మనల్ని నమ్ముకున్నారు అంటే వారికి ఎంతో కొంత మేలు చేయాలని ఆలోచించడం మనుషుల లక్షణం. కానీ చరిత్రలో కొంత మంది మాత్రం మనల్ని నమ్ముకున్న వారిని పావులుగా వాడుకుని నిచ్చెన మెట్లు ఎక్కి వారిని మాత్రం అక్కడే ఉంచాలని.. ఎప్పటికీ వారిపై స్వారీ చేయాలని అనుకుంటూ ఉంటారు. అలాంటి వారిలో వైసీపీ అధినేత, ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి మొదటి వరుసలో ఉంటారు. ఇప్పుడు తన ప్రభుత్వంపై ప్రజల్లో పెల్లుబీకుతున్న అసంతృప్తి అంతా కేవలం దళిత ఎమ్మెల్యేల వల్లే అన్నట్లుగా ఆయన చేస్తున్న విన్యాసాలు చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. నమ్మిన దళితుల్ని ఇంత ఘోరంగా రాజకీయ ప్రయోగాలకు వేదిక చేసి వారిలో ఎలాంటి నాయకత్వం బలపడకూడదన్నట్లుగా జగన్ రెడ్డి చేస్తున్న రాజకీయం అందర్నీ విసమ్య పరుస్తోంది.
దళిత ఎమ్మెల్యేల ప్రశ్నలకు సమాధానం ఉందా ?
‘ఎస్సీలని చిన్న చూపా, రిజర్వుడు నియోజకవర్గం అని చిన్న చూపా.. రోజా, చెవిరెడ్డి పై తీవ్ర వ్యతిరేకత ఉన్న నియోజకవర్గాల్లో ల్లో మంత్రి పెద్దిరెడ్డి మీటింగ్‌లు పెట్టమను.. స్కూటర్ మీద వచ్చే పెద్దిరెడ్డి.. ఈరోజు ఆయన స్థాయి ఏంటో అందరికీ తెలుసు.. పెద్దిరెడ్డి చెప్పిందే నియోజకవర్గంలో చేశా.. పెద్దిరెడ్డిని కాదని చిన్న పని చేయలేదు.. ’ అని సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం ఆవేదన వ్యక్తం చేశారు. నిజానికి ఆయనకు ఎంపీ టిక్కెట్ ఇచ్చారు. కానీ తనను అవమానకరంగా తొలగించిన వైనం చూసి ఆయన రగిలిపోయారు. దళిత నేతననే ఇంత అవమానించారని రగిలిపోయారు. ఒక్క ఆదిమూలం కాదు.. అదే చిత్తూరు జిల్లాకు చెందిన దళిత ఎమ్మెల్యే ఎంఎస్ బాబు కూడా అదే మాట చెప్పారు. అనంతపురం జిల్లాకు చెందిన జొన్నలగడ్డ పద్మావతి కూడా అదే చెప్పారు. కృష్ణాజిల్లాకు చెందిన రక్షణ నిధి కూడా అదే అంటున్నారు. వీరంతా బయటపడ్డారు. కానీ బయటపడాల్సిన వారు చాలా మంది ఉన్నారు. వీరు అడుగుతున్న ఒక్క ప్రశ్నకూ వైసీపీ నేతల వద్ద నుండి సమాధానం రావడం లేదు. కానీ ఎదురుదాడి వస్తోంది. తాము లేకపోతే మీర గెలవలేరని హెచ్చరికలు జారీ చేయిస్తున్నారు. పార్టీ క్యాడర్ తో తిట్టిస్తున్నారు. దిష్టిబొమ్మలు తగులబెట్టిస్తున్నారు.
పక్కా పెత్తందారు రాజకీయం !
దళిత ఎమ్మెల్యేను హోంమంత్రిని చేశారు. కనీసం ఆమె అధికారిక ఆఫీసులో కూర్చునే అవకాశం కూడా ఎప్పుడూ కల్పించలేదు. ఆమె హోంమంత్రి అయినా నియోజకవర్గానికి మాత్రమే పరిమితం చేశారు. ఇలా దళితులకు అధికారాలు ఇచ్చి మొత్తం పెత్తందారులైన రెడ్డి సామాజికవర్గ నేతలే మొత్తం చక్క బెడుతూ వచ్చారు. తీరా ప్రభుత్వంపై అసంతృప్తి ఉందని బయటపడేసరి వారి వల్లేనని చెప్పి బలిపశువుల్ని చేసేస్తున్నారు. వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు జగన్ ఐదు జాబితాలు ప్రకటిస్తే..80 శాతం బడుగు, బలహీనవర్గాలే. అన్ని జాబితాల్లోనూ వారినే మార్పు చేస్తున్నారు. వైసీపీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీకి బలమైన ఓటు బ్యాంకుగా ఉన్నాయి ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలు. అయితే 2014, 2019 ఎన్నికలతో పాటు 2010-14మధ్య జరిగిన ఉప ఎన్నికల్లో జగన్ వెంట నడిచిన వారికి చాన్స్ ఇవ్వడం లేదు. డిసెంబర్ 11న విడుదల చేసిన జాబితాలో 11 సమన్వయకర్తలను ప్రకటించారు. వీటిలో ప్రత్తిపాడు ఎస్సీ నియోజక వర్గానికి బాలసాని కిరణ్‌కుమార్, కొండేపిలో ఆదిమూలపు సురేష్, వేమూరులో వరికూటి అశోక్‌బాబు, తాడికొండలో మేకతోటి సుచరిత, సంతనూతలపాడులో మేరుగు నాగార్జున ఉన్నారు. ఇవన్నీ ఎస్సీ రిజర్వుడు స్థానాలు . మొదటి జాబితాలో ఐదు ఎస్సీ రిజర్వుడు స్థానాల్లో అభ్యర్థుల్ని మార్చేశారు. జనవరి 2వ తేదీన విడుదల చేసిన జాబితాలో రాజాం ఎస్సీ రిజర్వుడు స్థానంలో తాలె రాజేష్, పాయకారావుపేట(ఎస్సీ)లో కంబాల జోగులు, పి.గన్నవరంలో విప్తర్తి వేణుగోపాల్, పోలవరం(ఎస్టీ) తెల్లం రాజ్యలక్ష్మీ, ఎర్రగొండపాలెంలో తాటిపర్తి చంద్రశేఖర్, అరకులో(ఎస్టీ) గొడ్డేటి మాధవి, పాడేరు(ఎస్టీ)లో మత్స్యరాస విశ్వేశ్వర రాజులను మార్చారు. ఐదో జాబితాలో గొడ్డేటి మాధవికి హ్యాండిచ్చి పక్కన పెట్టేశారు. జనవరి 11న ప్రకటించిన మూడో జాబితాలో రిజర్వుడు స్థానాల్లో పూతలపట్టులో సిట్టింగ్ ఎమ్మెల్యే ఎంఎస్‌బాబును తప్పించి మూతిరేవుల సునీల్‌కుమార్‌ను నియమించారు. చింతలపూడిలో కంభం విజయరాజు, కోడుమూరులో డాక్టర్ సతీష్, గూడూరులో మేరిగ మురళి, సత్యవేడులో మద్దిల గురుమూర్తిలను ఖరారు చేశారు. నాలుగో జాబితాలో ఏకంగా ఎనిమిది చోట్ల ఎస్సీ అభ్యర్థుల పేర్లు మారిపోయాయి. చిత్తూరు ఎంపీ నారాయణ స్వామిని ఖరారు చేశారు. గంగాధర నెల్లూరులో ఎన్.రెడ్డప్పను, శింగనమలలలో జొన్నలగడ్డ పద్మావతి స్థానంలో ఎం.వీరాంజనేయులు, నందికొట్కూరులో డాక్టర్ దారా సుదీర్, తిరువూరులో నల్లగట్ల స్వామిదాసు, మడకశిరలో ఈర లక్కప్ప, కొవ్వూరులో తలారి వెంకట్రావు, గోపాలపురంలో తానేటి వనిత, కనిగిరిలో దద్దాల నారాయణ యాదవ్‌లను ఖరారు చేశారు. నాలుగో జాబితాలో 9 స్థానాల్లో 8 ఎస్సీ స్థానాల్లో అభ్యర్థుల్ని మార్చేశారు. అభ్యర్థుల మార్పులు జరిగిన నియోజక వర్గాల్లో రిజర్వుడు స్థానాల్లో స్థాన చలనం కల్పిస్తే, ఓసీలు ఉన్న చోట సిట్టింగుల వారసులకు చోటు కల్పించారు. ప్రధానంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ సామాజిక వర్గాలు ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజక వర్గాల్లోనే రకరకాల కారణాలతో అభ్యర్థుల్ని మార్చేయడమో, సీటు నిరాకరించడమో జరిగింది.
దళిత ఎమ్మెల్యేల వల్లే ప్రభుత్వంపై అసంతృప్తి పెరుగుతోందా ?
ఐదారు రోజుల పాటు కసరత్తు జరిపి చివరికి ఐదో జాబితా రిలీజ్ చేస్తే అందులో సిట్టింగ్ ఎస్టీ గొడ్డేటి మాధవికి సీటు లేకుండా చేశారు. అరకులో టీడీపీ దొన్నుదొరను అభ్యర్థిగా ఖరారు చేసిందని అదే సామాజికవర్గానికి చెందిన మత్స్యలింగం అనే నేతకు ఇంచార్జ్ పదవి ఇచ్చారు. దీంతో మాధవికి ఎక్కడా టిక్కెట్ లేకుండా పోయినట్లయింది. ఇక తనను బలి చేస్తున్నారని ఆరోపించిన ఆదిమూలం ప్లేస్ లో మళ్లి గురుమూర్తిని ఎంపీ అభ్యర్థిగా ప్రకటించారు. ఏపీలో మొత్తం 29 ఎస్సీ నియోజకవర్గాల్లో 21 మందిని మార్చిన వైసీపీ.. నాలుగు ఎంపీ నియోజకవర్గాల్లో ఒకరి స్థానచలనం కల్పించింది. అమలాపురం, రాజోలు, నందిగామ, బద్వేలు, పార్వతీపురం, పామర్రు, సూళ్లురుపేట, రైల్వేకోడూరు నియోజకవర్గాల్లో ఇంకా మార్పులు జరగలేదు. చేయడం ఖాయమే. ఆయా ఎమ్మెల్యేలు కూడా ఈ మార్పులను ఊహించి ఉండరు. దళిత ఎమ్మెల్యేలపైనే అసంతృప్తి ఉందా అన్న ప్రశ్నలు బదిలీలకు బలైన వారు ప్రశ్న వేస్తున్నారు. ఈ సారి సీఎం జగన్ బీసీ అభ్యర్థులకు ఎక్కువ సీట్లు ఇస్తారని రెడ్డి సామాజికవర్గానికి సీట్లు తగ్గించేస్తారని వైసీపీ వర్గాలు మొదటి నుంచి ప్రచారం చేస్తున్నాయి. కానీ ఐదు జాబితాల విడుదల తర్వాత దళిత నేతల్నే టార్గెట్ చేసినట్లుగా ఉంది. ఇది విమర్శలకు కారణం అవుతోంది. తీవ్రమైన వ్యతిరేకత ఉందని భావిస్తున్న అనేక నియోజకవర్గాల్లో రెడ్డి సామాజికవర్గాల ఎమ్మెల్యేలకు కనీస ఇబ్బంది కూడా లేకపోవడం ఆశ్చర్యకరంగా మారింది. వైసీపీ వ్యూహం ఏమిటో కానీ.. సొంత ఓటు బ్యాంక్ గా ఉన్న వర్గాల్లో తమనే టార్గెట్ చేస్తున్నారన్న భావన పెరుగుతోంది.
మార్పులకు గురవుతున్న వారి పెత్తనమంతా పెత్తందార్లే అనుభవించారు !
వైసీపీలో రిజర్వుడు నియోజకవర్గాల ఎమ్మెల్యేల పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పాల్సిన పని లేదు. సివిల్ సర్వీస్ అధికారిగా రిటైరయి రాజకయాల్లోకి వచ్చిన ఆర్థర్.. ఎమ్మెల్యేగా గెలిస్తే ఆయనను పక్కన పెట్టేశారు .ఎమ్మెల్యేగా ఉన్నంత కాలం… అక్కడ రెడ్డి సామాజికవర్గానికి చెందిన వైసీపీ నేత పెత్తనం చేశారు. ఇదేంటని ప్రశ్నించినందుకు కనీసం టిక్కెట్ ఇవ్వట్లేదని కూడా చెప్పకుండా పక్కన పెట్టేశారు. అన్నిరిజర్వుడు నియోజకవర్గాల్లోనూ అదే పరిస్థితి. పెత్తందారులుగా తాము వ్యవహరిస్తూ.. ఇప్పుడు అసలు తప్పులన్నీ దళిత వర్గాల ద్వారా జరుగుతున్నట్లుగా బిల్డప్ ఇస్తూ.. టిక్కెట్ల కసరత్తు చేస్తున్నారు. నిజానికి వైసీపీలో సగానికిపైగా ఉన్న రెడ్డి సామాజికవర్గాలు ఈ ఐదేళ్లలో చేసిన అరాచకం అంతా ఇంతా కాదు. జగన్ రెడ్డి నుంచి YSRCPలో ఉన్న వైవీ సుబ్బారెడ్డి, సాయిరెడ్డి, అయోధ్య రామిరెడ్డి, చెవిరెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పెద్ద ముఠాగా మారి చేసిన దందాలు.. వారికి అనుబంధంగా ఏర్పడిన చిన్న స్థాయి పెత్తందారుల రెడ్డి ముఠాలు ప్రజల్ని రాచిరంపాన పెట్టాయి. వీరందరి వల్లనే ప్రభుత్వం తుడిచిపెట్టుకుపోయేంత వ్యతిరేకతలో కూరుకుపోయింది. వారిని అలాగేఉంచి.. దళితుల్ని బలి చేసి.. వారి వల్లే తప్పు జరిగిందని.. వారిని తీసేశానని..తననను చూసి ఓట్లేయాలని ప్రజల వద్దకు వెళ్తే.. అంత కంటే దళిత ద్రోహం ఉండదు.
రిజర్వుడు నియోజకవర్గాల్లో దళితుల్ని తప్పించి.. దళితులకే ఇస్తారని కొంత మంది వితండవాదం చేస్తూంటారు. అసలు వేయాల్సిన మరక వేసి.. మళ్లీ దళితులకే టిక్కెట్లు ఇస్తున్నామని చెప్పడమే అసలు పెత్తందారితనం. అవి రిజర్వుడు నియోజకవర్గాలు. తప్పనిసరిగా వారికి ఇవ్వాల్సందే. కానీ దళితుల నుంచి బలమైన నాయకత్వం ఎదగకుండా.. వారిపై ఎప్పటికప్పుడు కుట్రలు చేయడం మాత్రం.. అసలైనపెత్తందారుల కుట్ర. దీన్ని దళితులే అర్థం చేసుకుని తమ ఆత్మగౌరవాన్ని కాపాడుకోవాల్సి ఉంది.