున్నా వారు అవే తప్పులు చేస్తూ ఉంటారు. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు అలాంటి పరిస్థితులే కనిపిస్తున్నాయి.
ప్రజాధనం అక్రమంగా తరలిపోయిందన్నది కళ్ల ముందు ఉన్న నిజం !
ఫార్ములా ఈ రేసు విషయంలో రూ. 55 కోట్లు ప్రజాధనం అక్రమంగా తరలించిన కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై కేసులు నమోదయ్యాయి. ఏడాది నుంచి ఈ విషయం నలుగుతూనే ఉంది. కూలింగ్ పీరియడ్ ముగిసిందేమో కానీ ఇక హీట్ పెంచాల్సిన సమయం వచ్చిందని రేవంత్ కార్యాచరణ ప్రారంభించారు. ఇలాంటి కేసుల విషయంలో రేవంత్ సూచనలు ఉండవని అనుకోవడానికి లేదు. చట్టం తన పని తాను చేసుకుపోతుందని డైలాగులు చెప్పవచ్చు కానీ.. కేసు ఇంత కాలం ఆగడానికి కారణం సంయమనం పాటించాలని అనడమే. తర్వాత ఇంకా ఎన్ని కేసులు లైన్లో ఉన్నాయో తెలియదు. మొత్తం మూడు కేసులకు గవర్నర్ అనుమతి ఇచ్చారని చెబుతున్నారు. ఆ కేసులేంటో తర్వాత వెలుగులోకి రావొచ్చు. తనపై నమోదైన కేసు విషయంలో కేటీఆర్ చాలా ముందు నుంచీ మాట్లాడుతున్నారు. అనేక సార్లు వివరణ ఇచ్చారు. ఫార్ములా ఈ రేసు తో హైదరాబాద్‌ను ప్రపంచపటంలో పెట్టడానికే ఖర్చు పెట్టాం కానీ అందులో అవినీతి లేదంటున్నారు. అసలు ఏసీబీ అంటే ఏమిటో తెలుసా అని రేవంత్ ను ప్రశ్నిస్తున్నారు. యాంటీ కరప్షన్ బ్యూరో అని రేవంత్ కు తెలియదని సెటైర్లు వేస్తున్నారు. అయితే ప్రభుత్వం తన వెర్షన్ తాను చెబుతున్నారు. ఎన్నికలకోడ్ అమల్లో ఉన్న సమయంలో ఈసీ అనుమతి లేకుండా రూపాయి కూడా చెల్లింపులు చేయకూడదు.. ఎలా చేశారు?. అసలు ఈసీ సంగతి దెవుడెరు.. ఆర్థిక శాఖ కానీ..కేబినెట్ అనుమతి కానీ తీసుకోలేదు. ఊరకనే నోటి మాట ద్వారా ట్రాన్స్ ఫర్ చేసేశారు. అదీ కూడా విదేశీ కంపెనీకి ఇండియన్ కరెన్సీ. ఇలా చేసినందుకు ఆర్బీఐకి రూ. ఎనిమిది కోట్ల ఫైన్ కట్టాల్సి వచ్చింది. ఇదంతా తప్పు కాదు. అధికారంలో ఉన్నప్పుడుప ప్రజధనాన్ని ఇలా లెక్కాపత్రం తరలించడానికి అధికారం ఎలా ఉంటుంది?. ఆర్బీఐ నిబంధనల గురించి ఎవరికీ తెలియదా ?
రాజకీయంలో కన్నూ మిన్నూ కానరాకపోతే అలాంటివే జరుగుతూంటాయి…!
ఫార్ములా ఈ రేసుతో హైదరాబాద్ ఫార్ట్యూన్ మారిపోయిందని.. కేటీఆర్ అంటున్నారు. కుప్పలుతెప్పలుగా డబ్బులు వచ్చాయని నీల్సన్ కంపెనీ సర్వే చేసి చెప్పిందట. మనకు ఆదాయం వచ్చిందో లేదో వేరే ఏదోకంపెనీ సర్వే చేసి చెప్పిందని కేటీఆర్ సర్టిఫికెట్ తీసుకు రావడం అంటే గొప్ప విషయమే. ఫార్ములా వన్ కు.. ఫార్ములా ఈ వన్ కు సంబంధం లేదు. రెండింటికి … అసలు కారుకు… బొమ్మకారుకు ఉన్నంత తేడా ఉంది. ఈ రేసు కోసం సగం మంది హైదరాబాదీల్ని నెల రోజులు టార్చర్ పెట్టారు. ఆటు నుంచి ఇటు రావడానికి ఉన్న మార్గాన్ని మూసేసి రేసులు నిర్వహించారు. అప్పుడు తిట్టుకోని జనం లేరు. ఇలా ప్రజల్ని టార్చర్ పెట్టడమే కాదు.. ప్రజాధనాన్ని కూడా వందల కోట్లు ధారబోశారు. ఆ రేసు వల్ల ఎలాంటి ఇన్ కమ్ ప్రభుత్వానికి జనరేట్ అయిందో ఎవరికీ తెలియదు. ఆ రేసు నిర్వహణ వల్ల కొంత మంది సెలబ్రిటీలు వచ్చి హోటల్ రూములు బుక్ చేసుకుని ఉంటారు. అది తప్ప.. ఇంకేదైనా ఇన్ కమ్ జనరేటర్ అయ్యే అవకాశం ఉందా?. కొత్తగా ఈ రేసుల సంబంధిత రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు వచ్చారా? అన్నది చెప్పాల్సిన ఉంది. ఈవీ రంగంలో వచ్చిన పెట్టుబడులకు.. ఈ రేసుకు కేటీఆర్ లింక్ పెట్టారు. కానీ అమరారాజా కంపెనీ తెలంగాణకు ఎందుకు వచ్చిందో మిగతా అందరి కన్నా కేటీఆర్ కు ఎక్కువగా తెలుసు. మాతృభూమి మీద ప్రేమతో .. ప్రజలకు ఉపాధి కల్పించాలని తిరిగి వచ్చి ఓ ఇంటర్నేషనల్ బ్రాండ్ సృష్టించిన పారిశ్రామికవేత్తను రాజకీయ కారణాలతో వేధించి ఓ సైకో పాలకుడు తరిమేస్తే ఆయన తెలంగాణకు వచ్చారు. ఈ-కార్ రేసులు చూసి కాదు.
ఏసీబీ కేసు ఎలా వచ్చిందో కేటీఆర్‌కూ బాగా తెలుసు!
ఫార్ములా రేసుల వల్ల ఎంత ఉపయోగం అనేది కేటీఆర్ అంతా చెప్పారు. అసలు కేసుపై మాత్రం మాట్లాడలేదు. రేసుల వల్ల లాభమో.. నష్టమో తర్వాత. లాభమొచ్చినా.. నష్టంవచ్చినా ఎవరూ కేసులు పెట్టరు. నష్టం వచ్చినా అతి తప్పుడు నిర్ణయంగా విమర్శిస్తారేమో కానీ దానికి కేసులు పెట్టరు. ఇక్కడ సమస్య వేరు.. రూ. 55 కోట్ల ప్రజాధనం మాయమయింది. దాన్ని తామే ఇచ్చామని రేసుల కోసమని చెబుతున్నారు. దానికే ఇచ్చామని నోటి మాట ద్వారా చెబుతున్నారు.. కానీ కొట్టేశారని ఏసీబీ అంటోంది. కొట్టేయలేదు అని చెప్పాలంటే… ఎందు కోసం పంపుతున్నామో.. ఎవరి అనుమతి తో పంపుతున్నామో రికార్డులు ఉండాలి. అవేమీ లేవు. మరి దొంగతనం అనడానికి అవకాశం ఇచ్చేలా చేసింది కేటీఆరే. మళ్లీ గెలుస్తామన్న నమ్మకంతో ఆయన ఈ పని చేసి ఉండవచ్చు.. గెలవలేదు.. ఇప్పుడు ఇరుక్కుపోయారు. ఇలాంటి కేసుల్లో ఏసీబీ ఎలా వస్తుందని ఆయన గింజుకుంటున్నారు. స్వయంగా దొరికిపోయాక.. ఏసీబీ ఏంటి.. సీఐడీని అయినా తెచ్చి పెట్టవచ్చు. కానీ ముందుగా చెప్పుకున్నట్లుగా భూమి గుండ్రంగా ఉంటుందన్న ఫార్ములా ఇక్కడ వర్కవుట్ అయింది. నా పైన ఏసీపీ కేసా అని కేటీఆర్ ఫీలవుతున్నారేమో కానీ ఇదే సమయంలో…. రేవంత్ రెడ్డిని ఓటుకు నోటు కేసులో ట్రాప్ చేసినప్పుడు కూడా ఏసీబీ కేసు పెట్టారు. అప్పుడు చాలా మంది ఇదే ప్రశ్న వేశారు. ఏసీబీ అంటే ప్రభుత్వ ఉద్యోగుల అవినీతిపై నిఘా వేయడానికి పెట్టిన వ్యవస్థ. మరి డబ్బులకు అమ్ముడుపోతానని పిలిచి మరీ ఎమ్మెల్సీ స్టీఫెన్సన్ రేవంత్ రెడ్డిని ట్రాప్ చేస్తే ..ఏసీబీ కేసు ఎందుకు పెట్టారు?. దాన్ని ఎలా కొనసాగిస్తున్నారు? అంటే.. చట్టంలో ఆ వెసులుబాటు ఉండటం వల్లనే. అలాంటి వెసులుబాటును ఇప్పుడు ఏసీబీ తాము కూడా ఉపయోగించుకుంటూ ఉండవచ్చు. ఈ మాత్రం తెలియకుండా.. ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అనుకోలేం కదా. కేటీఆర్ ఇవాళ కాకపోతే రేపైనా ఈ వ్యవహారంలో ఖచ్చితంగా బాధ్యత వహించాల్సిందే. ఇప్పుడు అక్కడ డబ్బులు పోయాయి..ఎవరు వెనక్కి తెస్తారన్నది కీలకం. మిగతావన్నీ అప్రస్తుతం. ఫార్ములా ఈ రేసు చైర్మన్ సీఎం రేవంత్ ను కలిసినా.. కలవకపోయినా పెద్ద తేడా ఉండదు.. కార్పొరేట్ సంస్థలకే వర్కవుట్ కాని స్పాన్సర్ షిప్ .. ప్రజలు పన్నుల ద్వారా రూపాయి రూపాయి కట్టే సొమ్ముతో వందర కోట్లు కట్టేసి… ఎలా వర్కవుట్ చేసుకుందామని?
ఖచ్చితంగా రాజకీయమే..కానీ కేటీఆర్‌దే చాన్స్ ఇచ్చారు!
ఈ కేసులో బలం ఉందా లేదా అన్న సంగతిని పక్కన పెడితే ఇది ఖచ్చితంగా రాజకీయ ప్రేరేపితమైన కేసే అనుకోవచ్చు. కానీ చేజేతులా దొరికింది మాత్రం కేటీఆరే. ఆయనలో అహంకారం పాళ్లు కాస్తే ఎక్కువనేనని అందరూ అంటూంటారు. అది ఆత్మ విశ్వాసం అని ఆయన చెబుతూంటారు. కేసీఆర్ ఫామ్ హౌస్ కే పరిమితమయిన ఉంటే.. ప్రభుత్వాన్ని కేటీఆర్ నడిపేవారు. అన్నీ ఆయనే చూసేశారు. తాను రాజునని.. తానేం చేసినా తిరుగు ఉండదని అనుకున్నారు. అలా అనుకుని చేసిన పనులే ఇప్పుడు వెంటాడుతున్నాయని అనుకోవచ్చు. అలాంటి పనుల్లో ఈ డబ్బులు పంపేయమని ఇచ్చిన ఆదేశాలు చాలా చిన్నవి. కేసులతో ప్రతిపక్ష నేతల్ని ఇబ్బంది పెట్టడం అనేవి చాలా పెద్దవి. రేవంత్ రెడ్డిని ఎన్ని సార్లు.. ఎలాంటి సిల్లీ కేసులతో అరెస్టు చేశారో.. రేపు కేటీఆర్ ను అరెస్టు చేసిన వెంటనే చాలా మంది గుర్తుకు తెచ్చుకుంటారు. ఓటుకు నోటు కేసు దగ్గర నుంచి ఫామ్ హౌస్ పై డ్రోన్ ఎగురవేశారన్న కేసు వరకూ ఎన్ని సార్లు అరెస్టు చేశారో లెక్క పెట్టుకుంటారు. కొడంగల్ లో తన ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో అర్థరాత్రి రెండు గంటలకు ఆయనను అరెస్టు చేసిన దృశ్యాలను వైరల్ చేసుకుంటారు. బండి సంజయ్ ను కారణం లేకుండా ఆయన కార్యాలయంలోని వారందరిపై ఇష్టం వచ్చినట్లుగా దాడులు చేసి మరీ అరెస్టు చేసిన వైనాన్ని గుర్తు చేసుకుంటారు. టెన్త్ పేపర్ల మాల్ ప్రాక్టీస్ కేసు పెట్టడానికి బండి సంజయ్ వాట్సాప్ కు ఉద్దేశపూర్వకంగా పేపర్ షేర్ చేసి.. అదే కారణంగా అరెస్టులు చేసిన వైనాన్ని గుర్తు పెట్టుకుంటారు. అధికారంలో ఉన్నప్పుడు చేసిన ఇలాంటి విన్యాసాల వల్లనే ఇప్పుడు పరిణామాలు ఎదురవుతున్నాయి.
జైలుకెళ్లగానే జీవితం అంతమైపోదు. ఇంకా చెప్పాలంటే రాజకీయంగా చాలా గొప్ప అవకాశం వచ్చినట్లవుతుంది. జైలుకెళ్లిన చాలా మంది రాజకీయ నేతలు సీఎంలు అవుతున్నారు. అయితే జైలుకెళ్లి జీవితాల్ని నాశనం చేసుకున్న వారి గురించి ప్రచారం జరగడం లేదు. రేవంత్ రెడ్డి ఏడాది పాటు ఎవరి జోలికి వెళ్లకూడదని కూలింగ్ పీరియడ్ పెట్టుకుని ఉంటారు. ఇప్పుడు హీట్ పెంచుతున్నారు. కేటీఆర్ చెప్పినట్లుగా ఇది సిల్లీ కేసే అయితే.. అంత కంటే తీవ్రమైన కేసులు పెట్టడానికి అవసరమైన సరంజామా అంతా రెడీ చేసుకుని ఉంటారు. కేసీఆర్ ను జైల్లో పెడతానని విపక్షంలోనే సవాల్ చేశారు. ఇప్పుడు అది కూడా నెరవేర్చి ఉండవచ్చు. కానీ ఇది అన్యాయం అని నినదించే హక్కు మాత్రం ఎప్పుడో … కోల్పోయారు. గతంలో మీరు చేసిందేమిటి అని ప్రశ్నించడానికి ఎప్పుడో అవకాశం ఇచ్చారు. ఇలాంటి పరిస్థితి రానే రాదు.. తెలంగాణకు మేమే రాజులం అనుకోవడం వల్లే ఈ సమస్య వచ్చింది.
ఈ పరిణామాలన్నీ రాజకీయ నేతలకు ఓ గుణపాఠం లాంటివి. తాము అధికారంలో ఉన్నప్పుడు అధికారం శాశ్వతం అని ఎగిరెగిరిపడకూడదు. అధికారాన్ని దుర్వినియోగం చేసి ప్రత్యర్థుల్ని వేధించకూడదు. ప్రజాస్వామ్యంలో ప్రజలే పాలకులు. వారు చేసే రాజకీయాల్ని ఇంకే రాజకీయ నాయకుడూ చేయలేరు. వారు అలా ప్రభుత్వాల్ని మార్చేసి.. “ గ్రేట్ లాఫింగ్ షో”ను ఎంజాయ్ చేస్తూంటారు. ఇప్పుడు జరుగున్నది అదే.