ఇండియాలో కేజీ బియ్యం రూ. వంద పలుకుతుంది కానీ ఒక్క జీబీ డేటా మాత్రం ఐదు రూపాయలకే వస్తుంది. మీరు సమయం అంతా యూట్యూబ్ వీడియోలు.. సోషల్ మీడియా మీదే గడపుతామంటే డేటా కూడా ఊరకనే ఇచ్చేందుకు చాలా కంపెనీలు ఆఫర్లు పెడుతున్నాయి. ఎందుకంటే మన దేశంలో జనాభా ఎక్కువ. వినియోగం ఎక్కువ. కానీ ప్రొడక్టివిటీ తక్కువ. మ్యాన్ పవర్ తక్కువ. ఈ సోమరి తనాన్ని అడ్డం పెట్టుకునే రాజకీయ నాయకులు కూడా రాజకీయాలు చేస్తున్నారు. దేశానికి సంబంధం లేదని అంశాలను.. సోషల్ మీడియా ద్వారా బుర్రల్లోకి ఎక్కించి తమ పబ్బం గడుపుకుంటున్నారు. దేశ భవిష్యత్ గురించి రంగు రంగుల మాటల్లో చెప్పి నమ్మిస్తూ ఉంటారు. ఎదురుగా మాత్రం.. విద్య, వైద్యం కోసం కూడా అల్లాడిపోతున్న పేదవాళ్లు కనిపిస్తూనే ఉంటారు. కానీ దాన్ని ఎవరూ నమ్మరు. సోషల్ మీడియాలో ఒకడు ఓ వీడియో పెట్టి.. ఇది అపోలో ఆస్పత్రి అనుకున్నారా కాదు.. మా బాపట్ల ఆస్పత్రి అంటే నమ్మేస్తాం. నిజంగా బాపట్ల ఆస్పత్రికి వెళ్తే పాన్ పరాగ్ మరకలతో … చచ్చే స్థితిలో వచ్చినా చూసేందుకు వైద్యులు కూడా ఉండని ఆస్పత్రి కనిపిస్తుంది. అది రియాలిటీ . కానీ ఆన్ లైన్ లో ఏం కనిపిస్తుందో.. అదే నిజమని నమ్మే ప్రపంచంలోకి విజయవంతంగా మనల్ని రాజకీయ పార్టీలు తీసుకెళ్తున్నాయి. మాయా ప్రపంచంలో.. ఊహా ప్రపంచంలో విహరింప చేస్తూ అదే నిజమని .. మనకు అనిపించేలా చేసే రాజకీయ పార్టీలు చేస్తున్న గారడీ ఎన్నికల్లో ఇప్పుడు మనం ఉన్నాం అంటే అతిశయోక్తి కాదు.
ఆఫ్ లైన్ ప్రచారం షోకే.. అసలు ప్రచారం ఆన్ లైన్లోనే
భారత్లో ఇప్పుడు గతంలో ఎప్పుడూ జరగనంత హై టెన్షన్ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ సారి ఎన్నికల్లో గెలవడానికి రాజకీయ పార్టీలు ఎక్కువగా ఆధారపడుతోంది బహిరంగ సభలు, ర్యాలీలు, రోడ్ షోల మీద కాదు. అవి షో చేయడానికి మాత్రం చేస్తున్నారు. మా సభలకు ఇంత జనం వస్తున్నారు. స్పందన మాకు ఎక్కువగా ఉందని చెప్పుకోవడానికి చేస్తున్నారు. అక్కడా గ్రాఫిక్స్ నిపుణులు రంగంలోకి దిగిపోయారు. రాజకీయ నాయకులు ఈ ఆఫ్ లన్ ప్రచారం చేసినా సోషల్ మీడియాలో ప్రచారంపైనే ఎక్కువ కేంద్రీకరిస్తున్నారు. విచ్చవిడిగా ఖర్చు చేస్తున్నారు. సొంత సైన్యాలే కాదు.. అద్దె ఇన్ ఫ్లూయన్సర్స్ పెరిగిపోతున్నారు. ఈ పరిస్థితి ఎన్నికలపై తీవ్ర ప్రభావం చూపించబోతోందని నిపుణులు ఇప్పటికే తేల్చేశారు. ప్రపంచం మొత్తం మీద చాలా దేశాల్లో జనాభా తగ్గిపోతున్నారు. కానీ మన దేశంలో మాత్రం స్థిరంగా పెరుగుతున్నారు. ఇప్పటికి మన దేశ జనాభా 140 కోట్లు దాటిపోయింది. పాపం పేదరికంలో ఉన్నారని మన ప్రభుత్వాలు 90 కోట్ల మందికి ఉచిత రేషన్ ఇస్తున్నామని గొప్పగా ప్రకటిస్తూ ఉంటాయి. అదే మధ్యతరగతి ప్రజలు బయట కొనాలంటే కేజీ ఆరవై నుంచి వంద పలుకుతోంది. అయితే మన దేశంలో వన్ జీబీ డేటా చాలా తక్కువ. అమెరికాలో ఇంటర్నెట్ కోసం.. వన్ జీబీ జేటా వాడుకుంటే ఆరు డాలర్లు ఖర్చవుతుంది. అంటే దాదాపుగా ఐదు వందల రూపాయలు. మన దేశంలో వన్ జీబీ డేటా పదమూడు రూపాయలకే వినియోగదారులకు లభిస్తోంది. ప్రపంచంలో డేటా అత్యంత చీప్ గా లభిస్తున్న దేశాల్లో భారత దేశం మూడో స్థానంలో ఉంది. చవకగా లభిస్తున్న డేటా, స్మార్ట్ ఫోన్ల విప్లవంతో భారత పౌరులంతా ఆన్ లైన్ లోకి వచ్చేశారు. భారత్ లో ఉన్న ప్రజల్లో 880 మంది ఆన్ లైన్ లో ఉంటున్నారు. వీరిలో 442 మంది గ్రామీణ ప్రాంతాల ప్రజలు. అంటే వారి చేతుల్లో ఫోన్ ఉంటుంది. అది చాలు అన్నట్లుగా సోషల్ మీడియా విస్తరించింది. ఆ సోషల్ మీడియాను రాజకీయపార్టీలు ఊహించని విధంగా వాడుకుంటున్నాయి. రీల్స్, యూట్యూబ్ వీడియోస్, ఇన్ ఫ్లూయన్సర్స్, పాడ్ కాస్ట్ ఇలా ఏ పద్దతిలో చాన్స్ ఉంటే ఆ పద్దతిలో రాజకీయ పార్టీలు ప్రచారాలు చేస్తున్నాయి.
ప్రజల చేతుల్లో స్మార్ట్ ఫోన్ – రాజకీయ పార్టీల మైండ్ గేమ్
భారత దేశ్ ప్రజలు ఫోన్లో ఏది చూపిస్తే అది నిజమని నమ్మే అమాయకత్వంలోనే ఇంకా ఉన్నారు. కళ్లు ముందు కనిపించిన దాన్ని కూడా వారు నమ్మడం లేదు. అంత మాయా ప్రపంచంలోకి పంపేస్తున్నాయి రాజకీయ పార్టీలు. అందుకే సోషల్ మీడియా ద్వారా ఓటర్లను ప్రభావితం చేయడానికి రాజకీయ పార్టీలు చేస్తున్న ప్రయత్నం అంతా ఇంతా కాదు. రాజకీయ పార్టీలు అసలు ప్రచారం కన్నా సోషల్ మీడియాలో ఓటర్లను ఎలా ప్రభావితం చేయగలుగుతున్నామన్నది చూసుకుంటున్నారు. మన దేశంలో మొదటి సోషల్ మీడియా ఎలక్షన్ గా 2014 ఎన్నికలను చెప్పవచ్చు. అప్పట్లో నరేంద్రమోదీ ని ప్రధాని అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత సోషల్ మీడియాలో జరిగిన ప్రచారం .. ఆయన ఇమేజ్ ను ఊహించనంతగా పెంచిందనేది అందరూ అంగీకరించే విషయం. సోషల్ మీడియాను ఉపయోగించుకుంటే రాజకీయంగా ఎలా లాభపడవచ్చో బీజేపీ చూపించిన ఎన్నిక అది. సోషల్ మీడియాను వినియోగించేవారు మన దేశంలో చాలా ఎక్కువ. 229 మిలియన్ ఇన్ స్టా యూజర్స్ ఉన్నారు. 535 మిలియన్ వాట్సాప్ యూజర్స్, 315 మిలియన్ల మంది ఫేస్ బుక్ యూజర్స్, 462 బిలియన్ యూట్యూబ్ యూజర్స్ ఉన్నారు. ఒక్కరు ఒక్కటే వాడాలని లేదు. ఒక్కొక్కరు నాలుగింటిలోనూ యాక్టివ్ గా ఉంటున్నారు. అందుకే ఈ సోషల్ మీడియా వ్యవస్థలన్నింటిలోనూ రాజకీయ పార్టీలు వేలు పెట్టాయి. సొంత వ్యవస్థల్ని ఏర్పాటు చేసుకున్నాయి.
ఇన్ప్లూయనర్స్ మార్కెట్ అంతకంతకూ వృద్ధి !
రాజకీయ పార్టీలు అంతటితో ఆగిపోవడం లేదు. ఎవరు ఓటచర్లను ప్రభావితం చేయగలరు అనుకుంటే వారికి ప్యాకేజీలు ఇచ్చి మరీ ప్రచారం చేయించుకుంటున్నారు. సోషల్ మీడియా ఇన్ ఫ్లూయన్సర్స్ పేరుతో ప్రచారం చేసే వారి మార్కెట్ అంతకంతకూ పెరుగుతోంది. మంచి ఫాలోయింగ్ బేస్ ఉన్న వారికి లక్షలు చెల్లిస్తున్నారు. ఇన్ ఫ్లూయన్సర్స్ మార్కెట్ ఇప్పుడు 289 మిలియన్ డాలర్లు.. రెండేళ్లలో అది 400 మిలియన్ డాలర్లకు చేరుతుందన్న అంచనాలు ఉన్నాయి. వీరంతా రకరకాల పద్దతుల్లో తమ క్లయింట్ కు మేలు చేసేలా ప్రచారం చేస్తారు. ఇక యూట్యూబర్స్ గురించి చెప్పాల్సిన పని లేదు. మన దేశంలో రాజకీయ పార్టీలు.. సోషల్ మీడియాను పూర్తి స్థాయిలో వినియోగించుకోవడంలో బీజేపీ ముందు ఉంది. ఆ పార్టీ ట్విట్టర్, ఫేస్ బుక్, యూట్యూబ్ , వాట్సాప్ వంటి మాధ్యమాల్లో ఇతర పార్టీలు అందుకోలేనంత ఫాలోయర్స్ ఉన్నారు. నేతల్లో మోదీకి ట్విట్టర్లో వంద మిలియన్ల ఫాలోయర్స్ ఉంటారు. రాహుల్ గాంధీకి పాతిక వేల మిలియన్ల ఫాలోయర్స్ మాత్రమే. అయితే వారు కూడా శక్తివంచన లేకుండా సోషళ్ మీడియాను వినియోగించుకునే ప్రయత్నంలో ఉన్నారు. ఈ అంకెల్ని బట్టి చూస్తే.. బీజేపీ ఎంత డామినేట్ చేస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అందుకే వాట్సాప్ యూనివర్శిటీ నుంచి వచ్చే ఫేక్ న్యూస్.. క్షణాల్లో వైరల్ అయిపోతూ ఉంటాయి. ఇక్కడ ప్రమాదకరమైన విషయం ఏమిటంటే.. అది ఫేక్ అని తెలిసినా సరే.. ఇతర అమాయకుల్ని.. నమ్మే వాళ్లను మోసం చేయడానికి పార్టీల సానుభూతిపరులు విస్తృతంగా వ్యాపింప చేయడం.
ఎన్నికలను ప్రభావితం చేసే శక్తి సోషల్ మీడియాకు !
ఎన్నికలను ప్రభావితం చేసే శక్తి సోషల్ మీడియాకు ఉంది. అందుకే 2024 ఎన్నికల్లో సోషల్ మీడియాపై అనేక రకాల చర్చలు జరుగుతున్నాయి. ఫేక్ న్యూస్, మిస్ ఇన్ఫర్మేషన్, డీప్ ఫేక్, హేట్ స్పీచ్ వంటివి స్ప్రెడ్ చేసి.. ఎన్నికల్లో పార్టీలు లబ్ది పొందనున్నాయి. భారత ఎన్నికల్లో జోక్యం చేసుకోవడానికి చైనా కూడా ప్రయత్నిస్తోందన్న వార్తలు వస్తున్నాయి. ఏఐ టెక్నాలజీతో గందరగోళం సష్టించే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయని అంటున్నారు. చాలా దేశాల్లో సోషల్ మీడియా ఎన్నికలను ప్రభావితం చేయకుండా చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. కానీ ఇండియాలో ఇంకా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోలేదు. ఎందుకంటే ఈ అధికార పార్టీనే ఎక్కువ ఫేక్ వల్ల లాభ పడుతోంది. కాంగ్రెస్ మేనిఫెస్టోలో సంపద లాక్కుని ముస్లింలకు పంచుతామని ఉందంటూ మోదీ ప్రకటన చేశారు. దాన్ని బీజేపీ నేతలు కొనసాగిస్తున్నారు. నిజానికి కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఆ మాట లేనే లేదు. కానీ అలా చెప్పుకునే అవకాశం కూడా కాంగ్రెస్ కు లేకుండా విరుచుకుపడుతున్నారు. అదే సోషల్ మీడియా బలం. అందుకే ఓటర్లు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. మనం ఎదురుగా చూసేది కూడా ఒక్కో సారి నిజం కాకపోవచ్చు. అలాంటి భావన సోషల్ మీడియా కల్పిస్తోంది. ఇక రాజకీయ పార్టీలు చేసే మాయ గురించి చెప్పాల్సిన పని లేదు. ఓటర్లే అవగాహన పెంచుకోవాల్సిన కీలక సమయం ఇది. లేకపోతే ఆన్ లైన్ సాలెగూడులో చిక్కుకున్న మన ప్రజాస్వామ్యం విలవిల్లాడిపోతుంది. అంటే మన ఆ సాలెగూడులో చిక్కుకున్నట్లే.