“నిజాయితీ, ప్రాణులకు హాని కలిగించకుండా ఉండటం, స్వచ్ఛత, సద్భావన, దయ, సహనం, స్వీయ నిగ్రహం, ఔదార్యం వంటి సద్గుణాలను పాటించడం సనాతన ధర్మం “…
హిందూత్వవం, సనాతన ధర్మంపై ఉన్న అనేక గ్రంథాలను అధ్యయనం చేసిన తర్వాత వెల్లడయ్యే సారాంశం ఇదే. నిజానికి అన్ని మత గ్రంధాలు ఇదే చెబుతాయి. ఒక్క మత గ్రంథమైనా హింసను ప్రేరేపించదు. పర మనుషుల్ని అసహ్యించుకోమని చెప్పదు. ఇంకా చెప్పాలంటే పర మత సహనాన్ని పాటించాలనే చెబుతాయి. కానీ సనాతన ధర్మంపై చాలా మంది వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తూంటారు. ఒకరు అదో వైరస్ అంటారు. మరొకరు రోగం అంటారు.. మరొకరు నిర్మూలించాలంటారు. ఎందుకలా..? మనలోని నిజాయితీ, స్వచ్ఛత, సద్భావన, దయ, సహనం, స్వీయ నిగ్రహం, ఔదార్యం అన్నీ వైరస్ లాంటివా వాటిని మనం త్యజిస్తే మనుషులం అవుతామా మృగాలమా ?. మరి ఎందుకు సనాతన ధర్మంపై కొంత మంది హిందువులే విషం చిమ్ముతున్నారు ?.
సనాతన ధర్మం అన్ని మతాల సారాంశంలో ఒక్కటే !
మత పట్టింపు లేని అనేక మంది హిందువుల్లో ఓ అనుమానం.. ఓ ఆవేదన చాలా కాలం నుంచి ఉంది. అదే హిందూత్వంపై కొంత మంది హిందువులే విషం చిమ్ముతూ ఉంటారు. సనాతన ధర్మం అంటే.. అదో నిషేధపదం అన్నట్లుగా మాట్లాడుతూ ఉంటారు. అదే సమయంలో ఇతర మతాల విషయంలో చిన్న మాట పోనివ్వరు. ఎందుకు సనాతన ధర్మమే అలుసైపోయింది ?. కొన్ని కోట్ల మంది మనసులో ఉన్న భావననే పవన్ కల్యాణ్ ఇప్పుడు సనాతన ధర్మ డిక్లరేషన్‌లో వెల్లడించారు. పవన్ కల్యాణ్‌లో ఈ రకమైన మార్పు చాలా మంది ఊహించలేరు. ఒకప్పుడు తాము కమ్యూనిస్టు భావజాలంతో ఉన్నానని చెప్పారు. కమ్యూనిస్టు భావజాలమంటే పవన్ కల్యాణ్ అర్థం చేసుకున్నది పేదలకు అండగా ఉండటమే. హిందూ మతాన్ని అగౌరపర్చడం. చైనాను ప్రేమించడం వాటి వారి భావజాలాన్ని కాదు. అందుకే పవన్ కల్యాణ్ తన మత భావాలను వ్యక్తపరచడానికి ఎప్పుడూ వెనుకాడలేదు. కొండగట్టుకు వెళ్లినా.. ఎవరూ చేయలేని దీక్షలు చేసినా అది ఆయనను అంత:కరణశుద్ధితోనే చేసుకున్నారు. ఎవరి కోసమో కాదు. తన కోసమే చేసుకున్నారు. కానీ ఇప్పుడు ధర్మ పరిరక్షణకు రంగంలోకి దిగాల్సిన అవసరాన్ని ఆయన గర్తించారు. అందుకే తిరుమల శ్రీవారి లడ్డూ కల్తీ విషయం తర్వాత అదే సరైన సమయమని రంగంలోకి దిగారు.
శ్రీవారి లడ్డూ ప్రసాద కల్తీ విషయం ప్రతి హిందువు గుండెల్ని మండిస్తుంది. లడ్డూ కల్తీ కాలేదని అడ్డగోలు వాదన వినిపించవచ్చు కానీ జరిగిందేమీటో కళ్ల ముందే ఉంది. దీనికి బాధ్యులెవరు ?. కోట్లాది మంది దేవుడిని చులకన చేయాలన్న ఉద్దేశంతో అన్యమత పాలకులు చేసిన కుట్ర అది. అదే వారి దేవుడి విషయంలో ఇలా ఉండగలరా ?. క్రిస్మస్ పండుగకు వైఎస్ కుటుంబం అంతా ఎంత నిష్టగా ఉంటుందో అందరికీ తెలుసు. అంత ఎందుకు జగన్ తల్లి విజయలక్ష్మి బైబిల్ చేతిలో లేకుండా ఎప్పుడైనా బయటకు వస్తారా ?. వారి మతం మీద వారికి అంత అభిమానం. అది స్వేచ్చ. ఎవరూ తప్పు పట్టలేదు. క్రైస్తవంపై ఎవరైనా అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఆ కుటుంబం ఊరుకుంటుందా ..? ఆ కుటుంబం అనే కాదు క్రైస్తవులు ఎవరూ ఊరుకోరు. అంతకు మించి క్రైస్తవులు.. చివరికి మతం మారిన వారు కూడా తాము కొత్తగా ఎంచుకున్న మతాన్ని ఒక్క మాట కూడా అనరు. ఇక ముస్లింల సంగతి చెప్పాల్సిన పని లేదు. ముస్లిం మత పవిత్రతను ఆ మతంలోని వారు తమ ప్రాణానికన్నా ఎక్కువగా భావిస్తారు. ఇదేమి తప్పు కాదు. వారి నమ్మకం. ఎవరైనా అటు క్రైస్తవుల్ని కానీ.. ఇటు ముస్లింలను కానీ తమ మత పవిత్రత విషయంలో తప్పు పడితే ఖచ్చితంగా అది శిక్షించదగిన నేరం. అలాగే.. హిందువుల విషయంలోనూ అది వర్తిస్తుంది. ఆయా మతాలు ఎంత పవిత్రమైనవో.. హిందూ మతం. సనాతన ధర్మం కూడా అంతే పవిత్రమైనది. కానీ ఇక్కడ దశాబ్దాలుగా వస్తున్న అతి పెద్ద సమస్య ఏమిటంటే.. హిందూమతాన్ని హిందువులే కించ పర్చడం. భావజాలం పేరట చాలా మంది దేవుడ్ని అవమానిస్తారు. రెండు సార్లు టీటీడీ చైర్మన్ గా చేసిన కరుణాకర్ రెడ్డి ఫక్తు నాస్తికవాది. ఆయన వెంకటేశ్వర స్వామి మూల విరాట్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆయన హిందువునని చెప్పుకుంటారు. ఆదే ఆయన ఇస్లాంలోనే క్రైస్తవంలోనే ఉండి ఉంటే.. వారి వారి దేవుళ్లపై ఇలాంటి వ్యాఖ్యలు చేయగలరా ?. అసాధ్యం. చేయలేరు. మరి హిందువుగా ఉండి.. కోట్లాది మంది ఆరాధ్యుడు.. దేవదేవుడపై ఎలా వ్యాఖ్యలు చేయగలిగారు ?
ఎవరి మతాన్ని వారు గౌరవించుకోవాలి – ఇతర మతాల్ని కించపర్చకూడదు !
ఇది సంస్కృతి రోజు రోజుకు విస్తరిస్తోంది. హిందూ మతాన్ని, సనాతన ధర్మాన్ని విమర్శించడమే అతి పెద్ద అభ్యుదయ భావజాలం అనేలా బ్రెయిన్ వాష్ చేస్తున్న వారి సంఖ్య పెరగుతోంది. ఇలాంటి ట్రెండ్ ఇతర మతాల్లో కనిపి్ంచడం లేదు. ఎంతగా అంటే.. హిందువుల్లో చీలిక తెచ్చేందుకు సనాతన ధర్మం అంటే.. అంటరాని తనం ప్రోత్సహించేది.. అది బ్రాహ్మణులది మాత్రమే అని చెబుతున్నారు. సనాతన ధర్మం అంటే ఎక్కడా బ్రాహ్మణులు వారు పాటించే ఆచారాలు అని ఎక్కడా చెప్పడం లేదు. ప్రతి కులంలో వారికి ఆచారాలున్నట్లే వారికీ ఉంటాయి. అందులో సమాజాన్ని తక్కువగా చూసే లక్షణాలు ఉన్న అవవలక్షణాలను చాలా మంది వదిలేసుకున్నారు. అయినా ఇక్కడ సనాతన ధర్మం అనేది కులానికి సంబంధం లేదు. కానీ ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం సనాతన ధర్మం అంటే.. నిమ్న కులాలను తక్కువగా చూసేదని ప్రచారం చేశారు. ఇప్పటికీ అదే చేస్తున్నారు. దీనిపై ప్రజల్లో చైతన్యం తక్కువగా ఉంది. సనాతన ధర్మం పాటించడమంటే.. వేదాలు నేర్చుకోమని చెప్పడం లేదు.. ఉపనిషత్తులు బట్టీ పట్టమని చెప్పడం లేదు.. మంత్రాలు వల్లించాలని కూడా చెప్పడం లేదు. మానవత్వంతో బతకడం.. అన్ని మతాలను గౌరవించడమే సనాతన ధర్మమని చెబుతున్నారు. కానీ తెలివి మీరిన రాజకయ పార్టీలు సనాతన ధర్మాన్ని బూచిగా చూపిస్తే .. ఓటు బ్యాంక్ రాజకీయాలకు పాల్పడుతున్నాయి. ఆ విధంగా సనాతన ధర్మాన్ని వారు వాడకుని లబ్ది పొందుతున్నారు కానీ.. హిందూత్వానికి హిందూ ప్రజలకు తీరని అన్యాయం చేస్తున్నారు. మంచికి మానవత్వానికి ముప్పు తెచ్చేలా వ్యవహరిస్తున్నారు. ప్రజల్ని మతాలుగా విడిపోయేలా చేసి..వారి మధ్య శత్రుత్వ భావాన్ని పెంచేలా వ్యవహరిస్తున్నారు. ఈ వివక్ష రాను రాను పెరిగిపోతోంది.
ఈ పరిస్థితులు చూసి చూసి తట్టుకోలేక .. తనతో కొద్దిగా అయినా మార్పు వస్తుందన్న ఉద్దేశంతో పవన్ కల్యాణ్ ప్రయత్నాలు ప్రారంభించారని అనుకోవచ్చు. పవన్ కల్యాణ్ సనాతన ధర్మ డిక్లరేషన్ అంశాలు చూస్తే మొదటితే అన్ని మతాలను గౌరవించాలని ఉంది. ఎవరి మతాన్ని వారు గౌరవించుకోవాలని ఉంది. ఇది ఒక్కటి అందరూ పాటిస్తే దేశంలో మత రాజకీయలే ఉండవు. హిందూమతంలో వివక్ష ఉందని.. హిందువుల్లోని కొన్ని కులాలను ఎగదోస్తే వారు క్రైస్తవ మతంలో చేరుతారు. మరి అక్కడ వివక్ష ఉండదా ?. ప్రపంచంలో జరుగుతున్న యుద్ధాలు చూస్తే ఎవరికైనా క్లారిటీ వస్తుంది. మరి ముస్లింలలో వివక్ష ఉండదా ?. మహిళల్ని తక్కువ చూపు చూస్తారని అంటారు. ఆ మతస్తులు అందరూ అది తమ మత సంప్రదాయాలని అంటారు .ఎక్కువ పెళ్లిళ్లు చేసుకోవడం దగ్గర నంచి ట్రిపుల్ తలాక్ వరకూ అనేక సమస్యలతో మహిళలు ఇబ్బంది పడుతున్నారు. వారి కోసం ప్రభుత్వం ఆలోచన చేస్తే.. హిందూ ప్రభుత్వం .. ముస్లిం సమాజంపై చేసిన దాడిగా ప్రచారం చేశారు. మరి హిందూత్వంలో ఉన్న లోపాలను.. వివక్షలను ప్రశ్నించేవారు ఒక్కరైనా మస్లిం సమాజంలో మహిళల బతుకుల్ని బాగు చేసేదిశగా తీసుకుంటున్న నిర్ణయాలను సమర్థించారా అంటే లేనే లేదు. ఇప్పుడు వక్ఫ్ బోర్డు విషయంలోనూ అంతే. వక్ఫ్ బోర్డు బిల్లులో వారి ఆస్తుల్ని తీసుకుంటామని ఎక్కడా చెప్పలేదు. పైగా.. రికార్డుల పరంగా హక్కులు కల్పించేలా చేస్తారు. అయినా దాన్ని బీజేపీ చేస్తోంది కాబట్టి వ్యతిరేకిస్తున్నారు. అలా చేయడానికి రాజకీయ పార్టీల మత రాజకీయాలే కారణం. నిజానికి ముస్లిం , క్రైస్తవ, హిందూ సమాజాల్లో వివక్షలు ఉన్నాయి. లేవని ఎవరూ చెప్పరు. కానీ వాటిని చూపించి..ఒక మతాన్ని తగ్గించి ..నిర్మూలించాలని ప్రచారం చేయడమే తప్పు.
కుహనా సెక్యూలరిస్టులతో ప్రజల మధ్య వివక్షత ముప్పు !
దైవత్యాన్ని ప్రపంచంలో నూటికి 99 శాతం మంది నమ్ముతారు. విగ్రహారాధన నమ్మకపోవచ్చు. మానవత్వంలోనే దైవత్వం ఉందని నమ్మేవారూ ఉంటారు. తమ జీవితాల్లో జరిగే మిరాకిల్స్కు దేవుడే కారణమని కూడా అనుకుంటారు. ఎందుకంటే..దేశంలో ఎంతో మంది తనకంటే సమర్థులు ఉన్నా..తనకు ఆ పొజిషన్ దేవుడి వల్లే వచ్చిందని అనుకుంటాడు. ఆ నమ్మకమే దేవుడు. అలాంటి భావన అందరికీ ఉంటుంది.అన్ని మతాలవారికీ ఉంటుంది. అన్ని మతాలు తమ దేవుడ్ని గౌరవించుకున్నట్లుగా హిందువులు కూడా తమ ఆరాధ్యదేవుడ్ని గౌరవించుకోవాలి. ఒక వేళ ముందుగా చెప్పుకున్నట్లుగా మానవత్వమే దేవుడని నమ్మేవారు అయితే సైలెంట్ గా ఉండాలి. కనీసం కించపర్చకూడదు. కానీ మన దేశంలో కుహనా లౌకిక వాదులు .. సనాతన ధర్మాన్ని, హిందూత్వాన్ని కించ పర్చడమే సెక్యూరలిజం అనుకుంటారు. ఇలాంటి వారి అతి నుంచి పుట్టినదే పవన్ కల్యాణ్ సనాతన ధర్మ డిక్లరేషన్. ఇది ఎవరికీ వ్యతిరేకం కాదు. ఎవరికీ అనుకూలం కాదు. మనలోని మంచిని పెంచేలా ఓ సాధనం. దీన్ని హిందువులు గుర్తించిన రోజున పవన్ కల్యాణ్ తన ఆశయంలో ఒక్క అడుగైనా ముందుకు వేసినట్లే అనుకోవచ్చు. సనాతన ధర్మం అంటే.. ఇతర మతాల్ని గౌరవించు..నీ మతాన్ని ఆచరించు అనే. ఇంతకు మించి ఇందులో రాజకీయం వెదకూడదు.
ప్రపంచంలో దేనికైనా ఓ పద్దతి ఉంటుంది. మానవ జీవితం క్రమబద్దంగా సాగాలంటే ఓ శక్తిని నమ్మాలి. ఆ శక్తి ప్రతి మతం వారికి ఉంటుంది. ఆ మతం ఏదైనా ద్వేషాన్ని కోరుకోదు. మంచినే ప్రవచిస్తుంది. దాన్ని అర్థం చేసుకుంటే.. సనాతన ధర్మం ప్రతి మతంలోనూ ఉంటుందని తెలుస్తుంది. ఈ ఆశయం కోసమే పవన్ ముందడుగు వేస్తున్నారు.