” మెజార్టీ ప్రజల్ని ఆకట్టుకుని అధికారాన్ని, పదవుల్ని అందుకోవడమే రాజకీయం”. ఇందు కోసం రాజకీయ పార్టీలకు అందుబాటులో ఉన్న గండ్ర గొడ్డలి రిజర్వేషన్లు. మీరు బాగా వెనుకబడిపోయారు మీకు రిజర్వేషన్లు ఇవ్వాల్సిందే.. నేను ఇస్తానని ఓ నాయకుడు ముందుకు వస్తే అదే చాలు అని ఆ వర్గం వారు అంతా ఆ నాయకుడి వెంట పోతున్నారు. మణిపూర్ మంటల్లో చిక్కుకుపోవడానికి… ఆంధ్రప్రదేశ్ లో రైళ్లు తగలబడిపోవడానికి కూడా కారణం ఇదే. రిజర్వేషన్ల పేరుతో రాజకీయాలు చేసిన నేతలు వాటిని ఇవ్వలేము.. ఇవ్వలేరు అని తెలిసి కూడా ప్రజల్ని మభ్య పెడుతూనే ఉన్నారు. ఫలితంగా ఆ రిజర్వేషన్లు వస్తాయని ఆశలు పెట్టుకున్న వారు చివరికి అసహనానికి గురవుతున్నారు. ఆ ప్రయత్నాల్లో ఇతరులు తాము అన్యాయానికి గురవుతున్నామన్న భావనకు వస్తున్నారు. ఫలితంగా ప్రజల మధ్య అంతరం పెరిగిపోతోంది.
రాజకీయనేతల రిజర్వేషాలు
ఎస్సీ, ఎస్టీలకు బాబా సాహెబ్ అంబేద్కర్ రిజర్వేషన్లు కల్పించడానికి కారణం ఏమిటో అందిరకీ తెలుసు. వారు సమాజంలో తీవ్ర వివక్షకు గురవుతున్నారు. రాజ్యాంగాన్ని సిద్ధం చేసుకునేటప్పటికీ వారు అంటరానివారిగా ఉన్నారు. అభివృద్ధి చెందడానికి విద్యా సౌకర్యాలు లేవు. ఇలాంటి పరిస్థితుల్లో ఆ వర్గం నుంచి కొంత మంది అభివృద్ధి చెందిన వారు తమ వర్గాన్ని పైకి తీసుకు వస్తారని.. అభివృద్ధి బాటలో పయనించేలా చేస్తారని అనుకుని రిజర్వేషన్లు కల్పించారు. అయితే అలా వారికి కల్పించిన రిజర్వేషన్లు ఇప్పుడు జనాభా ప్రాతిపదికన అందరికీ కల్పించాలన్న డిమాండ్లు వచ్చే వరకూ వెళ్లింది. ఎంతగా అంటే గుజరాత్ లో పటేళ్లు ఆర్థికంగా బలంగానే ఉంటారు. సామాజికంగానూ బలంగా ఉంటారు. వారు అక్కడ అగ్రకులమే. అయినా వారు తమకు రిజర్వేషన్లు కావాలని పోరాడారు. ఓ పాతికేళ్ల కుర్రాడు ఉద్యమం లేవదీస్తే పోలోమంటూ అందరూ ఆ కుర్రాడి వెంటే పోయారు. ఇప్పుడు వారికి రిజర్వేషన్లు రాలేదు కానీ.. ఆ కుర్రాడు మాత్రం రెండు పార్టీలు మారి ఎమ్మెల్యేగా సెటిలయ్యాడు. కానీ గుజరాత్ లో పటేళ్లు ఇతరుల మధ్య విభజన రావాడనికి ఈ ఉద్యమం కారణం అయింది. మణిపూర్ లో రెండు జాతుల మధ్య కనిపిస్తే చంపేసుకుందాం అన్నంతగా పగలు రగిలిపోవడానికి రిజర్వేషన్లే కారణం. మణిపూర్ నుంచి ప్రారంభిస్తే..ఆంధ్రప్రదేశ్ వరకూ ప్రతి రాష్ట్రంలోనూ రిజర్వేషన్లు చిచ్చు ఉంది. మహారాష్ట్రలో ఎన్నికలకు ముందు మరాఠీలు అలజడి రేపారు. ఆంధ్రప్రదేశ్ కాపు రిజర్వేషన్ల కోసం రైళ్లు తగలబెట్టారు. రాజస్థాన్ లో గుజ్జర్లు రైళ్ల పట్టాల మీదే కూర్చుంటారు. మధ్యప్రదేశ్, యూపీల్లో రిజర్వేషన్ల చిచ్చు లెగవని సందర్భం తక్కువ. ఈ ప్రమాదక పరిస్థితులకు పూర్తి స్థాయిలో కారణం రాజకీయ నేతలే.
దేశంలో ఎక్కడా కొత్తగా రిజర్వేషన్లు ఇచ్చే చాన్స్ లేదు !
దేశంలో ఏ రాష్ట్రంలో అయినా రిజర్వేషన్లు 50 శాతానికే పరిమితం చేయాలని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ఆ తీర్పు అమలవుతోంది. తమిళనాడులో మాత్రం 69 శాతం రిజర్వేషన్లు అమలవుతున్నాయి. అక్కడి రిజర్వేషన్లను కేంద్రం రాజ్యాంగంలోని 9వ షెడ్యూలులో పొందు పరిచింది.అది ఇప్పుడు జరిగింది కాదు. ఆ ఒక్క రాష్ట్రంలోనే యాభై శాతం కన్నా ఎక్కువ రిజర్వేషన్లు ఉన్నాయి. మిగతా రాష్ట్రాల్లో తమిళనాడు ఆదర్శంగా చూపిస్తూ ఆ రాష్ట్రంలాగే మాకూ రిజర్వేషన్లు పెంచాలని డిమాండ్ చేస్తూ అసెంబ్లీలు తీర్మానాలు చేస్తూ పోయాయి. ఈ తీర్మానాలు చేసి కేంద్రానికి పంపి .. మేము రిజర్వేషన్లు ఇచ్చేశాం..కేంద్రమే ఇవ్వడం లేదని ప్రచారం చేసుకుంటూ వస్తున్నారు. కేంద్రం వద్ద ఇలాంటి రిజర్వేషన్లు పెంపు తీర్మానాలు దాదాపుగా ప్రతి రాష్ట్రం నుంచి వచ్చి ఉన్నాయి. అంతే ఇంకా ఇంకా డిమాండ్లు వినిపిస్తూనే ఉన్నాయి. ఈ సమస్య ఇంతటితో ఆగేది లేదు. కేంద్రం కూడా ఈ రిజర్వేషన్ల రాజకీయంలో తన వంతు ఆజ్యం పోసింది. మొదట ఆర్థికంగా వెనుకబడి వారికి రిజర్వేషన్లు పది శాతం తీసుకు వచ్చింది. ఇది ఇది రిజర్వేషన్ వ్యవస్థను గందరగోళం చేసింది. కులాలతో సంబంధం లేని రిజర్వేషన్ కావడంతో సుప్రీంకోర్టు కూడా సమర్థించింది. తర్వాత మహిళా రిజర్వేషన్ బిల్లును కూడా ఆమోదించింది. అయితే అది అమల్లోకి రావడానికి ఇంకా సమయం పడుతుంది. అప్పటికి పరిస్థితులు ఎలా మారుతాయో అంచనా వేయడం కష్టం. కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ కులం , రిజర్వేషన్ల అస్త్రంతోనే రాజకీయం చేస్తున్నారు. బీజేపీని, ప్రధాని మోదీని ఓడించాలంటే ఆయనకు కులం, రిజర్వేషన్లు తప్ప మరో మార్గం కనిపించడం లేదు. కేంద్రంలో అధికారం ఇస్తే రిజర్వేషన్ల పరిమితి ఎత్తేస్తామని జనాభా ప్రాతిపదికన అవకాశాలు కల్పిస్తామంటున్నారు. ప్రాక్టికల్ గా ఆలోచిస్తే ఓ నాయకుడు అలాంటి హామీ ఇవ్వడు. ఎందుకంటే ఇది అసాధ్యమే కాదు ప్రజల మద్య చిచ్చు పెట్టేది.. దేశ వినాశనానికి దారి తీసేది కూడా. అసలు ఎవరు ఏ కులం వారో ఎలా తేలుస్తారన్నదానికి సమాధానం లేదు. తెలంగాణలో అక్కడి ప్రభుత్వం కులగణన చేసింది. స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు టార్గెట్ గా పెట్టుకుని చేసిన కులగణన అది. ఆ కులగణన అద్భుతంగా చేశామని కాంగ్రెస్ చెప్పుకుంటోంది. కానీ బీసీ సంఘాలు మాత్రం వాటిని చించి పడేశాయి. ఎందుకంటే అంటే.. తన జనాభాను తక్కువగా చూపించారట. ముస్లిం బీసీలతో కలిసి యాభై ఆరు శాతం బీసీలు ఉన్నారని ఆ నివేదిక వచ్చింది. అయితే తమ జనాభా ముస్లిం బీసీలతో సంబంధం లేకుండానే యాభై శాతానికిపైగా ఉంటుందని వారు వాదిస్తున్నారు. దానికి సాక్ష్యంగా కేసీఆర్ మొదటి సారి అధికారం చేపట్టినప్పుడు చేయించిన సమగ్ర కుటుంబ సర్వేను సాక్ష్యంగా చూపిస్తారు. కేసీఆర్ పకడ్బందీగా ఆ సర్వే చేయించారు. అందులో సందేహమే లేదు. కానీ. దానికి చట్టబద్ధత కల్పించలేదు. అసెంబ్లీలో పెట్టలేదు. ఫలితంగా నాన్ వ్యాలీడ్ డాక్యుమెంట్ అయింది. దాన్ని పరిగణనలోకి తీసుకోవడానికి కాంగ్రెస్ రెడీగా లేదు. ఒక్క బీసీలే కాదు.. ఎస్సీ, ఎస్టీలు సహా అందరూ తమ జనాభా తక్కువగా చూపించారని అంటున్నారు. ఇక అన్ని ఓసీ కులాలు.. ముస్లిం ఓసీలతో కలిసి కనీసం పద్దెనిమిది శాతం కూడా లేరని తేల్చారు. వారిలోనూ కనిపించని అసంతృప్తి ఉంటుంది.
అన్ని చోట్లా ఉంటారు మల్లన్నలు !
ఈ కులగణనను .. కుల రాజకీయాల్ని అడ్డం పెట్టుకుని చింతంపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్న అనే రాజకీయనాయకుడు.. తన రాజకీయ సోపానానికి అగ్రకులాల్ని బూతులు తిట్టడం ప్రారంభించారు. అచ్చం కేసీఆర్ తెలంగాణ ఉద్యమాన్ని రెచ్చగొట్టినట్లుగా… తాను బీసీఉద్యమాన్ని ఇతర కులాల్ని తిట్టడం ద్వారా రెచ్చగొట్టేసి.. సీఎం అయిపోయావాలని ఆయన ప్లాన్ చేసుకుంటున్నారు. ఇతర కులాలపై ఆయన చేస్తున్న వ్యాఖ్యలు.. నింపుతున్న ద్వేషం చేస్తూంటే.. ఆ కులాలకు చెందిన వారిలో నిజంగా కులోన్మాదం లేకపోయినా పెంచేలా ఉంది. ఇలాంటి తీన్మార్ మల్లన్నలు… అన్ని చోట్లా ఉన్నారు. పక్కనోడ్ని కించ పరిచి.. తమ వాళ్లను రంజింపచేసి.. తన వెనుక వచ్చేలా చేసుకుని తాను రాజకీయ సోపానాలను అందుకోవడమే ఇలాంటి వారి లక్ష్యం. అక్కడ రాహుల్ గాంధీ చేస్తున్నది అదే.. ఇక్కడ తీన్మార్ మల్లన్న కూడా చేస్తున్నది అదే. కాకపోతే వేర్వేరు మార్గాలు.. కానీ లక్ష్యం మాత్రం ఒకటే. దేశానికి స్వాతంత్రం వచ్చి 75 ఏళ్లు దాటిపోయింది.. వందేళ్ల ప్రణాళికలు వేసుకుని అప్పటికి అభివృద్ధి చెందిన దేశంగా మారతాయని డబ్బాలు కొట్టుకుంటున్నాం. కానీ అంతర్గతంగా జరుగుతోంది మాత్రం.. కులం, మతం, ప్రాంతాల పేరుతో విభజించుకుని.. దేశం ఒక అడుగు ముందుకు వెళ్తే వంద అడుగులు లాక్కుంటున్నాం. దేశంలో చాలా మంది మేధావులు ఉంటారు. ఒక్కో వర్గానికి మద్దతు తెలుపుతారు. మిగతా వారంతా హీనులు .. తాము సపోర్టు చేసేవారే గొప్ప అంటారు. ఏమైనా అంటే మనోభావాలు దెబ్బతిన్నాయని రెచ్చగొట్టేందుకు వెనుకాడరు. చివరికి ప్రాణాలు తీసే హంతకుల్ని కూడా కులాలను చూపించి సమర్థించే వారు ఉన్నారంటే.. మన అభ్యుదయం ఎటు వైపు ఉందో అర్థం చేసుకోవచ్చు.
నిజమైన దేశాభివృద్ధి కోసం రాజకీయ నేతలు ప్రయత్నించాలి !
గతంలో చంద్రబాబు కాపులకు రిజర్వేషన్లు ఇస్తానని ప్రకటించి.. సాధ్యం కాక తీర్మానం చేసి కేంద్రానికి పంపించారు.ఎంతో గొప్పగా పరిపాలించానని.. ఓ కొత్త రాష్ట్రాన్ని గాడిన పెట్టానని ప్రజలపై భారం వేయలేదని తనను గెలిపిస్తారని ఆయన అనుకున్నారు. ఘోరంగా ఓడించారు. ఎందుకంటే ఇలాంటి రిజర్వేషన్లతో ఏదో లబ్ది పొందాలని చేసిన ప్రయత్నంతోనే. గతంలో కేసీఆర్ కూడా అన్ని వర్గాలకూ రిజర్వేషన్లు పెంచుతానని మభ్య పెట్టారు. ఎస్సీ,ఎస్టీలు, ముస్లింలు అందరికీ రిజర్వేషన్లు పెంచుతూ తీర్మానాలు చేశారు.
కానీ ఏమయింది.. వారి ఆగ్రహానికి గురి కావాల్సి వచ్చింది. రాజకీయ పార్టీలు రిజర్వేషన్లతో గేమ్స్ ఆడితే .. అది చివరికి వారికే చుట్టుకుంటుందన్న దాంట్లో ఎలాంటి సందేహం లేదు. చరిత్ర.. వర్తమానంలో అనేక సాక్ష్యాలు మన కళ్ల ముందు ఉన్నాయి. ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా అలాంటి గేమ్ ఆడుతున్నారు. కులగణన రిపోర్టుతో.. డెడికెటెడ్ కమిషన్ రిపోర్టుతో రిజర్వేషన్లు పెంచడం అనేది సాధ్యం కాదు. ఈ విషయం రేవంత్ కూ తెలుసు కాబట్టి ఆయన దాన్నుంచి బయట పడేందుకు సాంకేతికంగా లేకపోయినా రాజకీయంగా నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇద్దామని సవాల్ చేస్తున్నారు.అయితే ఇతర పార్టీలు ఆయన బీసీలకు అన్యాయం చేశారని ప్రచారం చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. తీన్మార్ మల్లన్న, ఆర్ కృష్ణయ్య లాంటి వాళ్లు తమకు ఎవరు పదవులు ఇస్తే వారిని పొగుడుతారు. బీసీలకు మేలు చేశారని అంటున్నారు. ఆర్.కృష్ణయ్య జగన్ రెడ్డికి సంఘ సంస్కర్త అని కూడా అన్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డిని బీసీలకు చాలా అన్యాయం చేస్తున్నారని అంటున్నారు. వారి అజెండా వారిది. అందుకే ఈ రిజర్వేషన్ల రాజకీయం దేశాన్ని.. అట్టడుగు స్థానానికి తీసుకెళ్తోంది. శాంతిభద్రతల సమస్యను సృష్టిస్తోంది. ప్రజల మధ్య భజన తెలుస్తోంది. చివరికి దీన్ని ప్రారంభించిన వారికే అంటుంటోంది. దాన్నుంచి బయటపడటానికి వారికి సాధ్యం కావడం లేదు. అందుకే రాజకీయ పార్టీలు.. ఈ రిజర్వేషన్లు, కులాలు, మతాలు వదిలి పెట్టి.. దేశాభివృద్ధికి.. ప్రజల జీవితాల్ని మెరుగుపరచడానికి ఏం చేయాలో వాటిపై ఆలోచన చేస్తే మంచిది. అదే నిజమైన రాజకీయం కూడా.