కొత్త ఏడాదిలోకి అడుగు పెట్టాం.. ! ఆంగ్ల న్యూ ఇయరా… తెలుగు సంవత్సరాదినా లాంటి చర్చలు పెట్టకోకుండా… ప్రపంచం అంతా ప్రామాణికంగా తీసుకుంటున్న క్యాలెండర్ మార్పును మనస్ఫూర్తిగా ఆహ్వానిద్దాం. ఇదేమి శుభదినం కాదు. కానీ… ప్రతి ఒక్కరూ… ఓ లక్ష్యం పెట్టుకోవడానికి ఉపయోగపడే ఓ రోజుగా మారిపోయింది. అందుకే ఈ రోజు ప్రత్యేకమే. ప్రతి ఒక్కరికి లక్ష్యాలుంటాయి. ప్రతి దశలోనూ లక్ష్యాలు పెట్టుకుని పని చేయాలి. లేకపోతే గమ్యం చేరలేరు. అలాంటి లక్ష్యాన్ని ఒక దాన్ని నిర్దేశించుకోవడానికి ఈ న్యూ ఇయర్ డే బాగా ఉపయోగపడుతుంది. దాన్ని సాధించడానికి ప్రయత్నిస్తారా.. విజయం సాధిస్తారా అన్నది.. తర్వాతి విషయం. అసలు ప్రయత్నించకపోవడం అనేది నిఖార్సైన పరాజయం. ప్రయత్నించి ఓడిపోయిన వాడు కూడా విజేతే. అంతుకే కొత్త ఏడాదిలో అందరూ కొత్త లక్ష్యాలు పెట్టుకుని విజేతలుగా నిలవాలని కోరుకుందాం..!
హ్యాపీ న్యూ ఇయర్ అని జోష్గా స్వాగతం పలికిన 2020 చాలా అంటే.. చాలా పీడకలల్ని మిగిల్చింది. ఇంత వరకూ ప్రపంచ యుద్ధాలు కూడా.. నాశనం చేయనంతగా.. ఒక్క వైరస్ కరోనా ప్రపంచాన్ని దెబ్బకొట్టింది. ప్రపంచవ్యాప్తంగా కొన్ని లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. ఏ యుద్ధంలోనూ ఇంత మంది ప్రాణాలు కోల్పోలేదు. అంత కంటే.. ముందు.. ప్రపంచానికి ఓ మానసిక రోగాన్ని కరోనా అంటించింది. కరోనా భయంతో కకావికలైన కుటుంబాలను చూశాం. అదే కరోనా కారణంగా జీవనోపాధి కోల్పోయిన వారిని చూశాం. ఎలా బతకాలా అని ఆత్మహత్యలకు పాల్పడిన వారినీ చూశాం. 2020 మిగిల్చిన విషాదాలు ఇవి. అలాగే నేర్పిన పాఠాలు కూడా. ఎలా నేర్చుకుంటాం.. ఏం నేర్చుకుంటామన్నది మన చేతిలోనే ఉంది.
అడుగు బయట పెట్టాలంటే భయం… వైరస్ సోకుతుందేమోనని భయం.. మనకు సోకితే కుటుంబానికి సోకుతుందేమోనని భయం… ఆత్మీయులకు సోకిందేమోనని భయం… ఈ భయాలతోనే వైరస్ మరింత బలపడింది.నిజానికి అది బలమైన వైరస్ కాదు. కానీ.. అప్పటికే అనారోగ్య సమస్యలతో ఉన్న వారిపై మాత్రం దారుణంగా ఎటాక్ చేస్తోంది. దీన్ని గుర్తించి… నిపుణులు చెప్పినట్లుగా కనీస జాగ్రత్తలు తీసుకుని ధైర్యంగా బతకడం నేర్చుకోవాలి. అప్పుడే కరోనాను ఎదుర్కోగలం. వ్యాక్సిన్ వస్తోంది కాబట్టి.. కరోనా పీడ పోతుందనుకోవడం భ్రమ. వ్యాక్సిన్ వచ్చినా.. అసలు కరోనా వైరస్ అంతమైపోయినా ఆ భయం అలాగే ఉంటుంది. కొత్త స్ట్రెయిన్ కావొచ్చు.. మరొకటి కావొచ్చు . పుడుతూనే ఉంటాయి. కొన్ని మల్టినేషనల్ కంపెనీలకు అదో మార్కెటింగ్ స్ట్రాటజీ అయినా ఆశ్చర్యపోనవసరం లేదు. అందుకే కరోనా అనేది ఇక ప్రపంచంలో స్థిరంగా ఉండిపోయే అవకాశం ఉంది. దాన్ని అధిగమించి బతికేయాలి. లేకపోయినా ఉందన్న భ్రమ మాత్రం.. ఎప్పటికీ ఉంటుంది.
2020 ఎక్కువగా మేలు చేసి ఉండకపోవచ్చు.. ఎప్పుడూ లేనంత నష్టాన్ని ఎదురయ్యేలా చేసి ఉండవచ్చు. కానీ ఈ నష్టం మీకొక్కరికి వచ్చింది కాదు. ప్రపంచం మొత్తానికి వచ్చింది. కానీ ఒక్క సారి ఇయర్ మొత్తాన్ని రివ్యూ చేసుకుంటే మీరు ఎంత ముందుకు వచ్చారో సులువుగానే అర్థమవుతుంది. కరోనా లేకపోతే.. మరింతగా విజయం సాధించేవాడినని మీలో మీకు నమ్మకం కలుగుతుంది. కాలమహిమే అది.
పరుగులు పెట్టేవాడైనా… ఉరుకులు పరుగుల మీద నడిచేవాడైనా.. చిన్నగా అడుగులు వేసేవాడైనా… ఎంతో కొంత మందుకెళ్తాడు. ఎంత ముందుకెళ్తాడు అనేదాన్ని పరిస్థితులు కొంత ప్రభావితం చేయవచ్చేమో కానీ… గమనాన్ని మాత్రం ఆపలేవు. కానీ నిలబడిన వాడు మాత్రం ముందుకు కదలడు. ఎక్కడివాడక్కడే ఉంటాడు. అలాంటి పరిస్థితిని తెచ్చుకోకూడదు. అందుకే… భయాలు విడి.. నిశ్చితంగా జీవితాన్ని ముందుకు ఉరికిద్దాం..!
మీకు .. మీ కుటుంబానికి ఈ ఏడాది మరపురాని సంతోషాల్ని, విజయాల్ని అందించాలని కోరుకుంటూ… హ్యాపీ న్యూ ఇయర్