అడ్డంగా దొరికిన దొంగ కూడా నేను దొంగతనం చేయలేదనే అంటాడు. ఔను దొంగతనం చేశాను మీకు చేతయినంది చేసుకోండి అనే తెంపరితనం చాలా కొద్ది మందిలో ఉంటుంది. అయితే అది ఇన్ డైరక్ట్‌గా చెప్పే తెలివితేటలు చాలా అరుదైన దొంగల్లో ఉంటాయి. అలాంటి కేసు ఒకటి మనం ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో చూస్తున్నాం. దేశంలోనే ప్రసిద్ది చెందిన ఆ అక్రమాస్తుల దొంగ ఇప్పుడు అమెరికా కోర్టుల్లోనూ దొరికిపోయారు. అయినా అసలు ఆ కేసేమిటో తెలియదు ఆ చార్జిషీట్లో నా పేరు లేదు. మేము చేసుకున్న ఒప్పందాలన్నీ కేంద్రంతోనే ఉన్నాయి అని వాదిస్తున్నారు. అంతే కానీ ఆయన విచారణ చేయించుకోవాలని అనడం లేదు. అంతే కాదు ఇంత గొప్ప దోపిడీ చేసినందుకు .. తనకు శాలువాలు కప్పి సన్మానం చేయాల్సింది పోయి రాళ్లేస్తారా అని ఆశ్చర్యపోతున్నారు. జగన్ రెడ్డి తీరు చూసిన నేరాల్లో కరుడుగట్టిన వారు కూడా ఆశ్చర్యపోతారు. ఎందుకంటే అడ్డంగా దొరికిన తర్వాత కూడా అంత స్థితప్రజ్ఞత చూపడం అత్యంత అరుదైన జీవుల్లోనే ఉంటుంది.
ప్రతి దొంగా ఏదో ఓ రోజు దొరికిపోవాల్సిందే !
జగన్ రెడ్డి ఇచ్చిన చిల్లరకు కక్కుర్తి పడి ట్వీట్లు పెట్టి పోలీసులు తీసుకెళ్లి ఎక్కడ కొడతారోనని భయపడి దాక్కుని దాక్కుని తిరుగుతున్న రామ్ గోపాల్ వర్మకు జగన్ అంటే ఇష్టం. ఆయన తాను ఎలాంటి వారిని ఇష్టపడతారో గతంలో చెప్పారు. అదేమిటంటే.. చట్టబద్దంగా వ్యవహరించే వారిలో ఏముంటుంది.. చట్ట విరుద్ధంగా వ్యవహరిస్తూ వ్యవస్థల్ని ఎదిరిస్తూ అసాంఘిక శక్తులుగా మారిన వారే హీరోలని..వారినే తాను వర్షిప్ చేస్తానని ప్రకటించారు. ఆయన అభిమానం అటు దావూద్ ఇబ్రహీం నుంచి ఇటు జగన్మోహన్ రెడ్డి దాకా ఉంది. ఆయన రేంజ్ ఒకప్పుడు దావూద్ ఇబ్రహీమే..కానీ ఇప్పుడు జగన్. జగన్ రెడ్డి కూడా ఇలా వందల కోట్లు దోచేశాడని.. పిల్ల ఫ్యాక్షనిస్టుగా చాలా మందిని చంపించాడని ఆయన వర్షిప్ చేస్తూండవచ్చు. ఎవరికీ దొరకకుండా దోపిడీ చేస్తున్నారని భావిస్తూ ఉండవచ్చు. కానీ అందరూ దొరక్కుండా పాకిస్థాన్‌లో దాక్కోవడానికి దావూద్ ఇబ్రహీంలు కాలేరు. నూటికి 99.99 శాతం మంది దొరికిపోతారు. ఇప్పుడు జగన్ రెడ్డితో పాటు ఆయన్ను నమ్ముకున్న ఆర్జీవీది అదే పరిస్థితి. జగన్ రెడ్డి ఇప్పుడు తనను తాను కాపాడుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు. ఎందుకంటే ఆయన అవినీతి ఇప్పుడు అమెరికా కోర్టుల్లో ఉంది. ఇది ఆర్జీవీకి మరింత హీరోయిజంలా అనిపించవచ్చు. అందుకే టీడీపీ అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి ముందే చెప్పారు.. జగన్ రెడ్డి ఇప్పుడు అమెరికాలో న్యూయార్క్‌లో పోస్టర్ బాయ్. ఎందుకో చెప్పాల్సిన పని లేదు. రూ. 1750 కోట్లు జగన్ అదాని గ్రూపు నుంచి లంచం తీసుకున్నారన్న ఆరోపణలు చేయడానికి అమెరికాలోని ఎఫ్‌బీఐకి పనీ పాటా లేక కాదు.. పూర్తి ఆధారాలు ఉండబట్టే చేశారు. ఆ రూ. 1750 కోట్ల లెక్క కూడా బయటకు వస్తుంది. ఈ లోపు అదానీ వెళ్లి అమెరికాలో కేసు సెటిల్ చేసుకున్నా..అక్కడ వరకూ కేసు సెటిలైపోతుందేమో కానీ..ఇక్కడ కాదు. అదానీని అడ్డం పెట్టుకుని తాను లంచం తీసుకున్న విషయం బయటకు వస్తే ఆయనకే నష్టం కాబట్టి తనను కాపాడుతారని జగన్ దిలాసాగా ఉండవచ్చేమో కానీ.. ప్రతి దొంగ ఏదో ఓ రోజు దొరికిపోవాల్సిందే. దొరకకుండా అదే పనిగా దొంగతనాలు చేసుకునే వెసులుబాటు ఉండటం అనేది ప్రకృతి విరుద్ధం. ఇప్పుడు అదే జరిగింది.
FBI రిపోర్టులో పేరుంది – కళ్లుండి చూడలేరా ?
గంటన్నర పాటు ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబు గురించి..చంద్రబాబు హయాంలో జరిగిన ఒప్పందాల గురించి జగన్ చెప్పుకొచ్చారు. ఆ ఒప్పందాల్లో డబ్బులు చేతులు మారి ఉంటే ఐదేళ్లలో జగన్ కేసులు పెట్టి ఉండాల్సింది. ఆ ఒప్పందాల్లో అవినీతి జరిగిందని లెక్కలేనన్ని ఆరోపణలు చేశారు. విచారణలు చేయించారు. చివరికి ఏమీ దొరక్క పీపీఏలు ఏకపక్షంగా రద్దు చేయించారు. అయినా ఇప్పుడు అవినీతి జరిగిందని ఆరోపిస్తున్నారు. ఇప్పుడు కూడా చంద్రబాబు జగన్ చేసుకున్న పీపీఏపై విచారణ చేయించలేదు. ఆయనే రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయారు. అసలు విషయం చెప్పకుండా చాలా తక్కువకు కొన్నానని పత్తిత్తు కబుర్లు చెబుతున్నారు. పరువు నష్టం కేసులు వేస్తానని హెచ్చరికలు చేస్తున్నారు. అలా హెచ్చరికలు బెదిరింపులు చేసే బదులుగా .. శ్రీరెడ్డితో పాటు కొడాలి నాని, వల్లభనేని వంటి వాళ్లంతా గతంలో సర్టిఫికెట్ ఇచ్చినట్లుగా .. మగాడిలా దమ్మంటే విచారణ చేయించుకుని ఏం పీక్కుంటారో పీక్కోమని సవాల్ చేస్తే బాగుండేది. కనీసం తనకు ఆ సర్టిపికెట్ ఇచ్చిన వారి గౌరవాన్ని అయినా నిలబెట్టిన వారయ్యేవారు. కానీ అలాంటి ఆరోపణలు చేస్తే కేసు పెడతానని హెచ్చరించడం మరీ తేడాగా ఉంది. తెలంగాణలో అలా వంద కోట్లకు వేసిన పరువు నష్టం కేసులు అలాగే ఉన్నాయి. లోకేష్ సాక్షిపై విశాఖలో వేసిన రూ. 75 కోట్ల పరువు నష్టం కేసులు కూడా అలాగే ఉన్నాయి. అవి ఎప్పటికి తేలుతాయో కానీ.. కళ్ల ముందు కనిపించే నిజాల్ని మాత్రం కప్పి పుచ్చడం సాధ్యం కాదు. రఘురామ చెప్పినట్లు వైసీపీ ఫాలోయర్లు అంతా చదువులేని సన్నాసులే కాబట్టి.. జగన్ ఏం చెప్పినా.. సాక్షి ఏం రాసినా నమ్మేస్తారన్న నమ్మకం ఉంటే అదే వాదన వినిపించవచ్చు. కానీ ఇప్పుడు ప్రపంచం చాలా విస్తరించిందని.. సమాచార విప్లవం వచ్చిందని.. ఒక్క సాక్షిలో రాశారనో..రాయలేదనో ఓ విషయం ప్రపంచానికి తెలియదంటే అంతకంటే అమాయకత్వం ఉండదని తెలుసుకోవాలి. అలాంటి అమాయకత్వం ఉంటే బయటకు వస్తే మంచిది. ఎందుకంటే.. ప్రజలు అన్నీ తెలుస్తాయని ఎన్నికల ఫలితాలే గుర్తు చేసి ఉండాలి. కానీ తెలుసుకునే మనస్థత్వం లేదని అందరికీ తెలిసిందే కాబట్టి ఎవరూ ఏమీ చేయలేరు.
ప్రజలు ఇప్పటికే బడితెపూజ చేశారు.. చట్టప్రకార సన్మానాలే మిగిలాయి !
పాతికేళ్లలో ఏపీకి లక్ష కోట్లు మిగిల్చానని అదే సంపద సృష్టి అని అందులో ఓ పదిహేడు వందల యాభై కోట్లు తాను తీసుకుంటే పెద్ద తప్పేమిటన్నట్లుగా జగన్ రెడ్డి మాటలు ఉన్నాయి. ఇలాంటి పని చేసిన తనకు శాలువాలు కప్పాలని.. సన్మానాలు చేయాలని కానీ రాళ్లేస్తున్నారని ఆయన అంటున్నారు. కానీ ఆయన చేసిన నిర్వాకాలకు చేసిన దోపిడీకి..ప్రజలు ఎన్నికల్లో ప్రజాస్వామ్యబద్దంగా శాలువాలు కాదు.. వలువలు ఊడదీశారు. చప్పట్లు కాదు బడితే పూజ చేశారు. అయితే చట్టపరంగా చేయాల్సిన సన్మానాలు, శాలువాలు కప్పడాలు మాత్రం పెండింగ్ లో ఉన్నాయి. గతంలో చేసిన గొప్ప పనులకు ఇంత వరకూ సన్మానాలు జరగలేదు.దాని కోసమే అందరూ వెయింటింగ్. ఓ వైపు బాబాయ్ హత్య కేసులో చేసిన పనులకు కూడా సన్మానాలు జరగాల్సి ఉంది. వ్యవస్థల్ని మేనేజ్ చేసి..కొంత కాలం ప్రశాంతంగా ఉండి ఉండవచ్చు.. మరికొంత కాలం తప్పించుకోవచ్చు..కానీ ఎల్లకాలం సాధ్యం కాదు. ఎందుకంటే భారత రాజ్యాంగం వ్యవస్థల్ని అంత బలంగా తయారు చేసింది. వ్యవస్థల్ని నడిపేవాళ్లు అంత కఠినంగా లేకపోతే కొంత కాలం నేరస్తులు తప్పించుకోవచ్చు కానీ.. ఎల్లకాలం తప్పించుకోలేరని ఎన్నో ఉదంతాలు బయటపడ్డాయి. గతంలో చేసిన తప్పులకు పన్నెండేళ్లుగా సన్మానాలు పెండింగ్ లో ఉన్నాయి. వాటికి సంబంధించిన కదిలిక కొత్త సంవత్సరంలో అయినా రాకపోతే వ్యవస్థల పనితీరుపై ప్రజల్లోనే చర్చ జరుగుతుంది. ఆలోపు ఇప్పుడు నమోదైన కొత్త కేసుల్లో సన్మానాలకు సమయం దగ్గర పడుతుంది. లిక్కర్ స్కాంలో ఎంత దోపిడీ చేశారో.. ఇసుక స్కాంలో ఎంత దోపిడీ చేశారో.. అధికారాన్ని అడ్డం పెట్టుకుని విశాఖలోని బేపార్క్ నుంచి కాకినాడ పోర్టు వరకు ఎన్ని లాక్కున్నారో అన్నీ బయటకు వస్తాయి. అన్నింటి కంటే ముఖ్యంగా లంచాలుగా తీసుకున్న డబ్బులన్నీ ఏ తీరానికి చేర్చారో కూడా ఓ క్లారిటీ వస్తుంది.
కాస్త ఓపిక పడితే అన్ని రకాల సన్మానాలూ.. శాలువాలూ !
జగన్ రెడ్డి ప్రెస్‌మీట్‌కు చింపిరి గడ్డంతో వచ్చారు. ఆయన కళ్లల ధైర్యానికి బదులు ఓ దైన్యం కనిపిస్తోంది. ఆయన చుట్టూ ఎప్పుడూ ఉండే సీనియర్ నేతలు లేరు. సజ్జల రామకృష్ణారెడ్డి మాత్రమే ఉంటున్నారు. అధికారం ఉందని ఐదేళ్ల కాలంలో చేసిన నిర్వాకాల కారణంగా ఇప్పుడు కింది స్థాయి కార్యకర్త నుంచి పైస్థాయి నేత వరకూ అందరూ తమకు సన్మానాలు ఎక్కడ జరుగుతాయోనని సైలెంట్‌గా బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ఎవరికీ తాను ఉన్నానన్న భరోసా ఇచ్చే పరిస్థితిలో జగన్ లేరు. తాము ఎలాగోలా బయటపడితే చాలని ఎక్కువ మంది అనుకుంటున్నారు. ఇప్పుడు జగన్ రెడ్డి కోసం బకరా అవ్వడానికి బాలినేని కూడా రెడీగా లేరు. ఆయన కూడా మొత్తం తేల్చేశారు. అడ్డగోలుగా దోచుకుని డబ్బుతో ఎవర్నైనా ఓడించవచ్చని పెద్దిరెడ్డి లాంటి వాళ్లని ఊరి మీదకు వదిలారు..ఇప్పుడు వారే నోరు తెరిచే పరిస్థితుల్లో లేరు. నమ్మి అడ్డగోలు పనులు చేసిన ఐపీఎస్, ఐఏఎస్‌లు సన్మానాలు అందుకుంటున్నారు. శాలువాల కోసం ఎదురు చూస్తున్నారు. ఇంత ఘోరమైన పరిస్థితులు కళ్ల ముందు ఉన్నా.. తాను చాలా పెద్ద నీతి మంతుడినని జగన్ రెడ్డి చెప్పుకుటున్నారు. ఇప్పుడు ఆ మాట ఆయన తల్లి, చెల్లి కూడా నమ్మడం లేదు. ఇక సామాన్య జనం నమ్ముతారని ఆయన అనుకుంటే అంత కంటే పిచ్చితనం ఉండదు. కానీ అదే ఇప్పటికీ కొనసాగిస్తున్నారని.. తాజా ప్రెస్ మీట్‌తో తెలిపోయింది. ఆయన సలహాదారులు ఉన్నారో లేరో ఎవరికీ తెలియదు. ఆ సలహాదారులు చెప్పే మాటలు వింటారో లేదో కూడా తెలియదు. కానీ ఆయన మాత్రం.. అడ్డగోలుగా దొరికిపోయేలా దోపిడీ చేశారు. దొరికిపోయి బుకాయిస్తున్నారు.ఇలాంటి మనస్థత్వం ఉన్న వారికి కాస్త ఆలస్యంగా అయినా మన వ్యవస్థలు సన్మానాలు చేస్తాయి. శాలువాలు కప్పి పంపుతాయి. కాస్త ఓపిక పట్టాలంతే.