భారతదేశ అభివృద్ధికి ప్రధాన ఆటంకం రాజకీయ వ్యవస్థేనని గట్టిగా వాదించే వాళ్లు మనకు అడుగడుగునా కనిపిస్తూ ఉంటారు. మన దేశ తరహా కమ్యూనిస్టు పార్టీల పాలనలో ఏక పార్టీ వ్యవస్థ అమల్లో ఉన్న చైనా అమెరికా స్థాయిలో ఎలా అభివృద్ధి చెందిందో ఇలాంటి వారు కథలు కథలుగా చెబుతూ ఉంటారు. యాభై, అరవై ఏళ్ల కిందట చైనా కన్నా భారత్ ఎంతో మెరుగైన దేశం. ఇప్పుడు తిరిగి చూస్తే చైనాలో బుల్లెట్ రైళ్లు ఆ మూల నుంచి ఈ మూలకు పరుగులు పెడుతూంటాయి. జీడీపీ అమెరికాతో పోటీ పడుతూ ఉంటుంది. ఇవన్నీ చూసిన తరవాత నిజంగా మనం అలా ఎదగకపోవడానికి రాజకీయ వ్యవస్థ రాజకీయాలే కారణమని గట్టి అభిప్రాయమని ఎవరైనా వస్తారు. అది నిజమే కాదో కానీ మన దేశానికి, అభివృద్ధికి ఈ రాజకీయ వ్యవస్థలో భాగం అయిన ఎన్నికల ఎప్పటికప్పుడు దేశ అభివృద్ధి పరుగుకు అడ్డం పడుతున్నాయన్నది మాత్రం వంద శాతం నిజం.
మనది ఎన్నికల స్వామ్య దేశం !
మనది ప్రజాస్వామ్య దేశం. గ్రామ స్థాయి నుంచి ప్రజాపాలన ఉండాలని రాజ్యాంగకర్తలు అనుకున్నారు. దానికి తగ్గట్లుగా ఏర్పాట్లు చేశారు. గ్రామ పంచాయతీలు, మండల పరిషత్లు, జిల్లా పరిషత్లు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, రాష్ట్రాల అసెంబ్లీలు.. అంతిమంగా పార్లమెంట్. ఇవి ప్రజాస్వామ్యంలో ఎన్నికలు జరగాల్సిన వ్యవస్థలు. ఇక ప్రభుత్వాలు సహకార సంఘాలు, సాగునీటి సంఘాలు, పాఠశాల అభివృద్ధి కమిటీలు ఇలా అనేక ఎన్నికలు పెడుతూ ఉంటాయి. వాటి సంగతి పక్కన పెడితే పంచాయతీ నుంచి పార్లమెంట్ వరకూ జరిగే ఎన్నికలు ఒకే సారి జరగడం లేదు. అన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ఒకే సారి జరగడం లేదు. పార్లమెంట్ ఎన్నికలూ ఓ మూడు, నాలుగు నెలల భారీ ప్రక్రియగా సాగుతోంది. ఫలితంగా ఐదేళ్ల పాటు ఎన్నికల జాతరే కనిపిస్తోంది. ఉదాహరణకు తెలంగాణనే ఉదాహరణగా తీసుకుందాం.. 2023 నవంబర్ లో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. అంతకు ఆరు నెలల ముందు ఎన్నికల వాతావరణం ఏర్పడింది. అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన ఐదు నెలలకు పార్లమెంట్ ఎన్నికలు వచ్చాయి. అవి అయిపోయిన ఆరు నెలలకు పంచాయతీ ఎన్నికలు మండల, జిల్లా స్థాయి ఎన్నికలు వస్తున్నాయి. ఆ తర్వాత మరో ఆరు నెలలకు మున్సిపల్ ఎన్నికలు, గ్రేటర్ ఎన్నికలు జరుగుతాయి. అంటే.. 2023లో ప్రారంభమైన ఎన్నికల హడావుడి 2025 చివరి వరకూ ఉంటుంది. అంటే అప్పటికి మూడేళ్లు అయిపోతాయి. మళ్లీ అసెంబ్లీ ఎన్నికలకు రాజకీయ పార్టీలు రెడీ అయిపోతాయి. అంతే మరి పాలన సాగెదెప్పుడు?. ప్రత్యేకంగా పాలన అంటూ ఏమీ ఉండదు. ఎన్నికల మధ్యలో విరామం దొరికేతే రెండు ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేసుకుంటారు. నాలుగు పథకాలు ప్రారంభిస్తారు. అంతా ఎన్నికల కోణంలోనే సాగుతుంది. ఇది ఒక్క తెలంగాణ పరిస్థితి కాదు. మొత్తం దేశం లో అన్ని రాష్ట్రాల పరిస్థితి.
ఎన్నికల కోసం పాలన.. ఎన్నికల కోసం అవినీతి.. ఎన్నికల కోసం రాజకీయం
ఎన్నికలు అంటే మన దేశంలో ఓ పండగ, ఇంకా చెప్పాలంటే డబ్బుల పండగ. పంచాయతీ ఎన్నికలు అయినా ఇజ్జత్ కు పోయి లక్షలకు లక్షలు ఖర్చు చేస్తారు. నియోజకవర్గ రాజకీయాల కన్నా గ్రామ రాజకీయాలు ఇంకా ఎక్కువ ప్రభావవంతంగా ఉంటాయి. జిల్లా , మండల, నియోజకవర్గ స్థాయిలో ఉండే రాజకీయాలు.. వాటిలో డబ్బుల ప్రభావం గురించి చెప్పాల్సిన పని లేదు. విచ్చలవిడిగా ఓట్లను కొనేస్తున్నారు. మరి ఈ సొమ్ము అంతా ఎక్కడి నుంచి వస్తుంది. రాజకీయ అవినీతితో ఈ సొమ్ము అంతా సేకరిస్తారు. అవినీతి చేసే సొమ్ములో కొంత రాజకీయం కోసం ఖర్చు పెడతారు. అసలు అవినీతి ఎందుకు పాల్పడుతున్నారు అంటే.. రాజకీయం కోసమే అంటారు. ఇప్పుడు రాజకీయం అంటే చాలా కాస్ట్ లీ అయిపోయింది. సంపాదించుకోకపోతే రాజకీయంగా ఎలా మనుగడ సాగిస్తామని వాదిస్తారు. ఈ ఎన్నికలు ఐదేళ్ల పాటు సాగుతూనే ఉంటాయి.. వారు సంపాదించుకుని ఖర్చు పెడుతూనే ఉంటారు. అదే రాజకీయం అన్నట్లుగా మారిపోయింది. పార్లమెంట్ ఎన్నికలు ముగిసి ఇప్పటికి ఆరు నెలలు కాలేదు. ఇప్పటికి ఐదు రాష్ట్రాల ఎన్నికలు జరిగాయి. రెండు నెలల్లో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. తర్వాత బీహార్ ఎన్నికలు ఉన్నాయి. ఆ తర్వాత మరో ఐదు రాష్ట్రాల ఎన్నికలు.. ఇలా సిరీస్ సాగుతూనే ఉంటుంది. అందరూ ఆయా రాష్ట్రాల ఎన్నికల చుట్టూనే తిరుగుతూ ఉంటారు. ఈ జాడ్యానికి కారణం ఎవరు..? ఎన్నికల వ్యవస్థే కారణం. వరుసగా ఆగకుండా జరుగుతున్న ఎన్నికల వ్యవస్థే కారణం. మరి మన దేశానికి ఎన్ని ఎన్నికలు అవసరమా ?. ఈ డౌట్ చాలా మందికి వచ్చింది. అన్ని ఎన్నికలు ఒక్క సారి పెడితే తర్వాత అంతా రాజకీయాలు మానేసి అందరూ పాలనపై దృష్టి పెడతారు కదా అని అనుకుంటూ ఉంటారు. ఇప్పుడు బీజేపీ అలాంటి ఆలోచనల్ని కార్యాచరణలోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తోంది. కానీ అయోధ్య సమస్య పరిష్కరించిన తేలికగా ఈ పక్రియ కాదు. కశ్మర్ కు ప్రత్యేక ప్రతిపత్తి బంధం నుంచి తప్పించి ఇండియాలో కలిపినంత సులువు కూడా కాదు. బీజేపీ అనేక సవాళ్లను దాటుకుని ఈ వన్ నేషన్ – వన్ ఎలక్షన్ ను నిర్వహించాల్సి ఉంటుంది. ఇప్పటికి కేబినెట్ అనుమతించింది. అసలు కథ పార్లమెంట్ లో బిల్లు ప్రవేశ పెట్టినప్పటి నుండి వస్తుంది.
జమిలీకి పద్దెనిమిది రాజ్యాంగ సవరణలు – ఆచరణలో ఎన్నో సమస్యలు
దేశంలో జమిలీ ఎన్నికలు అసాధ్యమని వాదించేవారు మెజార్టీ ఉంటారు. ఎందుకంటే రాజ్యాంగపరంగా ఉన్న సమస్యలే. దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పుడు జమిలీ ఎన్నికలే జరిగేవి. కానీ ప్రభుత్వాలు మధ్యలో కూలిపోవడం.. రాజకీయ కారణాలతో ముందుగానే ఎన్నికలకు వెళ్లడం వంటి రాజకీయాలతో రాష్ట్రాలకు రాష్ట్రాలకు ఎప్పుడు ఎన్నికలు జరుగుతాయో తెలియని పరిస్థితి వెళ్లిపోయాయి. ఫలితంగా మొత్తం వ్యవస్థ కలగాపులగంగా మారిపోయింది. ఇప్పుడు దాన్ని సరి చేయాలంటే పద్దెనిమిది రాజ్యాంగ సవరణలు చేయాల్సి ఉంటుంది. అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు, పార్లమెంట్ కు ఎన్నికలకు ఒకే సారి నిర్వహించాలంటే.. ముందు కొన్ని రాష్ట్రాల ప్రభుత్వాల పరిమితిని తగ్గించాలి. మరికొన్ని రాష్ట్ర ప్రభుత్వాల పరిమితి పెంచాలి. కానీ పెంచడానికి అనుమతి లభిస్తుంది కానీ తగ్గించడం సాధ్యం కాదు. ఎందుకంటే ఐదేళ్లకు ప్రజలు ప్రభుత్వాలను ఎన్నుకున్నారు. తర్వాత మార్చే రాజ్యాంగ సవరణ ఇప్పుడు ఉన్న ప్రభుత్వాలకు చెల్లుబాటు కాదు. అలాగే జమిలీ ఎన్నికలు ఒక్కసారే నిర్వహిస్తే మధ్యలో ప్రభుత్వం పడిపోతే పరిస్థితి ఏంటి ?. రాష్ట్ర ప్రభుత్వాలు కాదు అసలు కేంద్ర ప్రభుత్వమే పడిపోతే ఏం చేస్తారు ?. మళ్లీఎన్నికలు నిర్వహిస్తే మిగిలిన కాలానికే నిర్వహించేలా పెడితే అసలు లక్ష్యం దెబ్బతిన్నట్లే కదా. ఇలా ఆలోచిస్తూ పోతూంటే వచ్చే సమస్యలు వెయ్యి పేజీలకుపైగా ఉన్నాయని రామ్ నాథ్ కోవింద్ కమిటీ తేల్చింది. వాటన్నింటికీ పరిష్కారాలు వెదుకుతూ పోతే పద్దెనిమిది రాజ్యాంగ సవరణలు అవసరం అయ్యాయని తేల్చారు. ఇప్పుడు పార్లమెంట్ లో మూడింట రెండు వంతుల మెజార్టీతో ఆ రాజ్యాంగ సవరణల్ని చేయాల్సి ఉంది.
బీజేపీ అనుకుంటే చేయగలదు – కానీ !
భారతీయ జనతా పార్టీకి ఉన్న సామర్థ్యం మేరకు చూస్తే తల్చుకుంటే రాజ్యాంగ సవరణల్ని కూడా సులువుగానే పూర్తి చేయవచ్చు. అధికారికంగా ఉన్న బలం ఎంత అన్నది సమస్య కాదు. జమిలీ ఎన్నికలకు ఓటింగే అవసరం అయితే ఆ సమయానికి బీజేపీ విధానాలకు మెచ్చి వచ్చే వారు ఎందరో ఉంటారు. మూడింట రెండు వంతుల మెజార్టీ వస్తుంది. అందుకే జమిలీ ఎన్నికలు ఖాయమని అందరూ గట్టిగా నమ్ముతున్నారు. అయితే ఇల్లు అలకగానే పండగ కాదు. ఆ తర్వాతే అసలు రాజకీయం ఉంటుంది. జమిలీ ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారన్నదాని దగ్గర నుంచి అన్ని రకాల సవాళ్లను ఎదుర్కోవాలి. ముందుగా కేంద్రం ప్రభుత్వం కూడా ఎన్నికలకు వచ్చే అవకాశం లేదు. ఇప్పటి నుంచి ప్రారంభిస్తే నాలుగేళ్ల కు పనులు అన్నీ ఓ కొలిక్కి వస్తాయని అనుకోవచ్చు. జమిలీ వచ్చినా 2029లోనే వస్తాయని చంద్రబాబు తేల్చేశారు. నిజానికి ఏపీలో జరుగుతోంది జమిలీ ఎన్నికలే కాబట్టి పెద్దగా మార్పు ఉండదు. ఓ సారి ఎన్నికలు పూర్తయిన తర్వాతే అసలు సవాళ్లు తెర ముందుకు వస్తాయి.
ఆచరణ బాగుంటే దేశానికి కూడా మంచిదే !
ఆలోచన బాగుటుంది కానీ.. ఆచరణలో ఉండే సమస్యలు బయటకు వచ్చినప్పుడు వాటిని ఎదుర్కోవడం కష్టం. చిన్న రాష్ట్రాలు ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాల్లో ప్రభుత్వాలు ఎప్పుడూ అనిశ్చితంగానే ఉంటాయి. ఇటీవలి కాలంలో కొన్ని ఏకపక్ష తీర్పులు ప్రజలు ఇచ్చారు కానీ మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో కూడా ఎవరికీ మెజార్టీ రాని పరిస్థితులు ఉన్నాయి. ఇలాంటి వాటిలో ప్రభుత్వాల మనుగడపైనే ఎక్కువగా వన్ నేషన్ – వన్ ఎలక్షన్ విధానం సక్సెస్ అవుతుందా లేదా అన్నది ఆధారపడి ఉంటుంది. దేశ ప్రజాస్వామ్యానికి సంబంధించినంత వరకూ వన్ నేషన్ – వన్ ఎలక్షన్ అనేది అతి పెద్ద సవాల్ తో కూడిన సంస్కరణ. ఇది సక్సెస్ అయితే దేశ వ్యవస్థలోనే మార్పు వస్తుంది. ఎన్నికలకు ప్రాధాన్యం తగ్గిపోతుంది. ఐదేళ్లకు ఓ సారి వచ్చే విషయంగానే చూసి.. మిగతా సమయం అంతా రాజకీయాలకు ప్రాధాన్యత తగ్గించేస్తారు. రాష్ట్రాల కోసం.. దేసం కోసం.. గ్రామాల కోసం అందరూ పనులు చేసుకుంటారు. అలాగే రాజకీయం కోసం చేసే ఖర్చు, అందు కోసం చేసే అవినీతి కూడా తగ్గిపోతుంది. వన్ నేషన్ – వన్ ఎలక్,న్ ద్వారా వచ్చే ఫలితాల గురించి ఆలోచిస్తే.. జరిగితే ఎంత బాగుండు అనిపిస్తుంది. కానీ అవి ఎంత క్లిష్టమో కళ్ల ముందు కనిపిస్తూనే ఉన్నాయి. అందుకే దేశానికి మంచి జరగాలని.. వ్యవస్థ మరింత బలోపేతం కావాలని.. వన్ నేషన్ – వన్ ఎలక్షన్ ద్వారా మన ప్రజాస్వామ్యానికి పట్టిన అవలక్షణాలు తొలగిపోవాలని కోరుకుందాం. ఈ ప్రయత్నాలకు మన వంతు మద్దతు ఇద్దాం !